Share News

RK Kotha Paluku: న్యాయవ్యవస్థ గౌరవం తగ్గేలా..!

ABN , Publish Date - Apr 21 , 2024 | 02:57 AM

వ్యూహాలైనా, పథకాలైనా రాజకీయాల్లో ఒక్కసారే ఉపయోగపడతాయి. ఒక ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాన్నే మరో ఎన్నికలో కూడా అమలు చేస్తే ఫలితాన్ని ఇవ్వదు. ప్రజలను ఆకర్షించే పథకాలు కూడా అంతే!...

RK Kotha Paluku: న్యాయవ్యవస్థ గౌరవం తగ్గేలా..!

RK Kothapaluku :

వ్యూహాలైనా, పథకాలైనా రాజకీయాల్లో ఒక్కసారే ఉపయోగపడతాయి. ఒక ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాన్నే మరో ఎన్నికలో కూడా అమలు చేస్తే ఫలితాన్ని ఇవ్వదు. ప్రజలను ఆకర్షించే పథకాలు కూడా అంతే! అమలులో ఉన్న పథకాలను తమ హక్కుగా ప్రజలు భావిస్తారు. 2019 ఎన్నికల్లో బాబాయ్‌ హత్య, కోడి కత్తి కేసు జగన్మోహన్‌ రెడ్డికి ఉపయోగపడ్డాయి. ప్రస్తుత ఎన్నికల్లో అదే బాబాయ్‌ హత్య కేసు ఆయనకు రాజకీయంగా ఎంతో కొంత నష్టం కలిగించబోతోంది. దీంతో వైసీపీ నాయకుడు ఒకరు కడప న్యాయస్థానాన్ని ఆశ్రయించి బాబాయ్‌ హత్య కేసు గురించి డాక్టర్‌ సునీత, వైఎస్‌ షర్మిలతో పాటు ప్రతిపక్ష నాయకులు ఎవరూ ఆరోపణలు చేయకుండా స్టే తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా న్యాయస్థానం తన పరిధిని అతిక్రమించింది. ఆ విషయం తర్వాత చర్చించుకుందాం! గత ఎన్నికల్లో కోడి కత్తి తరహాలో ఇప్పుడు గులకరాయి కేసును జగన్‌ అండ్‌ కో తెర మీదకు తెచ్చారు. విజయవాడలో బస్సుయాత్ర సందర్భంగా జనంలో నుంచి ఎవరో చిన్న రాయి విసరగా అది తగిలి జగన్మోహన్‌ రెడ్డి ఎడమ కంటి పైన స్వల్పంగా గాయమైంది. అంతే... ముఖ్యమంత్రిని హత్య చేయడానికి చంద్రబాబు అండ్‌ కో కుట్ర పన్నారని వైసీపీ నాయకులు మూకుమ్మడిగా ఆరోపించారు. గాయం చిన్నదే అయినా కుట్లు వేశారని చెప్పుకొన్నారు. నిజానికి వైద్యులు కుట్లు వేయాలంటే గాయం లోతుగా ఉండాలి. మనం చూసిన దాని ప్రకారం ముఖ్యమంత్రి గాయం లోతుగా లేదు. అయితే ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను వైద్యుల బృందం విజయవంతంగా నిర్వహించినట్టు ఫొటోలు దిగి ప్రచారం చేసుకున్నారు. కోడి కత్తి ఘటన సందర్భంగా ఇలాగే కుట్లు వేశామని చెప్పుకొన్న వైద్యుడికి జగన్‌ ప్రభుత్వంలో పదవి కట్టబెట్టారు. గులక రాయి ఘటన జరిగి వారం రోజులవుతోంది. అయినా ముఖ్యమంత్రి జగన్‌ కంటి పైభాగంలో బాండెయిడ్‌ వేయించుకొని జనంలో తిరుగుతున్నారు. మనబోటి వాళ్లకు అలాంటి గాయమై ఉంటే ఈపాటికి ఎప్పుడో మానిపోయి ఉండేది. జగన్‌రెడ్డికి ప్రజల సానుభూతి కావాలి కనుక ఎన్నికల ప్రచారం జరిగినన్ని రోజులూ నుదిటిపై ఆ పట్టీ అలాగే ఉండవచ్చు. కోడి కత్తి సంఘటన జరిగినప్పుడు విజయసాయిరెడ్డి వంటి వారు మీడియాతో మాట్లాడుతూ, కోడి కత్తి కొంచెం లోతుగా దిగి ఉంటే జగన్‌ ప్రాణం పోయుండేదని చెప్పుకొచ్చారు. అప్పుడు జనం కూడా కొంత వరకు నమ్మారు. జగన్‌ కూడా హుటాహుటిన హైదరాబాద్‌ వెళ్లి కుట్లు వేయించుకున్నారు. ఎన్నికల తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పుడూ అదే ఎత్తుగడతో గులక రాయి కేసును ఎత్తుకున్నారు. అయితే ఇప్పుడు జగన్‌ ఆశించినట్టు ప్రజల్లో సానుభూతి ఏర్పడక పోగా, మరో డ్రామాకు తెర లేపారని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకే వ్యూహం పదే పదే పనిచేయదనడానికి గులక రాయి సంఘటనే నిదర్శనం.

