Orange: కలర్ చూసి మోసపోవద్దు.. మంచి పండ్లను ఇలా గుర్తించండి..
ABN , Publish Date - Dec 04 , 2024 | 03:29 PM
ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఆరెంజ్ పండ్లు అందరిని ఊరిస్తున్నాయి. అయితే, చూడటానికి మంచిగా ఉన్నాయని తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి, మంచి పండ్లను ఇలా గుర్తించి తీసుకోండి.
Oranges: ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఆరెంజ్ పండ్లు అందరిని ఊరిస్తున్నాయి. ఈ సీజన్ లో ఆరెంజ్ లు తక్కువ ధరకు లభిస్తుండటంతో ప్రజలు వాటివైపు మొగ్గుచూపుతున్నారు. ప్రతిరోజూ ఒక ఆరెంజ్ పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగు పడడం తోపాటు, చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఆకలి కూడా బాగా అవుతుందని చెబుతన్నారు. అయితే, మార్కెట్ లో సరైన ఆరెంజ్ ను ఎలా గుర్తించాలో చాలా మందికి తెలియదు. చూడటానికి మంచిగా కనిపించే వాటిని చూసి రుచికరంగా ఉంటాయనుకుని ఆరెంజ్ లను కొని మోసపోతున్నారు. అయితే, కొన్ని అంశాలకు శ్రద్ధ చూపడం ద్వారా సరైన ఆరెంజ్ పండ్లను ఎంచుకోవచ్చు.. అవి ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
బరువు:
ఆరెంజ్ పండ్లను తీసుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విక్రేత ఇచ్చే పండ్లను తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే వారు మీకు సరైన పండ్లు ఇవ్వకపోవచ్చు. కాబట్టి మీరే పండ్లను తీసుకోవడం మంచిది. ఆరెంజ్ పండ్లను తీసుకునేప్పుడు ముందుగా వాటిని చేతిలోకి తీసుకుని బరువు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బరువైన ఆరెంజ్ లలో జ్యూస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
రంగు:
రంగును చూసి పండును అంచనా వేయవద్దు. కొన్నిసార్లు ఆరెంజ్ పండ్లు చూడటానికి మంచిగా కనిపిచ్చినా అవి చెడ్డవిగా ఉండొచ్చు. ఆకుపచ్చ రంగులోని ఆరెంజ్ లు మంచి రుచి, రసం కలిగి ఉంటాయి.
మందంగా:
మందంగా ఉండే ఆరెంజ్ పండ్లను తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే పై తొక్క చిక్కగా ఉంటే.. ఆరెంజ్ నాణ్యత క్షీణించడం ప్రారంభించిందని అర్థం. కాబట్టి, మందంగా ఉండే ఆరెంజ్ పండ్లను తీసుకోవద్దు. అంతేకాకుండా చిన్న మచ్చలు ఉన్న ఆరెంజ్ పండ్లను తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు.
(Note:పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ABN దీనిని ధృవీకరించ లేదు.)