Share News

Delhi: భారత అమ్ముల పొదిలోకి ‘రాంపేజ్‌’ క్షిపణులు

ABN , Publish Date - Apr 28 , 2024 | 04:30 AM

భారత యుద్ధ విమానాలకు మరో అస్త్రం జతపడింది. ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసిన లాంగ్‌ రేంజ్‌ సూపర్‌ సానిక్‌ ‘రాంపేజ్‌’ క్షిపణులను వాయుసేన, నౌకా దళాలకు అందజేశారు.

Delhi: భారత అమ్ముల పొదిలోకి ‘రాంపేజ్‌’ క్షిపణులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27: భారత యుద్ధ విమానాలకు మరో అస్త్రం జతపడింది. ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసిన లాంగ్‌ రేంజ్‌ సూపర్‌ సానిక్‌ ‘రాంపేజ్‌’ క్షిపణులను వాయుసేన, నౌకా దళాలకు అందజేశారు. వీటిని ఆకాశం నుంచి నేల పైకి ప్రయోగిస్తారు. ఇవి 250 కి.మీ.దూరంలో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. టీవల ఇరాన్‌పై జరిగిన దాడిలో ఇజ్రాయెల్‌ వీటిని ప్రయోగించినట్టు సమాచారం. వాయుసేనలోని ఎస్‌యూ-30 ఎంకెఐ, మిగ్‌-29 యుద్ధ విమానాలకు, జాగ్వార్‌ ఫైటర్‌ జెట్లకు ఈ క్షిపణులను అమర్చుతారు.


2020లో చైనాతో సరిహద్దు వివాదం తలెత్తడంతో రక్షణ మంత్రిత్వ శాఖ కల్పించిన ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించుకొని సైన్యం ఈ క్షిపణులను కొనుగోలు చేసింది. 2019లో బాలాకోట్‌ దాడుల్లో ఉపయోగించిన స్పైస్‌-2000 క్షిపణుల కన్నా ‘రాంపేజ్‌’లు ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తాయి. కాగా, 15 రోజుల క్రితం అండమాన్‌-నికోబార్‌ దీవుల్లో ‘రాక్స్‌’ (క్రిస్టల్‌ మేజ్‌-2) బాలిస్టిక్‌ మిస్సైళ్లను భారత్‌ విజయవంతంగా ప్రయోగించింది. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా ‘రాంపేజ్‌’లను స్వదేశంలోనే తయారు చేయాలని కూడా వాయుసేన భావిస్తోంది.

Updated Date - Apr 28 , 2024 | 06:36 AM