Bengaluru: బీజేపీ నేతలకు అస్త్రంగా మారిన సీఎం ఆర్థిక సలహాదారు వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 12 , 2024 | 10:41 AM
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీలతో రాష్ట్ర ఖజానాకు రూ.58వేల కోట్లు భారమని సీఎం ఆర్థిక సలహాదారుడు బసవరాజరాయరెడ్డి వ్యాఖ్యలు బీజేపీ నేతలకు అస్త్రంగా మారాయి.

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీలతో రాష్ట్ర ఖజానాకు రూ.58వేల కోట్లు భారమని సీఎం ఆర్థిక సలహాదారుడు బసవరాజరాయరెడ్డి వ్యాఖ్యలు బీజేపీ నేతలకు అస్త్రంగా మారాయి. రాయరెడ్డి మీడియాతో మాట్లాడిన వేళ ఐదు గ్యారెంటీలతో రాష్ట్ర ఖజానాకు తీరని భారం కా నుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా గ్యారెంటీలు అమలు చేయాల్సి వచ్చినందున ఖజానాకు రూ.58వేల కోట్ల మేర భారం పడనుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు ఏవిధమైన ప్రణాళికలు రూపొందించాలనే అంశంపై చర్చించామన్నారు. పథకాల అమలుపై సంస్కరణలు లేదా మార్పులు వంటి అంశాలపైనా చర్చలు జరిగాయన్నారు. ఎన్నికలకు ముందు నుంచి ఐదు గ్యారెంటీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై పెనుభారం పడనుందని చెబుతున్నామని, అయినా అధికారంలోకి వచ్చేందుకు అన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టారని బీజేపీ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా అభిప్రాయపడింది.