YS-Jagan-Kothapaluku.jpg

ఆహా ఏమి నటన...

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి నవరస నటనాసార్వభౌముడు అన్న బిరుదు ఇవ్వవచ్చు. ముఖంలో దీనత్వం, క్రూరత్వాలను ఏకకాలంలో ప్రదర్శించగలరు. జనంలోకి వెళ్లినప్పుడు ఒకలా, జనంలో లేనప్పుడు మరోలా ఉంటారని ఆయన చుట్టూ ఉన్న వాళ్లు చెబుతారు. గత ఎన్నికల్లో తండ్రిని కోల్పోయిన బిడ్డను అని, తండ్రి రాజశేఖర రెడ్డిని హత్య చేయించారని ప్రచారం చేసి ప్రజల సానుభూతిని పొందారు. అప్పుడు ఆయనకు తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల వంతపాడారు. మద్దతుగా ప్రచారం చేశారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇడుపులపాయ అంతఃపురానికి బీటలు వారాయి. తల్లీ చెల్లీ దూరమయ్యారు. దీంతో ప్రజలను మరో మారు మాయచేయడానికేౖ ‘నేను ఒంటరి వాడిని, నాకు వ్యతిరేకంగా తోడేళ్ల గుంపు ఒక్కటైంది’ అంటూ ప్రచారం చేస్తున్నారు. కమ్యూనిస్టులకు మాత్రమే పరిమితమైన క్లాస్‌ వార్‌ పదాన్ని కూడా అందిపుచ్చుకున్నారు. తాను పేదల ప్రతినిధినని, పేదలకోసమే తన తపన అంతా అని చెప్పుకొంటూ చంద్రబాబు అండ్‌ కోను పెత్తందారులని దూషిస్తున్నారు. జగన్మోహన్‌ రెడ్డి నిజంగా ఒంటరి వారేనా? అయితేగియితే.. ఒంటరివాడు ఎలా అయ్యారో చూద్దాం! 2019 ఎన్నికల వరకు పార్టీకి అండగా ప్రచారం చేసిన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఇప్పుడెందుకు దూరమయ్యారో జగన్మోహన్‌ రెడ్డి నిజాయితీగా చెప్పగలరా? రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆస్తిలోనూ, అధికారంలోనూ షర్మిలకు కూడా ఎంతో కొంత వాటా దక్కడం న్యాయం. అయితే ఇక్కడ షర్మిలకు న్యాయం జరగలేదు. ఆస్తిలోనే కాదు– అధికారంలో కూడా ఆమెకు వాటా దక్కలేదు. దీంతో ఒళ్లు మండిన షర్మిల సోదరుడిపై కత్తి దూశారు. ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షర్మిల.. జగన్‌ నిజ స్వరూపాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. షర్మిల సభలకు జనం కూడా పెరుగుతున్నారు. తన ఇద్దరు బిడ్డల దారులు వేరవడంతో ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేని సందిగ్ధంలో చిక్కుకున్న విజయమ్మ ఉభయ కుశలోపరిగా అమెరికాకు వెళ్లిపోయారు. ఈ పరిస్థితికి ప్రజలుగానీ, ప్రతిపక్ష నాయకులుగానీ, మీడియాగానీ కారణం కాదుగదా? అవునా? కాదా? అనేది జగన్మోహన్‌ రెడ్డే చెప్పాలి. మరి ఒంటరి వాడిని అని జనం ముందుకు వచ్చి ఏడవడం ఎందుకు? ఈ ఏడుపునకు అర్థం ఉందా? మరో సోదరి డాక్టర్‌ సునీత విషయమే తీసుకుందాం! తన తండ్రిని కిరాతకంగా నరికి చంపిన వారిని శిక్షించాలని మాత్రమే ఆమె కోరుతున్నారు. ఈ విషయంలో జగనన్న తమకు న్యాయం చేయకుండా నిందితులకు అండగా నిలబడటాన్ని ఆమె జీర్ణించుకోలేక పోతున్నారు. చిన్నాన్న చావును రాజకీయంగా వాడుకొని ఇప్పుడు నిందితులకు అండగా నిలవడం ఏమిటి? అని ఆమె ఆక్రోశిస్తున్నారు. ఆమె అలా ఎందుకు భావిస్తున్నారు? ఆమె ఆక్రందనలో హేతుబద్ధత ఉందా? లేదా? అని కనీసం పరిశీలించకుండానే అవినాశ్‌ రెడ్డి గురించి మాట్లాడ వద్దని జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక హుకుం జారీ చేశారు. ఆయన ఈ హుకుం జారీ చేయడం వెనుక కూడా పెత్తందారులు ఉన్నారా? సోదరి సునీతకు న్యాయం చేయకపోగా వివేకానంద రెడ్డిని డాక్టర్‌ సునీత భర్తే హత్య చేయించారని తన రోత మీడియాతో పాటు కూలి మీడియాలో జగన్‌రెడ్డి ప్రచారం చేయించారు. ఇందులో కూడా ప్రతిపక్షాల పాత్ర ఉందా? మాకంటే నీకు అవినాశ్‌ రెడ్డి ఎందుకు ముఖ్యమయ్యారని అక్కచెల్లెళ్లు వేస్తున్న ప్రశ్నకు జగన్మోహన్‌ రెడ్డి ఎందుకు సమాధానం చెప్పడం లేదో? పాపాల భైరవుడు చంద్రబాబు ఉన్నాడు అన్నట్టుగా అన్నిటికీ ఆయన వైపు వేలెత్తి చూపుతున్నారు. షర్మిల, సునీత వెనుక చంద్రబాబు ఉన్నది నిజమే అయితే, చంద్రబాబుకు అంత సామర్థ్యం ఉండి ఉంటే 2019 ఎన్నికల్లోనే, అధికారంలో ఉన్నప్పుడే వారిని తన వైపు తిప్పుకొని ఉండేవారు కదా? ‘తనను తాను రక్షించుకోలేక పోతున్న చంద్రబాబు మమ్మల్ని ఏం రక్షిస్తాడు’ అన్న డాక్టర్‌ సునీత మాటల్లో వాస్తవం ఉంది. ఇప్పుడు కూడా అందరూ కలసి తనను ఒంటరివాడిని చేశారని జగన్‌ చెబుతున్న మాటలను నమ్ముదామా?


ఎలా పేదల ప్రతినిధి?

