Share News

AP Election 2024: ఈసీ ముందు హాజరైన ఏపీ సీఎస్, డీజీపీలు

ABN , Publish Date - May 16 , 2024 | 05:08 PM

జవహర్ రెడ్డి, హరీష్ కుమార్ గుప్తా ఇద్దరూ నేడు (గురువారం) ఢిల్లీ వెళ్లి ఎన్నికల కమిషన్ ముందు హాజరయ్యారు. పోలింగ్ మరుసటి రోజు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు, హింసాత్మక ఘటనలపై ఈసీకి అధికారులు వివరణ ఇస్తున్నారు.

AP Election 2024: ఈసీ ముందు హాజరైన ఏపీ సీఎస్, డీజీపీలు

‘‘రాష్ట్రంలో ఈ రెండ్రోజుల్లో జరిగిన పరిణామాలకు బాధ్యులెవరు..? ఇంతకూ ఏపీలో ఏం జరుగుతోంది..? మీరిద్దరూ ఢిల్లీకి వచ్చి సమాధానం ఇవ్వండి’’ అంటూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో జవహర్ రెడ్డి, హరీష్ కుమార్ గుప్తా ఇద్దరూ నేడు (గురువారం) ఢిల్లీ వెళ్లి ఎన్నికల కమిషన్ ముందు హాజరయ్యారు. పోలింగ్ మరుసటి రోజు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు, హింసాత్మక ఘటనలపై ఈసీకి అధికారులు వివరణ ఇస్తున్నారు.


అసలు విషయం ఇదీ..

కాగా ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) మండిపడిన విషయం తెలిసిందే. ‘పోలింగ్‌ ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు జరగడమేంటి? రాష్ట్రంలో ఈ రెండ్రోజుల్లో జరిగిన పరిణామాలకు బాధ్యులెవరు..? పోలింగ్‌ రోజు నిర్లక్ష్యం వహించారు.. ఆ తర్వాత కూడా నిర్లిప్తత కనిపిస్తోంది.. ఇంతకూ ఏపీలో ఏం జరుగుతోంది..? మీరిద్దరూ ఢిల్లీకి వచ్చి సమాధానం ఇవ్వండి’ అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డిని, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాలకు బుధవారం సమన్లు జారీ చేసింది. పోలింగ్‌ ముందు రోజు అర్ధరాత్రి నుంచి మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో వరుసగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.


ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందా.. నిఘా వర్గాల సమాచారం లేదా.. పోలీసు బందోబస్తు చర్యల్లో లోపముందా తదితర అంశాలపై తమకు వివరణ ఇవ్వాలని స్పష్టంచేసింది. హింసాకాండ జరుగుతుందని గతానుభవాలు ఉన్నా.. ఎందుకు నిర్లక్ష్యం వహించారని నిలదీసింది. పోలింగ్‌ రోజు పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ దౌర్జన్యాలు, మాచర్లలో ప్రతిపక్షాల ఏజెంట్లపై దాడులు, ఇళ్లలోకి చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించడం.. నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థిపై దాడులకు దిగడం.. కత్తులు, కర్రలతో రోడ్లపై స్వైరవిహారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్‌ రూముల వద్దే మారణాయుధాలతో దాడి చేయడాన్ని గట్టిగా నిలదీసిన విషయం తెలిసిందే.

Updated Date - May 16 , 2024 | 05:08 PM