Share News

ట్యాపింగ్‌ దొంగలు!

ABN , Publish Date - Mar 31 , 2024 | 01:26 AM

నిన్న మొన్నటి వరకు సాధారణ విషయంగానే పరిగణిస్తూ వస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పోలీసులతో చేయిస్తున్న విచారణతో సంచలనంగా మారింది. తెలుగు రాష్ర్టాలలో ఫోన్‌ ట్యాపింగ్‌...

ట్యాపింగ్‌ దొంగలు!

నిన్న మొన్నటి వరకు సాధారణ విషయంగానే పరిగణిస్తూ వస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పోలీసులతో చేయిస్తున్న విచారణతో సంచలనంగా మారింది. తెలుగు రాష్ర్టాలలో ఫోన్‌ ట్యాపింగ్‌ విచ్చలవిడిగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని జగన్‌ అండ్‌ కో గగ్గోలు పెట్టడమే కాకుండా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ఇప్పుడు అదే జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో ఫోన్‌ ట్యాపింగ్‌ నిత్యకృత్యం అయింది. అధికార పార్టీ ముఖ్యులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితి. తెలంగాణలో కేసీఆర్‌ పాలనలో ఇదే తంతు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫోన్‌ను అప్పట్లో ట్యాప్‌ చేయడం వల్లనే ఓటుకు నోటు కేసులో ఆయనను ఇరికించి జైలుకు పంపారు. ప్రస్తుతం అధికార పగ్గాలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి నాటి సంఘటనకు ప్రతీకారంగా విచారణకు ఆదేశించారు. కొంతమంది అధికారులు అప్పట్లో విచ్చలవిడిగా వ్యవహరించినట్టు పోలీసుల విచారణలో వెల్లడవుతోంది. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. సంఘ విద్రోహులు, దేశ ద్రోహులు, టెర్రరిస్టులు, తీవ్రవాదుల ఫోన్‌లను చాటుగా వినడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంటాయి. ప్రభుత్వాలు సమాజ హితం పేరుతో ఈ పని చేసేవి. కాలక్రమంలో... మరీ ముఖ్యంగా అటు కేంద్రంలో, ఇటు తెలుగు రాష్ర్టాలలో రాజకీయ ప్రత్యర్థుల ఫోన్‌లను ట్యాప్‌ చేయడం సర్వసాధారణ విషయంగా మారిపోయింది. 1988లో కర్ణాటక ముఖ్యమంత్రిగా రామకృష్ణ హెగ్డే ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్‌ చేశారు. అప్పుడు అదొక సంచలనం. హెగ్డే తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అటు జాతీయ స్థాయిలోనూ, ఇటు తెలుగు రాష్ర్టాలలోనూ రాజకీయ ప్రత్యర్థులే కాదు– సమాజంలో ప్రముఖ స్థానాల్లో ఉన్న వారి ఫోన్లను కూడా దొంగచాటుగా వింటున్నారు. ఇందుకు న్యాయమూర్తులు కూడా మినహాయింపు కాదు. అంతెందుకు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితులుగా మిగులుతున్నారు. తెలుగునాట డీజీపీలు సైతం స్వేచ్ఛగా ఫోన్లో మాట్లాడలేక పోతున్నారు. 1995లో చంద్రబాబు ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయ్యాక ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్లు అప్పుడే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మావోయిస్టులు కూడా సెల్‌ఫోన్లు వాడటానికి అలవాటుపడ్డారు. ఈ పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్న నాటి ఎస్‌ఐబీ అధికారులు ప్రముఖ మావోయిస్టు నాయకులను ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా పట్టుకొని హతమార్చారు. ఫలితంగా మావోయిస్టు ఉద్యమం తెలుగునాట బలహీనపడటం జరిగింది. అప్పట్లో హోంమంత్రిగా ఉన్న దేవేందర్‌ గౌడ్‌ మావోయిస్టు అగ్రనేతల వేటతో తనకు సంబంధం లేదని వరవరరావుతో సెల్‌ఫోన్‌లో చెప్పిన విషయం కూడా ఎస్‌ఐబీ అధికారులు తెలుసుకున్నారు. ఇంతకు మించి రాజకీయ ప్రముఖుల ఫోన్ల జోలికి వెళ్లలేదు. కాలక్రమంలో ఇదో నిత్యకృత్యమైంది.

అంతులేని అరాచకం...

