Share News

BJP MLA Ganpat Gaikwad: మిత్రపక్ష నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు.. ఆ కారణంతోనే కాల్చానన్న గైక్వాడ్

ABN , Publish Date - Feb 03 , 2024 | 04:25 PM

మహారాష్ట్ర రాజకీయాల్లో తాజాగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ మిత్రపక్షమైన శివసేన నాయకుడు మహేశ్ గైక్వాడ్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటన కళ్యాణ్ పార్లమెంటరీ సెగ్మెంట్ పరిధిలోని ఉల్లాస్‌నగర్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

BJP MLA Ganpat Gaikwad: మిత్రపక్ష నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు.. ఆ కారణంతోనే కాల్చానన్న గైక్వాడ్

మహారాష్ట్ర రాజకీయాల్లో తాజాగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ మిత్రపక్షమైన శివసేన నాయకుడు మహేశ్ గైక్వాడ్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటన కళ్యాణ్ పార్లమెంటరీ సెగ్మెంట్ పరిధిలోని ఉల్లాస్‌నగర్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. భూ వివాదంపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో గణపత్ ఈ కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మహేశ్ గైక్వాడ్‌తో పాటు మరో మద్దతుదారు గాయపడ్డారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. ఆత్మరక్షణ కోసం, అలాగే తన కొడుకుని పోలీస్ స్టేషన్‌లో కొట్టినందుకే తాను ఈ కాల్పులు జరిపానని గణపత్ పేర్కొన్నాడు. ఇందుకు తాను పశ్చాత్తాపం చెందడం లేదని కూడా బదులిచ్చాడు.


ఒక న్యూస్ ఛానెల్‌తో బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ‘‘అవును, నేనే మహేశ్ గైక్వాడ్‌పై కాల్పులు జరిపాను. ఇందుకు నాకేమీ పశ్చాత్తాపం లేదు. పోలీస్ స్టేషన్ లోపల పోలీసుల ఎదుటే నా కొడుకు కొడుతుంటే.. నేను చూస్తూ ఊరికే ఉండాలా’’ అని చెప్పాడు. ఇదే సమయంలో ఆయన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. రాష్ట్రంలో నేరస్థుల రాజ్యాన్ని సృష్టించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు. ‘‘తనని ఎంతో నమ్మిన ఉధ్ధవ్ ఠాక్రేనే ఏక్‌నాథ్ షిండే మోసం చేశాడు. అతడు బీజేపీని కూడా మోసం చేస్తాడు. అతడు నా వద్ద నుంచి కోట్లాది రూపాయలు అప్పుగా తీసుకొని, ఇంతవరకూ చెల్లించలేదు. మహారాష్ట్ర బాగుపడాలంటే.. ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేయాలి. ప్రధాని మోదీకి, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కి ఇది నా విన్నపం’’ అని గణపత్ గైక్వాడ్ చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.

అంతేకాదు.. తాను చేసిన మంచి పనులకు సీఎం తనయుడు, ఎంపీ అయిన శ్రీకాంత్ షిండే క్రెడిట్ కొట్టేస్తున్నాడని గణపత్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. ఏక్‌నాథ్ ముఖ్యమంత్రిగా కొనసాగితే.. మహారాష్ట్రలో నేరగాళ్లు మాత్రమే పుడతారని, తనలాంటి మంచి వ్యక్తిని కూడా క్రిమినల్‌గా మార్చారని చెప్పాడు. తన కొడుకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. అతని పట్ల సేన నాయకుడి వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారని, అదే వారిపై కాల్పులు జరిపేందుకు తనని ప్రేరేపించిందని వివరణ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్‌లో ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిపాడు. కాగా.. పదేళ్ల క్రితం ఎమ్మెల్యే కొనుగోలు చేసిన ప్లాట్‌ విషయంలో ఈ వివాదం చోటు చేసుకుంది. కొన్ని చట్టపరమైన సమస్యలు ఉన్నాయని, అయితే కోర్టులో తాను ఈ కేసు గెలిచానని, కానీ మహేష్ గైక్వాడ్ దాన్ని బలవంతంగా ఆక్రమించాడని గణపత్ ఆరోపించాడు.

Updated Date - Feb 03 , 2024 | 04:25 PM