Share News

Road accidents: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి దుర్మరణం

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:24 PM

రాజధాని బెంగళూరులో వేర్వేరుగా జరిగిన నాలుగు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలు కాగా పలువురు గాయపడ్డారు. దేవనహళ్లిలో సోమవారం రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురిని బైక్‌ ఢీకొంది.

Road accidents: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి దుర్మరణం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాజధాని బెంగళూరులో వేర్వేరుగా జరిగిన నాలుగు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలు కాగా పలువురు గాయపడ్డారు. దేవనహళ్లిలో సోమవారం రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురిని బైక్‌ ఢీకొంది. ఈ ఘటనలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు నాగేశ్‌(27) మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న వ్యక్తి కూడా గాయపడ్డంతో ఆసుపత్రికి తరలించారు. దేవనహళ్లిలోని భువనహళ్లి బ్రిడ్జి వద్ద మంగళవారం ఉదయం ప్రైవేట్‌ పాఠశాల బస్సు, ద్విచక్రవాహనాన్ని ఢీ కొనగా బండి నడుపుతున్న మనోజ్‌రెడ్డి (19) దుర్మరణం పాలయ్యాడు. ఇతడు యలహంకలోని కొండప్ప లే అవుట్‌కు చెందినవాడని, చిక్కబళ్లాపుర కళాశాలలో ఇంజనీరింగ్‌ చదువుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. కళాశాలకు వెళ్తుండగా ఈ దారుణం సంభవించింది. దేవనహళ్లి ట్రాఫిక్‌ పోలీసులు ఈ రెండు ఘటనలకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామాక్షిపాళ్య పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం హంప్‌పై నుంచి ఎగిరి కిందపడ్డంతో బండి నడుపుతున్న సంజయ్‌ (26) తీవ్రంగా గాయపడి మంగళవారం విక్టోరియా ఆసుపత్రిలో మృతి చెందాడు. మరో ఘటనలో వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో తండ్రీ, కుమార్తె మృతి చెందిన సంఘటన నెలమంగల జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.

తుమకూరు(Tumakuru) జిల్లా బేళూరుకు చెందిన అమిత్‌ (38), అన్విత (5) మృతి చెందారు. వీరు బెంగళూరులోని మాగడి రోడ్డులో నివసిస్తున్నారు. బైక్‌పై ప్రయాణిస్తున్న అమిత్‌ భార్య కుసుమ తీవ్రంగా గాయపడ్డంతో ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉందని పోలీసులు వెల్లడించారు. నెలమంగల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వేగంగా వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు, బైక్‌ను ఢీకొన్న దుర్ఘటనలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ మృతి చెందిన సంఘటన మైసూరు రోడ్డు శాటిలైట్‌ బస్టాండ్‌ వద్ద సోమవారం అర్ధరాత్రి తర్వాత సంభవించింది. ఈ ఘటనలో మృతి చెందిన డెలివరీబాయ్‌ను బసవరాజ్‌గా గుర్తించారు. హెల్మెట్‌ ధరించినా కూడా బస్సు చక్రాల కిందపడి ఇతను మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు.

Updated Date - Jan 17 , 2024 | 12:24 PM