ఫోన్‌ ట్యాపింగ్‌ బాధ్యతలు చేపట్టిన అధికారులు ఎంత అరాచకంగా వ్యవహరించారో ఇప్పుడు తెలంగాణ పోలీసుల విచారణలో బయటపడుతోంది. కొంతమంది అధికారులు తాము అధికారులం అన్న విషయం విస్మరించి, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకంటే అధ్వానంగా వ్యవహరించారు. తెలంగాణ పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులలో అత్యధికులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన కొందరు పోలీసు అధికారులు విచ్చలవిడితనంతో వ్యవహరిస్తున్నారు. మీడియాకు చెందిన వ్యక్తిగా వివిధ పార్టీలకు చెందినవారు నన్ను కలుస్తుంటారు. ఎన్నికల ముందు వరకు భారత రాష్ట్ర సమితికి చెందిన నాయకులు నన్ను కలవడానికి భయపడేవారు. ఎందుకంటే ముఖ్యమంత్రికి తెలిసిపోతుందని. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంత మంది వైసీపీ ముఖ్యులు కూడా నన్ను కలిసేవారు. అయితే వారు తమ వెంట ఫోన్లు తెచ్చుకొనేవారు కారు. అదేమని ప్రశ్నిస్తే ‘మా ఫోన్లు కూడా ట్యాపింగ్‌లో ఉన్నాయి’ అని చెప్పేవారు. ఒక సందర్భంలో మా కొలీగ్‌ ఒకరు నాకు ఫోన్‌ చేసి, ‘నిన్న రాత్రి ఫలానా వ్యక్తి మీతో ఫేస్‌టైం ద్వారా మాట్లాడారా?’ అని అడిగారు. నేను ఔనని చెప్పగా, ‘మీ కదలికలన్నీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గమనిస్తోంది. జాగ్రత్త!’ అని హెచ్చరించారు. ఈ మధ్య ఒక మిత్రుడు ఫోన్‌ చేసి ‘మీరు ఊర్లో లేరా?’ అని ప్రశ్నించి, మీరు ఫలానా నగరానికి వెళ్లారని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలీసు అధికారులు రఘురామి రెడ్డి, రిషాంత్‌ రెడ్డి ఎవరితోనో అంటుంటే విన్నాను అని చెప్పుకొచ్చాడు. నేను ఎక్కడ ఉన్నదీ, ఎవరిని కలుస్తున్నదీ, ఎవరితో మాట్లాడుతున్నదీ తెలుసుకొని జగన్‌ అండ్‌ కో ఏం చేస్తారో తెలియదు. నేనేమీ సంఘ విద్రోహ చర్యలకు పాల్పడటం లేదు కనుక నా ఫోన్‌ నుంచి స్వేచ్ఛగా మాట్లాడతాను. ముఖ్యమంత్రులను కూడా విమర్శిస్తుంటాను. ఇతరులు తమను ఏమి తిడుతున్నారో తెలుసుకుంటే ముఖ్యమంత్రులకే మనశ్శాంతి ఉండదు కదా! ఈ దిక్కు మాలిన ఫోన్‌ ట్యాపింగ్‌ వల్ల తెలుసుకున్న విషయాల ఆధారంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ తనకు ముఖ్యులైన హరీశ్‌ రావును కొంతకాలం పక్కన పెట్టారు. మరో ముఖ్యుడు ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి బయటకు పంపారు. ఈ రెండు సంఘటనల వల్ల నికరంగా నష్టపోయింది కేసీఆర్‌ మాత్రమే. నిజానికి సెల్‌ ఫోన్లు వచ్చాక మన జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి. నూతన దంపతులు కూడా ఫోన్లకే పరిమితం అవుతున్నారు. ఒకేచోట కూర్చొని కూడా మెసేజ్‌లు పంపుకొనే పరిస్థితి. కొంతకాలం క్రితం తమిళంలో ఒక సినిమా వచ్చింది. అందులో పెళ్లి చేసుకోవాలనుకున్న హీరో హీరోయిన్లను కొంతకాలంపాటు మీ ఫోన్లు మార్చుకొని అప్పుడు కూడా ఇంతే ప్రేమతో ఉంటే పెళ్లి చేస్తానని హీరోయిన్‌ తండ్రి షరతు పెడతాడు. దీంతో వాళ్లిద్దరూ ఫోన్లు మార్చుకుంటారు. అంతే... పనీ పాటా లేని వారు పంపిన మెసేజ్‌లూ, ఎమోజీలతో వారిద్దరి మధ్యా అపోహలూ, అనుమానాలూ ఏర్పడి విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. నిజ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు చూస్తున్నాం. భార్యాభర్తలు సైతం ఒకరి ఫోన్లను ఒకరు రహస్యంగా పరిశీలించి అపోహలు పెంచుకుంటున్నారు. మొత్తంమీద సెల్‌ఫోన్లు వచ్చాక వ్యక్తిగత జీవితంలో రహస్యాలు లేకుండా పోయాయి. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మన వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశిస్తున్నాయి.


