Share News

China: మంత్రి జైశంకర్ వ్యాఖ్యలపై మళ్లీ రెచ్చిపోయిన చైనా!

ABN , Publish Date - Mar 25 , 2024 | 07:10 PM

అరుణాచల్ ప్రదేశ్ తమదేనన్న చైనా వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఖండించిన నేపథ్యంలో చైనా మరోసారి రెచ్చిపోయింది.

China: మంత్రి జైశంకర్ వ్యాఖ్యలపై మళ్లీ రెచ్చిపోయిన చైనా!

ఇంటర్నెట్ డెస్క్: అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) తమదేనన్న చైనా (China) వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఖండించిన నేపథ్యంలో చైనా మరోసారి రెచ్చిపోయింది. భారత దురాక్రమణకు పూర్వం అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమేనని చెప్పింది. అక్కడ చైనా పరిపాలనా వ్యవస్థ కూడా ఉండేదని చెప్పుకొచ్చింది. 1987లో భారత్ చట్ట వ్యతిరేకంగా అరుణాచల్ ప్రదేశ్ ఆక్రమించుకుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి సోమవారం జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. అప్పట్లోనే తాము భారత్ తీరును ఖండించామని గుర్తు చేశారు. భారత్ చర్యలు నిరుపయోగమని, చైనా తీరు మారదని తాము అప్పుడే కుండబద్దలు కొట్టామని చైనా ప్రతినిధి చెప్పుకొచ్చారు.


అరుణాచల్ ప్రదేశ్‌ సరిహద్దు వెంబడి భద్రత పెంపొందించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సెలా సొరంగమార్గాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. సరిహద్దు వెంబడి సైన్యాలను మోహరించేందుకు ఉద్దేశించిన ఈ సొరంగం మార్గానికి ప్రస్తుతం వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏర్పడింది. ఇది భరించలేని చైనా..అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పలు మార్లు ప్రకటించింది. ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది.


ఇదిలా ఉంటే చైనా విస్తరణవాద ధోరణులను భారత్ ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తోంది. ఇటీవల చైనా వ్యాఖ్యలపై మంత్రి జైశంకర్ మండి పడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ చైనాదన్న ఆలోచనే అసంబద్ధమని, హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. అరుణాచల్ ప్రదేశ్‌ భారత్‌లో సహజసిద్ధ భాగమని అన్నారు. మరోవైపు, అమెరికా కూడా చైనా వ్యాఖ్యలను ఖండించింది. సరిహద్దు రాష్ట్రం భారత భూభాగమని తామెప్పుడో గుర్తించామని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2024 | 07:16 PM