Share News

China: చైనా - ఫ్రాన్స్ సంబంధాలు కొత్త పుంతలు తొక్కాలి.. మాక్రాన్ భారత్ పర్యటనతో జిన్ పింగ్ అప్రమత్తం

ABN , Publish Date - Jan 29 , 2024 | 12:44 PM

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ భారత పర్యటనతో చైనా అప్రమత్తమైంది. భారత్ - ఫ్రాన్స్ మధ్య సంబంధాలు బలపడుతున్న తరుణంలో మాక్రాన్‌ను తన వైపు తిప్పుకునేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్(Xi Jinping) కుయుక్తులు పన్నుతున్నారు.

China: చైనా - ఫ్రాన్స్ సంబంధాలు కొత్త పుంతలు తొక్కాలి.. మాక్రాన్ భారత్ పర్యటనతో జిన్ పింగ్ అప్రమత్తం

బీజింగ్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ భారత పర్యటనతో చైనా అప్రమత్తమైంది. భారత్ - ఫ్రాన్స్ మధ్య సంబంధాలు బలపడుతున్న తరుణంలో మాక్రాన్‌ను తన వైపు తిప్పుకునేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్(Xi Jinping) కుయుక్తులు పన్నుతున్నారు. భారత గణతంత్ర వేడుకలకు హాజరైన రెండు రోజుల తరువాత ఫ్రాన్స్‌తో ఉన్న సంబంధాలపై చైనా కీలక ప్రకటన చేసింది. చైనా - ఫ్రాన్స్ మధ్య దౌత్య సంబంధాలకు 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో జరిగిన కార్యక్రమంలో జిన్ పింగ్ ప్రసంగించారు.

ఇరు దేశాల మధ్య సంబంధాలు దృఢంగా ఉన్నాయని, వాటిని ప్రోత్సహించేందుకు మరిన్ని సానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. "మానవాభివృద్ధి, శాంతి, భద్రత, శ్రేయస్సు కోసం రెండు దేశాలు కొత్త మార్గాన్ని అన్వేషించాలి. ఫ్రాన్స్‌తో సంబంధాలు బలపరుచుకునే విషయంలో చైనా ఎప్పుడూ ముందుంటుంది. వివిధ అంశాలపై మాక్రాన్‌తో కలిసి పని చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. తద్వారా ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం భవిష్యత్తులో మరింత పటిష్టంగా తయారవుతుంది" అని జిన్ పింగ్ అన్నారు.


ఆందోళనలో చైనా

మాక్రాన్ భారత్ పర్యటన అనంతరం చైనా ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఫ్రెంచ్ దేశంతో సంబంధాలపై ఆ దేశం ఎంతో ప్రాధాన్యమిస్తోంది. భారత్‌కు ఫ్రాన్స్ కీలకమైన రక్షణ భాగస్వామిగా ఉంది. మాక్రాన్ భారత్ పర్యటనలో రక్షణ రోడ్ మ్యాప్‌ను ప్రకటించారు. దానితోపాటు హిందూ మహా సముద్రం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడుతున్న పరిణామం చైనాకు టెన్షన్ కలిగిస్తోంది. ఈ క్రమంలో చైనా-ఫ్రాన్స్ సంబంధాలను ప్రశంసిస్తూ, ఆ దేశ అధికారిక మీడియా ప్రకటన జారీ చేసింది. హైటెక్ రంగాలలో సహకారాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చింది."ఇరు దేశాల మధ్య శాస్త్రీయ, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం ఉంది. ఏరోస్పేస్, అణు, పునరుత్పాదక శక్తి వరకు, రెండు దేశాలు ఉమ్మడి పరిశోధన, అభివృద్ధిలో గణనీయమైన పురోగతిని సాధించాయి" అని మీడియా తన సంపాదకీయంలో పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 29 , 2024 | 12:48 PM