Share News

Karnataka BJP: కర్ణాటకలో బీజేపీ సర్జికల్ స్ట్రైక్.. ఏకంగా తొమ్మిది మందిని..

ABN , Publish Date - Mar 14 , 2024 | 09:50 PM

కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో బీజేపీ (BJP) హైకమాండ్ ‘సర్జికల్ స్ట్రైక్’కు (Surgical Strike) దిగింది. ఏకంగా తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టేసి, వారి స్థానంలో కొత్తవారిని రంగంలోకి దింపుతోంది. ఇటీవల ప్రకటించిన రెండో జాబితాలో భాగంగా.. ఎనిమిది స్థానాలకు గాను కొత్త అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.

Karnataka BJP: కర్ణాటకలో బీజేపీ సర్జికల్ స్ట్రైక్.. ఏకంగా తొమ్మిది మందిని..

కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో బీజేపీ (BJP) హైకమాండ్ ‘సర్జికల్ స్ట్రైక్’కు (Surgical Strike) దిగింది. ఏకంగా తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టేసి, వారి స్థానంలో కొత్తవారిని రంగంలోకి దింపుతోంది. ఇటీవల ప్రకటించిన రెండో జాబితాలో భాగంగా.. ఎనిమిది స్థానాలకు గాను కొత్త అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఆ కొత్త అభ్యర్థుల్లో.. మైసూర్ రాజవంశానికి చెందిన యదువీర్ వడియార్, మాజీ ప్రధాని దేవెగౌడ అల్లుడు డాక్టర్ సీఎన్ మంజునాథ్, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, బీ శ్రీరాములు, బసవరాజ్ క్యావతీర్, ఎస్ బాలరాజ్, గాయత్రి సిద్ధేశ్వర్, వీ సోమన్న తదితరులు ఉన్నారు.

అయితే.. సిట్టింగ్ ఎంపీలను బీజేపీ ఎందుకు పక్కన పెట్టిందన్నది ఇక్కడ అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఇంతకీ ఆ ఎంపీలు ఎవరంటే.. ప్రతాప్ సింహా, నళిన్ కుమార్ కటీల్, సదానంద గౌడ, జీఎస్ బసవరాజు, కరాడీ సంగన్న అమరప్ప, వై దేవేంద్రప్ప, శివకుమార్ ఉదాసి, వీ శ్రీనివాస్ ప్రసాద్. ఈ ఎనిమిది మందిలో ప్రతాప్ సింహా పేరు పార్లమెంట్ సెక్యూరిటీ బ్రీచ్ సమయంలో మార్మోగిపోయింది. ఎందుకంటే.. పార్లమెంట్‌లో అలజడి సృష్టించిన నిరసనకారులు, ఆ ఎంపీ సంతకం చేసిన విజిటర్ పాస్‌తోనే లోపలకు వెళ్లారు. ఈ కారణంగానే ఆయనకు మరోసారి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఇవ్వలేదన్న అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఆయన స్థానంలో మైసూర్ యువరాజు యదువీర్ వడియార్ ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.


ఇక నళిన్ కుమార్ కటీల్ స్థానంలో కోట శ్రీనివాస్ పూజారిని అభ్యర్థిగా ప్రకటించడం షాక్‌కి గురి చేసింది. ఎందుకంటే.. కటీల్ మూడుసార్లు దక్షిణ కన్నడ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే.. మంగళూరులో బీజేపీ యువమోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారు దారుణ హత్యకు గురయ్యాక, కటీల్‌ అధికార వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఈ కేసుని ఆయన హ్యాండిల్ చేసిన తీరుపై స్థానిక బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే.. ఆయన్ను పక్కన పెట్టి, శ్రీనివాస్ పూజారిని దక్షిణ కన్నడ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి అభ్యర్థిగా నిలబెట్టింది. మరోవైపు.. బెంగళూరు నార్త్ లోక్‌సభ స్థానం నుంచి నాలుగుసార్లు ఎంపీగా పనిచేసిన సదానంద గౌడను కూడా తొలగించి, శోభా కరంద్లాజేను ఎంపిక చేశారు.

బీజేపీ అంతర్గత వ్యక్తి ఒకరు మాట్లాడుతూ.. 2021లో వైరల్ అయిన ఒక వీడియో సదానంద గౌడ రాజకీయ జీవితానికి కళ్లెం వేసిందని పేర్కొన్నారు. ఆ వీడియోలో సదానంద గౌడ గుర్తు తెలియని మహిళతో మాట్లాడుతూ కనిపించారు. అయితే.. ఇది తన ఇమేజ్‌ని దెబ్బతీసేందుకే ఎవరో సృష్టించారని ఆయన పేర్కొన్నారు. చివరికి ఆయన 2023 నవంబర్‌లో ఎన్నికల రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక ఇతర ఎంపీలను సైతం ఆయా కారణాల వల్ల పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు ఆయా స్థానాల్లో కుల సమతుల్యతను కాపాడుకోవడానికి బీజేపీ రెండో జాబితాలో భాగంగా.. కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 14 , 2024 | 10:48 PM