Share News

Alexei Navalny: అలెక్సీ నావల్నీ మృతి కేసులో కొత్త ట్విస్టు.. పుతినే చంపాడంటూ..

ABN , Publish Date - Feb 19 , 2024 | 05:38 PM

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny) హఠాన్మరణం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నావల్నీ మృతికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) బాధ్యుడంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) సంచలన ఆరోపణలు చేశారు.

Alexei Navalny: అలెక్సీ నావల్నీ మృతి కేసులో కొత్త ట్విస్టు.. పుతినే చంపాడంటూ..

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny) హఠాన్మరణం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నావల్నీ మృతికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) బాధ్యుడంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) సంచలన ఆరోపణలు చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) సైతం పుతిన్ ఓ రాక్షసుడు అని తీవ్రంగా స్పందించారు. ఇలాంటి తరుణంలో.. నావల్నీ తల, ఛాతీపై కమిలిన గాయాలు ఉన్నాయంటూ ఒక సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. నావల్నీ మృతదేహాన్ని మార్చురీకి తరలిస్తున్న సమయంలో తనకు ఈ గాయాలు కనిపించాయని ఓ వైద్య నిపుణుడిని ఉటంకిస్తూ స్థానిక మీడియా పేర్కొంది.


‘‘సాధారణంగా జైల్లో మరణించిన వ్యక్తుల మృతదేహాలను గ్లాజ్కోవా వీధిలోని బ్యూరో ఆఫ్ ఫోరెన్సిక్‌ మెడిసిన్‌కు తీసుకెళ్తారు. కానీ.. ఈ కేసులో మాత్రం కొన్ని కారణాల వల్ల నావల్నీ బాడీని క్లినికల్‌ హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత బాడీని మార్చురీ లోపలికి తీసుకొచ్చి, డోర్ వద్ద ఇద్దరు పోలీసుల్ని కాపలాగా ఉంచారు. ‘ఇక్కడ ఏదో మిస్టీరియస్ జరుగుతోంది’ అని వాళ్లు సైన్ బోర్డు కూడా పెట్టి ఉండొచ్చు. ప్రతిఒక్కరూ నావల్నీ మృతికి గల కారణాలేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. మరి.. వాళ్లు ఈ విషయాన్ని ఎందుకంత రహస్యంగా ఉంచుతున్నారో? బహుశా వాళ్లు ఏదైనా దాచాలని అనుకుంటున్నారా?’’ అని ఆ వైద్యుడు చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. నావల్నీ మూర్ఛపడిన సమయంలో ఎవరో ఆయన్ను పట్టుకోవడానికి ప్రయత్నించి ఉంటారని, ఆ తరహా గాయాలే తనకు కనిపించాయని ఆ వైద్యుడు చెప్పినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఇదిలావుండగా.. ‘సడెన్‌ డెత్‌ సిండ్రోమ్‌’ వల్ల నావల్నీ మృతిచెందినట్లు తల్లి లియుడ్మిలాకు అధికారులు తెలియజేశారు. కానీ, ఆయన మృతదేహాన్ని ఇప్పటికీ అప్పగించకపోవడపై సందేహాలు రేకెత్తుతున్నాయి. అంతేకాదు.. నావల్నీకి నివాళులు అర్పించేవారిని, ర్యాలీలు నిర్వహించేవారిని సైతం పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నావల్నీ భార్య యులియా(Yulia Navalnaya) నవల్నాయ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను పుతిన్ చంపేశాడని ఆమె ఆరోపించారు. దేశ ప్రజల కోసం నావల్నీ మొదలుపెట్టిన పనుల్ని తాను కొనసాగిస్తానని, దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పారు. మరోవైపు.. రష్యా ప్రభుత్వం మాత్రం నావల్నీని హింసించారన్న ఆరోపణల్ని ఖండించింది. సహజ కారణాల వల్లే ఆయన చనిపోయారని పేర్కొంది.

Updated Date - Feb 19 , 2024 | 05:38 PM