National Engineers Day 2024: ఇంజినీర్ల కోసం ఒకరోజు ఉందని మీకు తెలుసా..
ABN , Publish Date - Sep 15 , 2024 | 09:28 AM
తన అద్భుత మేధోశక్తితో ఈ విపత్తుకు పరిష్కార మార్గాన్ని చూపించారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. . నేటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణ పనులు ..
సాంకేతికత రోజురోజు పెరుగుతోంది. ప్రతి రంగంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటికి కారణం ఇంజినీర్లు. నూతన ఆవిష్కరణలతో సమాజంలో పెనుమార్పులకు కారణమవుతున్నారు ఇంజినీర్లు. నేడు ఏదేశం చూసుకున్నా.. అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకం. అటువంటి ఇంజినీర్ల సేవలను గుర్తుచేసుకునేందుకు ఓ ప్రత్యేకమైన రోజుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా నిర్వహిస్తారు.
సమాజానికి ఇంజనీర్లు చేసిన అమూల్యమైన సేవలను గుర్తుచేసుకుంటూ.. వారిని సత్కరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇంజినీర్ల ప్రత్యేక సామర్థ్యాలను గుర్తించడంతో పాటు వారిలో మరింత విశ్వాసాన్ని నింపేందుకు ఈరోజు దోహదపడుతుంది. దేశంలోని అత్యంత ప్రసిద్ధ ఇంజినీర్లు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజినీర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1861 సెప్టెంబరు 15న జన్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశ అభివృద్ధికి గణనీయమైన కృషి చేశారు. మార్గదర్శక ఇంజినీర్‌గా ఆయన గుర్తింపుపొందారు. ఎంతోమంది యువ ఇంజినీర్లకు ఆయన ఒక స్ఫూర్తి. దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన కట్టడాల నిర్మాణంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య పాత్ర ఉంది. మైసూర్‌లోని ప్రసిద్ధ కృష్ణ రాజ సాగర డ్యామ్‌తో సహా అనేక గుర్తింపు పొందిన బ్యారేజ్‌ల నిర్మాణంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య భాగస్వామిగా ఉన్నారు. డెక్కన్ పీఠభూమికి నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు 1909లో హైదరాబాద్‌కు వరద నియంత్రణ వ్యవస్థ రూపొందించడంలో విశ్వేశ్వరయ్య కీలకంగా పనిచేశారు.
హైదరాబాద్‌లో..
1908లో భారీ వరదలను ఎదుర్కొని లక్షల మంది నిరాశ్రయులైన తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన అద్భుత మేధోశక్తితో ఈ విపత్తుకు పరిష్కార మార్గాన్ని చూపించారు. నేటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణ పనులు ఆయన ఆలోచన నుంచి వచ్చినవే. విశ్వశ్వరయ్య సూచనలతోనే హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాల పాటు వరద ముప్పును నివారించగలిగింది. అప్పట్లో నిజాం నవాబులు హైదరాబాద్ నగరంలో వరదలకు చెక్ పెట్టడానికి లెజండరీ ఇంజినీర్‌గా చెప్పుకునే మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఎంచుకున్నారు. 1920 కాలంలోనే హైదరాబాద్‌కు వరద ముప్పును ఆయన నివారించగలిగారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ దేశానికి అందించిన సేవలకు గుర్తుగా ఆయన జయంతిని ఇంజినీర్స్ డేగా జరుపుకుంటున్నారు.
ఇంజనీర్స్ డే చరిత్ర
భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై, ముఖ్యంగా ఆనకట్టలు, నీటిపారుదల నెట్‌వర్క్ డెలప్‌మెంట్‌లో తనదైన మార్క్ వేశారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సమాజానికి ఇంజనీర్లు చేసిన సేవలను గుర్తించేందుకు దేశ వ్యాప్తంగా సెస్టెంబర్15న ఇంజినీర్ల దినోత్సవంగా నిర్వహిస్తారు. జాతీయ ఇంజినీర్ల దినోత్సవం చాలా ముఖ్యమైనది. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో, సాంకేతికతను అభివృద్ధి చేయడంలో, ప్రపంచవ్యాప్తంగా జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ఇంజినీర్ల పాత్ర కీలకం. నేటి ఆధునిక యుగంలో రోజుకో కొత్త ఆవిష్కరణలు బయటకు వస్తున్నాయంటే అందులో ఇంజినీర్ల పాత్ర ఎనలేనిది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here