క్లాస్‌ వార్‌ గురించి, తాను పేదల ప్రతినిధినని జగన్మోహన్‌ రెడ్డి చెబుతున్న విషయాలకు వద్దాం. చరిత్రలో పేదల ప్రతినిధులం అని చెప్పుకొన్న నాయకులు, ముఖ్యంగా వామపక్ష నాయకులు సాదాసీదా జీవితాన్నే గడిపారు. జగన్మోహన్‌ రెడ్డి వలె తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఏపీలలో రాజ ప్రాసాదాలు నిర్మించుకోలేదు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోలేదు. 2004కు ముందు తన వద్ద కోటి రూపాయలు కూడా లేని జగన్మోహన్‌ రెడ్డి ఈ 20 ఏళ్లలో ఆర్థికంగా ఇంతలా బలపడటం ఎలా సాధ్యమైంది? అధికారం అండ ఉండివుండకపోతే జగన్మోహన్‌ రెడ్డి ఇన్ని వేల కోట్లు సంపాదించగలిగే వారా? 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి అధికారంలోకి రాకపోతే తనకు ఆత్మహత్య చేసుకోవడం మినహా మరో మార్గం లేదని వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఇప్పుడు జగన్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ఒకరి వద్ద వాపోవడం నిజం కాదా? గతంలో రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి కలిపి పదేళ్లు అధికారంలో ఉన్నారు. 2004కు ముందు తలకు మించిన అప్పుల భారంతో ఉండిన వైఎస్‌ కుటుంబం ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. ఎగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన జగన్మోహన్‌ రెడ్డి ఇవాళ దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగారు? ఆయన అనుసరించిన చిట్కా ఏమిటో చెబితే ప్రజలు కూడా కోటీశ్వరులు అయ్యేవారు కదా? అదే జరిగితే అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేసే అవసరం ఏర్పడదు కదా? తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు పంచానని చెప్పుకొంటున్న జగన్మోహన్‌ రెడ్డి, ఏ ఒక్క కుటుంబంలోనైనా వారి బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలు నిల్వ ఉన్నాయని నిరూపించగలరా? పేదలను పేదలుగానే ఉంచుతున్న జగన్మోహన్‌ రెడ్డి పేదల ప్రతినిధి ఎలా అవుతారు? పేదలకు ఇళ్ల కోసం సెంటు స్థలం సరిపోతుందని చెబుతున్న జగన్‌, తాను మాత్రం ఎకరాలకు ఎకరాలలో ప్యాలెస్‌లు నిర్మించుకోవలసిన అవసరం ఏమిటో చెప్పగలరా? జగన్‌కు ఉన్నన్ని ఆస్తులు ఆయన చెబుతున్న పెత్తందారులకు లేవే? వేల కోట్ల రూపాయల విలువైన ప్యాలెస్‌లలో నివసించే జగన్‌రెడ్డిని పేదల ప్రతినిధి అని అంగీకరిద్దామా? అధికారం అండతో ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన జగన్‌రెడ్డి ఆపదలో ఉన్న ఏ ఒక్కరికైనా తన జేబులో నుంచి సొంత సొమ్ము తీసి ఇవ్వడాన్ని ఎవరైనా చూశారా? తన ముందుకు వచ్చి చేయి చాచిన వారికి రాజశేఖర రెడ్డి కాదనకుండా తన వద్ద లేకపోయినా అప్పు చేసి మరీ సహాయం చేసేవారు. ఈ లక్షణం జగన్‌లో ఉందని ఆయనకు చిడతలు కొడుతున్న వారు చెప్పగలరా? అయితే, జగన్‌రెడ్డిలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, ‘నన్నేమీ అడగవద్దు – ప్రభుత్వ సొమ్మును మాత్రం అందినంత దోచుకోండి’ అని తన వాళ్లకు స్వేచ్ఛ ఇస్తారు. అందుకే ఈ ఐదేళ్లలో మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు ఎవరిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా కనీసం చర్యలు తీసుకొనే ప్రయత్నం కూడా చేయలేదు. నెల్లూరు జిల్లాలో ఫలానా మాజీ మంత్రి పలుగు రాయిని అడ్డగోలుగా తవ్వుకొని అక్రమంగా అమ్ముకుంటున్నారని పార్టీ ముఖ్యుడొకరు జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ‘వదిలేయన్నా! మనకు పోయేది ఏముంది? చేతనైనంత సంపాదించుకోనివ్వండి!’ అని ఆయన బదులిచ్చారట. తాను అనుసరిస్తున్న మోడల్‌నే ఇతరులు అనుసరించి సంపాదించుకోవడాన్ని జగన్‌ అనుమతిస్తున్నారు. అందుకే కొంత మంది ఆయనకు భక్తులుగా మారిపోయారు. అధికారులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల ప్రయోజనాలు గాలికి పోయినా ఫర్వాలేదు– అందిన కాడికి దోచుకోండని తన వాళ్లకు జగన్‌ స్వేచ్ఛను ఇచ్చారు. తమ దోపిడీని ప్రజలు గుర్తించి ప్రశ్నించకుండా సంక్షేమం పేరిట వాళ్ల ముఖాన కూడా ఎంతో కొంత పడవేస్తున్నారు. ఇందులోని మర్మం తెలియని ప్రజలు అతని మాయలో పడకుండా ఉంటారా? అధికారం ఉన్నంత కాలం దోచుకుందాం... అధికారం పోతే పొరుగు రాష్ర్టాలకు పోదాం... ఇంకా అవసరమైతే విదేశాలకు వెళ్లిపోదాం! అనే ధోరణి జగన్‌ అండ్‌ కో లో కనిపిస్తోంది.