నిత్యం ‘నిఘా చెవులు’

‘భార్యాభర్తల మాటలు వినడమేమిటి? అంతకంటే దుర్మార్గం ఉంటుందా?’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తాజాగా ప్రశ్నించారు. ఒకరిద్దరి ఫోన్లు వింటే తప్పేమిటి అన్నట్టుగా మాజీ మంత్రి కేటీఆర్‌ అనడం కచ్చితంగా ఆక్షేపణీయమే. ఇతరుల వ్యక్తిగత సంభాషణలను వినే హక్కు ఎవరికీ ఉండదు. చట్ట ప్రకారం ఎవరి ఫోనైనా ట్యాపింగ్‌ చేయాలనుకుంటే అందుకు ఒక ప్రొసీజర్‌ ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రొసీజర్‌ను పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌ నుంచి అనధికారికంగా సమకూర్చుకుంటున్న టెక్నాలజీతో విచ్చలవిడిగా ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నాయి. ఈ టెక్నాలజీ ఏర్పాటు చేసిన వాహనాలను మన ఇంటికి లేదా ఆఫీసుకు 200 మీటర్లలోపు పార్క్‌ చేసి మనం ఎవరితో మాట్లాడుతున్నదీ తెలుసుకోవచ్చు. మన దేశంలో ఇలాంటి వాహనాలు 20 వరకూ ఉన్నాయని ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. కొంత మంది బడా వ్యాపారవేత్తలు కూడా ఈ టెక్నాలజీ సమకూర్చిన వాహనాలను వాడుతున్నట్టు సమాచారం. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా వారు ఏం చేశారో కూడా విచారణ సందర్భంగా నిందితులైన అధికారులు చెప్పుకొచ్చారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు నగదు తరలించకుండా కట్టడి చేయడంతోపాటు అధికార పార్టీకి చెందిన నగదును పోలీసు వాహనాల్లో తరలించామని చెప్పారు. పోలీసు అధికారులు చేయాల్సిన పనేనా ఇది? ప్రభుత్వాలు శాశ్వతం కాదని తెలియదా? ఒక ప్రభుత్వానికి కట్టు బానిసలుగా పనిచేయడమేమిటి? ఆంధ్రప్రదేశ్‌లో పీఎస్సార్‌ ఆంజనేయులు, రఘురామి రెడ్డి, రవిశంకర్‌ రెడ్డి, రిషాంత్‌ రెడ్డి వంటి వాళ్లు అన్ని రకాల పరిధులను అతిక్రమించి వ్యవహరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదేమంటే, ఒక్క ఆంజనేయులు మినహా మిగతా వాళ్లు తమకు చాలా సర్వీసు ఉందని, ఐదేళ్ల తర్వాత మళ్లీ జగన్మోహన్‌ రెడ్డే అధికారంలోకి వస్తారు కదా అనే స్థాయికి దిగజారారని చెబుతున్నారు. అఖిల భారత సర్వీసుకు చెందిన అధికారులు ఇలా వ్యక్తులకు విధేయులుగా మారడం ఏమిటి? అధికార యంత్రాంగంలో కులతత్వం ఈ స్థాయిలో ఉంటే సామాన్యులకు ఉపశమనం లభిస్తుందా? హద్దులు దాటి ప్రవర్తించే అధికారులు ఎప్పటికైనా మూల్యం చెల్లించుకోవలసిందే! ఇప్పుడు తెలంగాణలో విచారణ ఎదుర్కొంటూ జైలుకు వెళ్లిన, వెళ్లబోయే అధికారుల పరిస్థితి చూస్తున్నాం కదా! రేపు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారితే ఇప్పుడు హద్దూ అదుపూ లేకుండా ప్రవర్తిస్తున్న అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు కదా! ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులపై టెలిగ్రాఫ్‌ చట్టం ప్రయోగించాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించుకొని న్యాయస్థానం అనుమతి కోరారు. న్యాయస్థానం అనుమతిస్తే నిందితులపైన టెలిగ్రాఫ్‌ చట్టం కింద కేసు పెడతారు. అప్పుడు విచారణలో నేరం రుజువైతే ఉద్యోగాలు పోవడమే కాకుండా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కేసీఆర్‌ మెప్పుకోసమో, కేటీఆర్‌ మెప్పుకోసమో, లేదా తాత్కాలిక ప్రయోజనాల కోసమో ఈ తప్పుడు పనులు చేసి ఉండవచ్చును గానీ ఫలితాన్ని వారు అనుభవించక తప్పదు. రాజకీయ నాయకులు ఎప్పుడూ సేఫ్‌గానే ఉంటారు. ఫలానా ఫలానా వారి ఫోన్లు ట్యాప్‌ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేయరు కదా? మహా అయితే మౌఖికంగా చెప్పి ఉంటారు. ప్రొసీజర్‌ ప్రకారం వ్యవహరించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో న్యాయస్థానాలు కూడా ప్రతివాదులుగా అధికారులకే నోటీసులు ఇస్తాయి. రాజకీయంగా పదవుల్లో ఉన్న వారికి ఇవ్వవు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసి ఉండరు. అక్కడ కూడా ప్రభుత్వం మారితే అధికారులే శిక్షించబడతారు. 2018 నుంచి 2023 మధ్య కాలంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఎంత అడ్డగోలుగా వ్యవహరించిందో తెలిపే సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వంలో జవాబుదారీతనం లేకుండా పోయింది. అధికారులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిన అధికారులు స్వామి కార్యంతో పాటు స్వకార్యాలు కూడా చక్కబెట్టుకున్నారు. ప్రైవేటు వ్యక్తుల వ్యక్తిగత, వ్యాపార రహస్యాలు తెలుసుకొని డబ్బు సంపాదించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అధికార యంత్రాంగం కట్టుదప్పితే ఎవరికీ రక్షణ ఉండదని ఈ ఉదంతం చెబుతోంది. హద్దూ అదుపూ లేకుండా ఫోన్లు ట్యాప్‌ చేయడానికి అనుమతించిన పాపానికి పాలకుల రహస్యాలు కూడా సదరు అధికారులకు తెలియకుండా ఉంటాయా? రాజకీయ ప్రత్యర్థుల, కుటుంబ సభ్యుల ఫోన్‌ సంభాషణలను వినడానికి అనుమతించిన వాళ్లు తమ కుటుంబ సభ్యుల సంభాషణలకు కూడా రక్షణ ఉండదన్న సూక్ష్మాన్ని ఎలా విస్మరించారో తెలియదు. ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహరంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తుందో తెలియదు. నిజాయితీగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తే మాత్రం ప్రస్తుతం జైలుకు వెళ్లిన వారితో పాటు మరికొంత మంది ఉన్నతాధికారులు కూడా జైలుకు వెళ్లవలసి వస్తుంది. ఈ పాపం చివరకు కేసీఆర్‌కు చుట్టుకుంటుందో లేదో చూడాలి. విచారణ హేతుబద్ధంగా జరిగితే దేశవ్యాప్తంగా ఈ కేసు ఒక కేస్‌ స్టడీ అవుతుంది. రాజకీయ పార్టీలకు, నాయకులకు గుణపాఠంగా మిగులుతుంది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించిన ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యహారంపై న్యాయస్థానాలు కూడా సీరియస్‌గా దృష్టి సారించాలి. లేని పక్షంలో ఇప్పటివలె ఇకపై కూడా న్యాయమూర్తులూ స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితులే మిగులుతాయి.


