Share News

కుమారుడికి బైడెన్‌ క్షమాభిక్ష

ABN , Publish Date - Dec 03 , 2024 | 04:37 AM

మరి కొద్దిరోజుల్లో అధికార పీఠం నుంచి దిగిపోబోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌..

కుమారుడికి బైడెన్‌ క్షమాభిక్ష

దిగిపోయే ముందు సంచలన నిర్ణయం

న్యూయార్క్‌, డిసెంబరు 2: మరి కొద్దిరోజుల్లో అధికార పీఠం నుంచి దిగిపోబోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. అక్రమ ఆయుధ కొనుగోలు, పన్ను ఎగవేత కేసుల్లో నిందితుడుగా ఉన్న తన కుమారుడు హంటర్‌ బైడెన్‌కుసంపూర్ణ, బేషరతు క్షమాభిక్షను ప్రసాదించారు! హంటర్‌పై పన్ను ఎగవేతకు సంబంధించి తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో అతడి నేరం రుజువైతే 17 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే.. మాదక ద్రవ్యాలను వినియోగించే వ్యక్తి అయి ఉండీ తుపాకీని కలిగి ఉండడంపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అతడికి 25 ఏళ్ల దాకా శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసుల్లో అతడికి శిక్ష పడితే.. ఒక సిటింగ్‌ ప్రెసిడెంట్‌ కుమారుడు దోషిగా తేలడం అమెరికా చరిత్రలోనే ఇది తొలిసారి అయ్యేది. కానీ, ఆదివారం అనూహ్యంగా బైడెన్‌ అతడికి క్షమాభిక్ష ప్రసాదించడం సంచలనం సృష్టించింది. ‘‘న్యాయ వ్యవస్థ నిర్ణయాల్లో నేను జోక్యం చేసుకోనని అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచీ చెబుతూనే ఉన్నా. అందుకే.. ఇన్నాళ్లుగా నా కుమారుణిపై అన్యాయంగా విచారణ జరుపుతున్నా చూస్తూ ఉండిపోయాను. కానీ, నా కుమారుడిపై పెట్టిన కేసులన్నీ.. నాపై దాడి చేయడానికి రాజకీయ ప్రత్యర్థులు పన్నిన కుట్రలో భాగమే. అందుకే దీనిపై నేనొక నిర్ణయం తీసుకున్నా. దీన్ని అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నా’’ అని బైడెన్‌ పేర్కొన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 04:38 AM