అధికారులదీ అదే దారి...

జగన్‌ ప్రభుత్వంలో అధికారులు ఇలా ఎందుకు మారిపోయారని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. పోలీసు శాఖనే తీసుకుందాం! ఆ శాఖలో ఎవరికి వారే స్వతంత్రులు. డీజీపీకి కూడా తన శాఖపై పట్టు ఉండదు. జిల్లాలలో ఎస్పీల నుంచి ఎస్సైల వరకు స్వతంత్రులే. ఎవరిపైనా ఎవరికీ అదుపు లేదు. ఈ పరిస్థితులను స్వేచ్ఛగా భావిస్తున్న అధికారులు జగన్‌ సేవలో తరిస్తున్నారు. వ్యవస్థ కుప్పకూలితే ఏమవుతుందో ఊహించుకుంటే భయం ఏర్పడటం సహజం. ఈ ధోరణి వల్ల ఉన్మాదులు పుట్టుకొస్తున్నారు. జగన్‌ చెబుతున్న క్లాస్‌ వార్‌ వెనుక ఉన్న మర్మం ఇదే! ఇంతకంటే వంచన వేరొకటి ఉంటుందా?

ముసుగు తొలగే సరికి...

అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం అని ‘తాతా మనవడు’ సినిమాలో ఒక పాట ఉంటుంది. అది అక్షరాలా నిజమని బాబాయ్‌ హత్య కేసులో జగన్మోహన్‌ రెడ్డి రుజువు చేస్తున్నారు. ఆయనకు అధికారం–డబ్బు మాత్రమే ముఖ్యం. మనుషులు, మమతలు కాదు అని చెప్పకనే చెబుతున్నారు. నియంతలు–దుర్మార్గుల గురించి జనం తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. హిట్లర్‌లోని నియంతను గుర్తించడానికి జర్మన్లకు టైమ్‌ పట్టింది. హిట్లర్‌ గురించి తెలుసుకొనేసరికి జర్మనీకి జరగాల్సిన నష్టం జరిగీపోయింది. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మన మధ్య తిరుగుతూ, మన ఓట్లతో అధికారం వెలగబెడుతున్న నియంతలు మారీచుల వలె రూపాలను మార్చుకుంటున్నారు. జర్మనైజేషన్‌ పీరియడ్‌ అన్న హిట్లర్‌ మాటలను జర్మన్లు విశ్వసించారు. చివరకు దారుణంగా నష్టపోయారు. తాను పేదల పెన్నిధినని, ఆ పేదల జీవితాలు బాగుపడాలంటే, వాళ్లకు మేళ్లు జరగాలంటే తనకు అధికారం ఇవ్వాలని అంటున్న జగన్‌ను కూడా నాటి జర్మన్లవలె మన ప్రజల్లోనూ కొందరు ఎంతో కొంత నమ్ముతున్నారు. ప్రజల బలహీనతలను ఔపోసనపట్టిన జగన్‌రెడ్డి వంటి వారే క్లాస్‌ వార్‌ సిద్ధాంతాన్ని తెర మీదకు తెస్తారు. ‘మీరు చెబుతున్నది నిజమే అయితే వేల కోట్ల సామ్రాజ్యాన్ని మీరు ఎలా నిర్మించుకున్నారు? మేమెందుకు పేదలగానే మిగిలిపోయాం?’ అని ఒకే ఒక ప్రశ్న వేస్తే జగన్‌రెడ్డి వంటి వారి నిజ స్వరూపం బట్టబయలు అవుతుంది. అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని 2019కి ముందు చెప్పిన జగన్‌రెడ్డి ఆ తర్వాత ఏం చేశారో చూశాం. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే మూడు రాజధానులు కడతారని నమ్మే పిచ్చివాళ్లు ఉంటే ఉండవచ్చు. జగన్‌కు కావాల్సింది అలాంటి వాళ్లే! అందుకే ప్రజలను శాశ్వతంగా ప్రభుత్వాలపై ఆధారపడేలా మార్చేస్తున్నారు. తనతోపాటు తన మనుషులు మాత్రం అపర కుబేరులు అవుతున్నారు. ఏదో ఒక రోజు జగన్‌ చెబుతున్న క్లాస్‌ వార్‌ గుట్టు బయటపడి ప్రజలు తిరగబడతారు. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం!


ఎవరు రాసిన ‘రక్త చరిత్ర’?

వివేకానంద రెడ్డి హత్య విషయానికి మళ్లీ వద్దాం! ఐదేళ్ల క్రితం జరిగిన ఈ హత్య వెనుక ఏం జరిగింది, ఎవరు ఉన్నారో ప్రజలందరికీ అవగతం అయింది. అయినా జగన్‌ అనుసరిస్తున్న క్లాస్‌ వార్‌ అనే మోడల్‌ కారణంగా ఎవరిని ఎవరు ఎందుకు హత్య చేశారో మాకు అవసరం లేదు – మాకేం వస్తుంది అన్న మానసిక దౌర్బల్యంలోకి ఒక వర్గం ప్రజలు వెళ్లిపోయారు. బాబాయ్‌ హత్య విషయంలో జగన్‌ అనుసరిస్తున్న వైఖరి గురించి ప్రజలకు తెలియక కాదు. ఎక్కడో పులివెందులలో వివేకానంద రెడ్డిని నరికి చంపితే మాకొచ్చిన నష్టం ఏమిటి? అని ప్రజలు భావించడాన్ని మించిన దౌర్భాగ్యం ఉంటుందా? రేపు తమకు కూడా అదే గతి పడితే పరిస్థితి ఏమిటి? అని ఆలోచించకుండా చేయడమే జగన్‌ అనుసరిస్తున్న క్లాస్‌ వార్‌ లక్ష్యం. డాక్టర్‌ సునీత ఐదేళ్లుగా అలుపెరుగని పోరాటాన్ని చేస్తున్నప్పటికీ ఆమెను అభినందించక పోగా విమర్శిస్తున్న వాళ్లు ఉన్నారంటే అందుకు జగన్‌ అమలు చేస్తున్న మోడల్‌ కారణం కాదా? విషాదమేమిటంటే వైఎస్‌ కుటుంబంలో రాజారెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఆయన కుమారుడైన రాజశేఖర రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో దారుణ పరిస్థితుల్లో మరణించారు. శరీర భాగాలు కూడా సరిగ్గా దొరకలేదు. ఐదేళ్ల క్రితం రాజశేఖర రెడ్డి సోదరుడైన వివేకానంద రెడ్డిని అత్యంత కిరాతకంగా నరికి చంపారు. అధికారంగానీ, డబ్బుగానీ ఈ చావులను నివారించలేదే? పులివెందుల రక్తచరిత్ర కాదా ఇది? చావులను రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే వాడుకుంటున్న రోజులు ఇవి. అవసరం తీరింది కనుక జగన్మోహన్‌ రెడ్డిని తన కుటుంబంలోని చావులు బాధించడం లేదు కాబోలు. ఇప్పుడు ఎవరితో అవసరం ఉందో వారి పక్షం వహిస్తున్నారు.

