Share News

Bullet Train: శరవేగంగా బుల్లెట్ రైలు పనులు.. అందుబాటులోకి వచ్చేది అప్పుడే

ABN , Publish Date - Feb 23 , 2024 | 06:54 PM

భారత్‌ తొలి బుల్లెట్ ప్రాజెక్ట్(Bullet Train) మొదటి దశ పనులు వడివడిగా జరుగుతున్నాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav) శుక్రవారం ముంబయిలో టన్నెల్ పనుల్ని ప్రారంభించారు.

Bullet Train: శరవేగంగా బుల్లెట్ రైలు పనులు.. అందుబాటులోకి వచ్చేది అప్పుడే

ముంబయి: భారత్‌ తొలి బుల్లెట్ ప్రాజెక్ట్(Bullet Train) మొదటి దశ పనులు వడివడిగా జరుగుతున్నాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav) శుక్రవారం ముంబయిలో టన్నెల్ పనుల్ని ప్రారంభించారు. ముంబయిలోని విక్రోలిలో పనుల పరిశీలన అనంతరం ఆయన ప్రాజెక్ట్ విశేషాలు వివరించారు. "సొరంగం దాదాపు 40 అడుగుల వెడల్పుతో నిర్మిస్తున్నారు.

దాని లోపల రైలు గంటకు 320 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించింది. సీఎంగా ఏక్‌నాథ్ షిండే బాధ్యతలు స్వీకరించాక ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. అన్ని వైపులా ఏకకాలంలో పనులు జరుగుతున్నాయి. ఇది భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ కారిడార్ ప్రాజెక్ట్. తొలి దశ.. 2026 జులై-ఆగస్టు మధ్యలో సూరత్ - బిలిమోరా మధ్య అందుబాటులోకి వస్తుంది. ఈ రైల్వేలో షింకన్‌సేన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఇది ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన వ్యవస్థలలో ఒకటి" అని వైష్ణవ్ వెల్లడించారు.


మోదీ చేతులమీదుగా..

ముంబయి - అహ్మదాబాద్ తొలి బుల్లెట్ ప్రాజెక్టును ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే 2017 సెప్టెంబర్ 14న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్‌కి ముంబయి-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ అని పేరు పెట్టారు. గుజరాత్ వైపు ఈ ప్రాజెక్టు నిర్మాణం దాదాపుగా పూర్తయింది. మొత్తం రూ.1.10 లక్షల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. నిజానికి.. దీనిని 2022 నాటికే పూర్తి చేయాలని అనుకున్నారు.

కానీ, భూసేకరణలో ఆటంకాలు రాకడంతో ఆలస్యం అయ్యింది. ఈ రైలు కారిడార్‌ పొడవు 508.17 కి.మీలు. మహారాష్ట్రలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, శిల్‌ఫాటా మధ్య 21 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో భాగంగా.. 7 కిలోమీటర్ల సముద్రగర్భ రైలు సొరంగం నిర్మిస్తున్నారు. గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా జరోలి గ్రామ సమీపంలో ఉన్న 350 మీటర్ల పొడవు, 12.6 మీటర్ల వ్యాసం కలిగిన మొదటి కొండ సొరంగాన్ని పూర్తి చేశారు. సూరత్‌లోని ఎన్‌హెచ్ 53పై 70 మీటర్ల పొడవు, 673 మెట్రిక్ టన్నుల బరువుతో మొదటి స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. అలాంటి 28 వంతెన నిర్మాణంలో ఉన్నాయి. ఈ రైలు సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. అహ్మదాబాద్‌ నుంచి ముంబయికి కేవలం మూడు గంటల్లోనే చేరుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 23 , 2024 | 07:01 PM