మళ్లీ రైతాంగం భగ్గు
ABN , Publish Date - Dec 07 , 2024 | 05:23 AM
కనీస మద్దతు ధర (ఎంఎ్‌సపీ)కు కేంద్రం చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌తో రైతన్న మరోసారి గర్జించాడు.
శంభు నుంచి ఢిల్లీకి 101 మంది రైతుల పాదయాత్ర,
బారికేడ్లు పెట్టి ఆపేసిన పోలీసులు
వాటిని తొలగించి ముందుకు సాగేందుకు అన్నదాతల యత్నం
అడ్డుకున్న పోలీసులు.. బాష్పవాయువు ప్రయోగం.. ఆరుగురు రైతులకు గాయాలు
న్యూఢిల్లీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కనీస మద్దతు ధర (ఎంఎ్‌సపీ)కు కేంద్రం చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌తో రైతన్న మరోసారి గర్జించాడు. పంజాబ్-హరియాణా సరిహద్దులోని శంభు శిబిరం నుంచి రైతులు శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ దిశగా పాదయాత్ర (జాతా) ప్రారంభించారు. కొంతదూరం సాగగానే హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. అయినా రైతులు అడుగు ముందుకేశారు. దీంతో పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఎనిమిది మంది రైతులు గాయపడ్డారు. దరిమిలా పాదయాత్రను శుక్రవారం ఒక్కరోజు నిలిపివేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అంతకుముందు ఉదయం 101 మంది రైతులు తమ సంఘాల జెండాలను చేతబట్టి ‘చలో ఢిల్లీ’ పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి.. బారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ‘సత్నాం వాహెగురూ’ అని నినదిస్తూ రైతులు ముందుకు కదిలారు. బారికేడ్లను వారిలో కొందరు తొలగించారు. ఇనుప వలను గగ్గర్ నదిపై నిర్మించిన వంతెనపైకి విసిరేశారు. అయితే తొలి అంచె వరకే వారు ముందుకెళ్లగలిగారు. ఆ తర్వాత వారు అడుగు కూడా వేయకుండా పోలీసులు అడ్డుకున్నారు.

ఓ రైతు సాహసంతో పోలీసు బలగాలు ఏర్పాటుచేసుకున్న తాత్కాలిక షెడ్‌పైకి ఎక్కాడు. టియర్ గ్యాస్ గోళాల ప్రయోగంతో పొగ సోకకుండా చాలా మంది రైతులు గోనె సంచులను కళ్లు, నోటికి అడ్డుపెట్టుకుని అటూ ఇటూ పరుగులు తీశారు. పోలీసులు నీటి ఫిరంగి వాహనాలను కూడా మోహరించారు. అంబాలా జిల్లా అంతటా నిషేధాజ్ఞలు విధించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేశారు. యాత్ర సాగే తొమ్మిది గ్రామాల్లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్ సేవలను నిలిపివేశారు. దీంతో శుక్రవారం యాత్రను సస్పెండ్ చేస్తున్నట్లు రైతు సంఘం నేత సర్వన్‌సింగ్ పంధేర్ ప్రకటించారు. గాయపడిన ఆరుగురు రైతులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సమావేశమై తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తాయన్నారు. ట్రాక్టర్--ట్రాలీలను తీసుకురాకుండా యాత్ర చేపడితే తమకు అభ్యంతరం లేదని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు చెందిన బీజేపీ నేతలు ప్రకటించారని.. ఇప్పుడు పాదయాత్రను కూడా అడ్డుకున్నారని ఆక్షేపించారు. ఇంకోవైపు.. ఖనౌరీ వద్ద చేపట్టిన తన ఆమరణ దీక్షను సంయుక్త కిసాన్ మోర్చా నేత జగ్జీత్‌సింగ్ దల్లెవాల్ శుక్రవారం కూడా కొనసాగించారు.
రైతుల డిమాండ్లు ఇవీ..
కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలని.. రైతు రుణాలను మాఫీ చేయాలని.. రైతులకు, రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలని.. అన్నదాతలపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని.. కరెంటు చార్జీలు పెంచకూడదని.. 2013 భూసేకరణ చట్టాన్ని పునరుద్ధరించాలని.. 2020-21లో ఉవ్వెత్తున జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలని.. యూపీలోని లఖీంపూర్ ఖేరీలో 2021లో చోటుచేసుకున్న హింసాకాండ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి రైతులు శంభు, ఖనౌరీ వద్ద మకాం వేసి ఉద్యమిస్తున్నారు. ఫిబ్రవరి 18న కేంద్రప్రభుత్వ ప్రతినిధులు వారితో చర్చలు జరిపారు. ఆ తర్వాత వారి వద్దకు ఎవరూ రాలేదు. కాగా.. ‘చలో ఢిల్లీ’ యాత్రకు జైరాం రమేశ్ మద్దతు ప్రకటించారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం మద్దతు ధర ఇవ్వాలన్నారు.