కడప కోర్టు తీర్పు సరైనదేనా?

గత ఎన్నికల్లో తనకు ఉపయోగపడిన వివేకా చావు ఈ ఎన్నికల్లో నష్టం చేయకుండా ఉండేందుకు న్యాయస్థానాలను ఉపయోగించుకొనే ప్రయత్నాన్ని జగన్‌రెడ్డి చేస్తున్నారు. తన పార్టీకి చెందిన సురేశ్‌ బాబు అనే వ్యక్తితో కడప సెషన్స్‌ కోర్టులో పిటిషన్‌ వేయించారు. వివేకా హత్య గురించి షర్మిల, సునీతతోపాటు ప్రతిపక్షాలకు చెందిన వారెవరూ ప్రస్తావించకుండా న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. న్యాయస్థానం ఇచ్చిన ఈ ఉత్తర్వులను పరిశీలిస్తే న్యాయ వ్యవస్థపై ఉండే గౌరవం సన్నగిల్లుతుంది. పిటిషనర్‌ కోరింది మాత్రమే కాకుండా ప్రతిపక్షాలపై మరిన్ని పరిమితులు విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటో అర్థం కాదు. ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందా? అహేతుకమైన ఉత్తర్వులు ఇచ్చిన న్యాయస్థానంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసే అవకాశం ఉండదా? ప్రభుత్వ యంత్రాంగంలో కింది స్థాయిలో తప్పు జరిగినట్టు ఫిర్యాదు వస్తే పైస్థాయిలో చర్యలు తీసుకుంటారు కదా? న్యాయ వ్యవస్థలో కూడా కింది స్థాయి కోర్టులు తప్పుచేసినా, పరిధి దాటినా ఉన్నత న్యాయస్థానం చర్యలు తీసుకోలేదా? అంటే తీసుకోవచ్చు! కడప న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులు వస్తే వాటిపై విచారణకు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించడం సహజ ప్రక్రియే. కింది స్థాయి కోర్టులలో అపసవ్య తీర్పులు వెలువడకుండా ఉండాలంటే అలాంటి సందర్భాలలో ఫిర్యాదులు చేయడం ప్రారంభం కావాలి. కడప న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఇది మొదలు కావాలి. ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తేనే న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుంది. కింది స్థాయి కోర్టులు ఇస్తున్న తీర్పులు, ఆదేశాలపై హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పలు సందర్భాలలో అసహనం వ్యక్తం చేయడాన్ని గమనిస్తున్నాం. తమకు కూడా జవాబుదారీతనం ఉంటుందని కింది స్థాయి న్యాయ వ్యవస్థకు గుర్తు చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. లేని పక్షంలో బాధితులు నిందితులుగా మారిపోతారు. నిందితులు నిర్దోషులుగా ప్రకటించుకుంటూ విర్రవీగుతారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల సారాంశానికి భిన్నంగా కడప కోర్టు ఆదేశాలు ఉండటం గమనార్హం!

ఆర్కే

Updated Date - Apr 21 , 2024 | 08:05 AM