కేసీఆర్‌ సాధించిందేమిటి?

వందల మంది ఫోన్లను ట్యాప్‌ చేయించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏం బావుకున్నారో తెలియదు. సొంత మనుషులను పరాయివాళ్లలా అనుమానించి దూరం చేసుకున్నారు. ఇప్పుడు ఆయనే ఒంటరి అయ్యారు. అధికారమంటే బాధ్యత అనే విషయం విస్మరించి, తమకు ప్రత్యర్థులే ఉండకూడదన్న ధోరణితో వ్యవహరించడం వల్లనే కేసీఆర్‌కు ప్రస్తుత దుస్థితి దాపురించింది. నిన్నటి వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం కాంగ్రెస్‌–బీజేపీలు వెతుక్కొనేవి. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ తరఫున టికెట్‌ పొందినవారు కూడా కాడి పారేసి పారిపోతున్నారు. కేసీఆర్‌ తరహాలో అధికారంతో విర్రవీగిన వారికి ఈ తరహా పతనమే ఎదురుచూస్తూ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు బలమైన నాయకులను పక్కన పెట్టుకోగూడదని కోరుకుంటారు. ప్రాంతీయ పార్టీలలో ఈ ధోరణి అధికంగా ఉంటుంది. కేసీఆర్‌ కూడా ఇదే మార్గంలో పయనించి ఇప్పుడు అధికారం కోల్పోయాక ఒంటరిగా మిగిలారు. తెలంగాణ ఉద్యమంతో మమేకమై పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్లను కాదని ప్రజాబలం లేని వాళ్లను, తనకు వంత పాడే వాళ్లను కేసీఆర్‌ తన చుట్టూ నింపుకొన్నారు. ఫలితంగా బలమైన నాయకులు దూరమయ్యారు. ప్రజాబలం లేకపోయినా కేసీఆర్‌ మనసెరిగి వ్యవహరించడం ద్వారా లాభపడుతూ వచ్చిన వాళ్లు ఇప్పుడు ఒక్కొక్కరుగా ఆయనను విడిచి వెళ్లిపోతున్నారు. చెరువులో నీళ్లు లేకపోతే చేపలు ఎందుకుంటాయి? కే.కేశవరావు విషయమే తీసుకుందాం. రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు కేసీఆర్‌ రెండు పర్యాయాలు అవకాశం కల్పించారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా గెలవలేదు. ‘పార్టీ ఏం తక్కువ చేసిందని ఇప్పుడు వెళ్లిపోతున్నావ్‌?’ అని కేసీఆర్‌ ఆయనను ప్రశ్నించారట! ఈ ప్రశ్నలో న్యాయం ఉంది. కేసీఆర్‌ ఆవేదనను కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే రాజకీయాలు క్రూరంగా ఉంటాయని కేసీఆర్‌కు తెలియదా? అధికారంలో ఉన్నప్పుడు కొందరి విషయంలో క్రూరంగా వ్యవహరించిన కేసీఆర్‌ ఈ చిన్న లాజిక్‌ ఎలా మిస్సయ్యారో? పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వెళ్లిపోతుంటే బేలగా చూస్తుండిపోవడం కేసీఆర్‌ వంతయింది. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన రంజిత్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డి తనను పిచ్చోడ్ని చేశారని కేటీఆర్‌ శుక్రవారం నాడు వాపోయారు. కేటీఆర్‌ ఈ మాటలు అన్నప్పుడు వేదికపై ఉన్న కొందరు కూడా ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీతో టచ్‌లోకి వెళ్లిన విషయం ఆయనకు తెలియకపోవడం అసలైన గమ్మత్తు. అధికారం పోవడంతో ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించలేక పోతున్నారు కదా! మరి... ఇటువంటి విషయాలు ఎలా తెలుస్తాయిలే! నిజానికి కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి బీఆర్‌ఎస్‌కు చెందిన అనేక మంది పోటీ పడుతున్నారు. అయితే, కాంగ్రెస్‌ పార్టీ ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకుంది. బీఆర్‌ఎస్‌ పూర్తిగా దెబ్బ తింటే బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం అంత సులువు కాదని రేవంత్‌ రెడ్డికి తెలియదా? లోక్‌సభ ఎన్నికల కోసం కేసీఆర్‌ ప్రకటించిన అభ్యర్థులలో రంజిత్‌ రెడ్డి, కడియం కావ్య కాంగ్రెస్‌లోకి జంప్‌ చేయగా మరికొందరు అదే బాటలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంలేదు. ‘రంజిత్‌ రెడ్డికి డబ్బు ప్రధానం. ఆయన ఇంత స్వార్థపరుడు అనుకోలేదు’ అని కేటీఆర్‌ ఇప్పుడు వాపోతున్నారు గానీ... రంజిత్‌ రెడ్డి వంటి వారిని చేరదీసి ఎందుకు మేళ్లు చేశారో కేటీఆర్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు డబ్బున్న వారి అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలో మమేకమై పార్టీనే నమ్ముకున్న వారిలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా గెలిచే పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. కానీ... కేసీఆర్‌ అలా చేయలేదు. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. ‘తెలంగాణ బాపు’గా పిలిపించుకున్న కేసీఆర్‌ పట్ల ఇంత జరుగుతున్నా ప్రజల నుంచి కనీసం సానుభూతి రావడం లేదు. కేసీఆర్‌ కుటుంబంపై తెలంగాణ సమాజంలో ఇంత వ్యతిరేకత ఎందుకొచ్చింది? అంటే అందుకు ఆ కుటుంబ వ్యవహార శైలే కారణం. ప్రాంతీయ పార్టీలన్నింటికీ ఈ సూత్రం వర్తిస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే నాటికి ఇంకెంత మంది బీఆర్‌ఎస్‌ను వీడతారో తెలియదు. ధర్మో రక్షతి రక్షితః అంటారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించి ఉంటే ఈ పాటికి కేసీఆర్‌పై సానుభూతి ఏర్పడి ఉండేది. కేసీఆర్‌ ఇప్పటికైనా దొరతనాన్ని విడనాడాలి. తన ప్రస్తుత దుస్థితికి కారణమేమిటో ఆత్మపరిశీలన చేసుకోవాలి. తనకు అండగా ఉంటూ వచ్చిన సమూహాలు ఎందుకు దూరమయ్యాయో ఆత్మపరిశీలన చేసుకోవాలి.


