Share News

Air Force One: అమెరికా అధ్యక్షుడి ‘ఎయిర్‍‌ఫోర్స్ వన్’లో వరుస చోరీలు.. తెరవెనుక ఎవరో తెలిస్తే షాకే!

ABN , Publish Date - Apr 01 , 2024 | 04:34 PM

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఎంత భద్రత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆయనపై ఈగ కూడా వాలనివ్వనంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అలాంటి వ్యక్తి ఉపయోగించే ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’ విమానంలో గత కొన్ని సంవత్సరాల నుంచి వరుస చోరీలు జరుగుతున్నాయి.

Air Force One: అమెరికా అధ్యక్షుడి ‘ఎయిర్‍‌ఫోర్స్ వన్’లో వరుస చోరీలు.. తెరవెనుక ఎవరో తెలిస్తే షాకే!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు (Joe Biden) ఎంత భద్రత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆయనపై ఈగ కూడా వాలనివ్వనంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అలాంటి వ్యక్తి ఉపయోగించే ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’ (Air Force One) విమానంలో గత కొన్ని సంవత్సరాల నుంచి వరుస చోరీలు జరుగుతున్నాయి. విస్కీ, వైన్ గ్లాసెస్, బంగారు పూత పూసిన పింగాణీ ప్లేట్లతో పాటు మరెన్నో చిన్న చిన్న వస్తువులు చోరీకి గురయ్యాయి. ఈ విషయాన్ని ఇటీవల గుర్తించిన భద్రతా సిబ్బంది.. చోరీకి పాల్పడిన వ్యక్తులను కనుగొని, ఇంకోసారి ఇలా చేయొద్దని సున్నితంగా హెచ్చరించారు. అలాగే.. వారి వద్ద నుంచి కొన్ని వస్తువులను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ.. ఈ చోరీకి పాల్పడిన వ్యక్తులెవరో తెలుసా? అధ్యక్షుడి పర్యటనలో.. ఆయనతో వెళ్లే మీడియా కరెస్పాండెంట్లు!

Viral Video: అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేతులు, కాళ్లు కట్టేశారు.. కిడ్నాప్ నిజమేనా?


సాధారణంగా.. అమెరికా అధ్యక్షుడు అధికారిక పర్యటనలకు వెళ్లినప్పుడు, ఆయన తనతో పాటు కొందరు మీడియా కరెస్పాండెంట్లను ఎయిర్‍‌ఫోర్స్ వన్ విమానంలో తీసుకెళ్తారు. ఆ టైంలోనే సదరు సిబ్బంది విమానంలో ఉన్న వైన్ గ్లాసెస్, బంగారపు పూత పూసిన ప్లేట్లు, ఇతర వస్తువులను ఎవరికీ తెలియకుండా తమ బ్యాగుల్లో వేసుకొని వెళ్లిపోతున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన శ్వేతసౌధం ట్రావెల్‌ ఆఫీస్‌ (White House Travel Office) ఈ విషయాన్ని గుర్తించింది. ఎయిర్‍‌ఫోర్స్ వన్‌లో కొంత సామాగ్రి కనిపించకపోవడంతో.. దర్యాప్తు చేపట్టారు. చివరికి మీడియా కరెస్పాండెంట్లే ఆ వస్తువుల్ని తీసుకెళ్లారని వెల్లడవ్వడంతో.. చోరీ చేసిన వారిని పిలిపించి, వస్తువులు సేకరించి, ఇకపై ఇలా చేయొద్దని సూచించారు. అయితే.. ఎయిర్‍‌ఫోర్స్ వన్‌లో ప్రయాణించామనే జ్ఞాపకం కోసం విమానంలోని వస్తువుల్ని తీసుకెళ్లేవాళ్లమని మీడియా సిబ్బంది పేర్కొంది.

India - China: అరుణాచల్ ప్రదేశ్ వారిదేనట.. తీరు మార్చుకోని డ్రాగన్..

దీనిపై వైట్‌ హౌస్‌ కరెస్పాండెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కెల్లి ఓడేనియల్‌ (ఎన్‌బీసీ) మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలు మానుకోవాల్సిందిగా తాము తోటి సభ్యుల్ని హెచ్చరించామన్నారు. ఆ విమానంలో ప్రయాణించామనే జ్ఞాపకార్థంగా వస్తువుల్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, ఆ విమానంలో మీరు ఉన్న ఫోటోలను సిబ్బంది ద్వారా మెయిల్ చేస్తామని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ ఘటనపై వైట్ హౌస్ అధికారులు మాట్లాడుతూ.. మీడియా సిబ్బందిని ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, చోరీలను ఆపడమే లక్ష్యమని వెల్లడించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 01 , 2024 | 04:37 PM