Share News

Pakistan: పాకిస్థాన్ ఓట్ల లెక్కింపు.. ఇమ్రాన్, షరీఫ్ పార్టీల హోరాహోరీ పోరు

ABN , Publish Date - Feb 09 , 2024 | 11:41 AM

ఉగ్రదాడి, ఇంటర్నెట్‌పై విధించిన ఆంక్షలను సడలించిన ఒక రోజు తరువాత పాకిస్థాన్‌లో(Pakistan) మళ్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 265 పార్లమెంటు స్థానాలకుగానూ ఇప్పటివరకు 12 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

Pakistan: పాకిస్థాన్ ఓట్ల లెక్కింపు.. ఇమ్రాన్, షరీఫ్ పార్టీల హోరాహోరీ పోరు

కరాచీ: ఉగ్రదాడి, ఇంటర్నెట్‌పై విధించిన ఆంక్షలను సడలించిన ఒక రోజు తరువాత పాకిస్థాన్‌లో(Pakistan) మళ్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 265 పార్లమెంటు స్థానాలకుగానూ ఇప్పటివరకు 12 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్‌ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి.

ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. జైలులో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(Nawaz Sharif) PML-N పంజాబ్‌లో గట్టి పోటీ ఇస్తోంది.


ఇమ్రాన్ మద్దతుదారులు 5 సీట్లు సాధించగా, 4 నవాజ్ మద్దతుదారులు గెలుచుకున్నారు. బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 3 స్థానాలను కైవసం చేసుకుంది. పాక్ ప్రజలంతా ఓట్లు వేసేందుకు గురువారం ఆ దేశ ప్రభుత్వం సెలవును ప్రకటించింది. 12 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోలింగ్ జరుగుతున్న సమయంలో డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 5 మంది పోలీసులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో ఎన్నికల అధికారులు ఇంటర్నెట్ సేవలను(Internet Ban) నిలిపేశారు. గురువారం సాయంత్రం వరకు పోలింగ్ జరగ్గా.. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు తొలి రౌండ్ ఫలితాన్ని ప్రకటించారు.

లీడ్‌లో ఇమ్రాన్ మద్దతుదారులు!

ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో గెలుపొందినట్లు పాక్ మీడియా వెల్లడించింది. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఇప్పటివరకు ఎవరు లీడ్‌లో ఉన్నారో అధికారికంగా ప్రకటించలేదు. నవాజ్ షరీఫ్ పార్టీ కూడా గెలుపుపై ధీమాగా ఉంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 09 , 2024 | 11:42 AM