కులానికి చేటు చేసిన...

ఫోన్‌ ట్యాపింగ్‌ పుణ్యమా అని తెలంగాణ సమాజంలో వెలమ సామాజిక వర్గం ఇవాళ దోషిగా నిలబడాల్సి వచ్చిందంటే అందుకు కేసీఆర్‌ మాత్రమే కారణం. గుప్పెడు మందిని ప్రోత్సహించి మొత్తం సామాజిక వర్గానికే నష్టం చేశారు. రాజకీయాల్లో ఉత్థాన పతనాలు సహజం. తెలంగాణ సమాజం చైతన్యవంతంగా ఉంటుంది. ఆత్మపరిశీలన చేసుకొని, చేసిన తప్పులకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే కేసీఆర్‌ను మళ్లీ ప్రజలు ఆదరించవచ్చు. ఓటమికి కుంగిపోవడం నిజమైన నాయకుల లక్షణం కాదు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని లేచి నిలబడే ప్రయత్నం చేస్తే భవిష్యత్తు ఉండవచ్చు. భేషజాలకు పోవడం వల్ల ప్రయోజనం ఉండదు. రాష్ట్రం విడిపోయిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరైనా అనుకున్నారా? అయితే, తన తప్పులను తెలుసుకోవడానికి కేసీఆర్‌ ఇప్పటికీ సిద్ధంగా ఉన్నట్టు అనిపించడం లేదు. నిన్నగాక మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విమానాశ్రయంలో చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమై మంతనాలు జరిపారని పచ్చి అబద్ధాలను తన పత్రికలో అచ్చువేయించారు. జగన్‌కు మద్దతుగా ఉంటూ చంద్రబాబును టార్గెట్‌ చేసుకోవడం వల్ల ఉభయ భ్రష్టత్వం చెందడం మినహా ప్రయోజనం ఉండదని కేసీఆర్‌ తెలుసుకోలేకపోతే ఎవరు మాత్రం ఏమి చేయగలరు? కుల బలం లేకపోయినా ప్రాంతీయ వాదంతో కేసీఆర్‌ ఇంత కాలం రాజకీయాల్లో రాణించారు. ఇప్పుడు పార్టీ పేరు మార్చి దాన్ని కూడా వదులుకున్నారు. ఫాం హౌజ్‌లో కాలక్షేపం చేస్తున్న కేసీఆర్‌ కాసేపు కళ్లు మూసుకొని ప్రశాంతంగా ఆత్మపరిశీలన చేసుకుంటే తన లోపాలు ఏమిటో తెలిసిపోతాయి. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను భయపెట్టి లొంగదీసుకున్నారు. ఇప్పుడు భయానికి అలవాటు పడిన మీడియా ప్రభుత్వంలో ఉన్నవారిని కాదని కేసీఆర్‌కు అండగా ఎందుకు నిలుస్తుంది? కర్మ మనల్ని వెంటాడుతుంది! 80వేల పైచిలుకు పుస్తకాలు చదివానని చెప్పుకొనే కేసీఆర్‌కు ఈ విషయం కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే కర్మ వెంటాడుతోంది. అనుభవించాల్సిందే!

ఆర్కే

Updated Date - Mar 31 , 2024 | 01:26 AM