Share News

ఏపీ మంత్రి సిబ్బంది బెదిరింపులకు.. ఓ మహిళ నిండు ప్రాణం బలి!

ABN , Publish Date - Apr 20 , 2024 | 09:38 AM

ఏపీ ప్రభుత్వంలోని ఓ మంత్రి సిబ్బంది తీవ్ర బెదిరింపులు ఫిలింనగర్‌కు చెందిన ఓ నిరుపేద మహిళ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఆ మహిళ మైనర్‌ కుమారుడు స్కూటీ ప్రమాదవశాత్తు మంత్రి కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న ఖరీదైన కారుకు తగిలి..

ఏపీ మంత్రి సిబ్బంది బెదిరింపులకు.. ఓ మహిళ నిండు ప్రాణం బలి!

- ఫిలింనగర్‌లో సదరు మంత్రి బీఎండబ్ల్యూ కారుకు.. ప్రమాదవశాత్తు స్కూటీని తగిలించిన బాలుడు

- కారు డ్రైవర్ల బెదిరింపులతో ఆందోళనకు గురైన బాలుడి తల్లి.. ఉరేసుకుని ఆత్మహత్య

- అది మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కారే?

- ఘటనపై గోప్యత పాటిస్తున్న పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వంలోని ఓ మంత్రి సిబ్బంది తీవ్ర బెదిరింపులు ఫిలింనగర్‌కు చెందిన ఓ నిరుపేద మహిళ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఆ మహిళ మైనర్‌ కుమారుడు స్కూటీ ప్రమాదవశాత్తు మంత్రి కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న ఖరీదైన కారుకు తగిలి.. ఆ వాహనానికి చిన్నగా గీతలు పడటంతో మంత్రి సిబ్బంది ఆగ్రహంతో ఊగిపోయారు. బాలుడి నుంచి స్కూటీని స్వాధీనం చేసుకోవడమే కాకుండా.. రిపేరు ఖర్చుల కోసం రూ.20వేలు ఇవ్వాలని అతడి తండ్రికి ఫోన్‌ చేశారు. తమది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం అని అంతడబ్బు ఇచ్చుకోలేమని బతిమాలుకున్నా ఆ సిబ్బంది కనికరించలేదు. దీంతో తన కుమారుడికి ఏదైనా ఆపద తలపెడతారేమోనని ఆందోళనకు గురైన బాలుడి తల్లి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఫిలింనగర్‌లో ఆలస్యంగా వెలుగుచూసిందీ ఘటన. కాగా ఆ కారు ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ది అని అధికార వర్గాల ద్వారా తెలిసింది. రిపేరు ఖర్చు తాలూకు డబ్బు వసూలు కోసం తమ సారు సాయంత్రం నాలుగు గంటల దాకా టైం ఇచ్చారని, డబ్బులివ్వకపోతే అబ్బాయిని జైల్లో వేయిస్తామని సదరు సిబ్బంది బాలుడి తండ్రిని తీవ్రంగా హెచ్చరించడం గమనార్హం. ఏపీలోని కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన సత్యాల వెంకటరమణ (38)కు భార్య సూర్యకుమారి (35), కుమారుడు (14), కుమార్తె ఉన్నారు. ఈ కుటుంబం ఫిలింనగర్‌ దీన్‌దయాళ్‌ కాలనీలో ఉంటోంది. వెంకటరమణ అడ్డా కూలీ. సూర్యకుమారి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. ఈనెల 17న ఉదయం ఎప్పటిలాగే వెంకటరమణ, సూర్యకుమారి పనులకు వెళ్లారు. వీరి కుమారుడు సమీపంలోని గుడికి వెళ్లేందుకు ఇంట్లో ఉన్న స్కూటీని తీసుకొని రోడ్డు మీదకొచ్చాడు. ఫిలింనగర్‌ హకీంబాబా దర్గా సమీపంలో మంత్రికి చెందిన బీఎండబ్యూ కారు వెళుతోంది. ఆ కారు డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేయడంతో బాలుడు బైక్‌ను అదుపు చేయలేక కారుకు తగిలించాడు. ఈ ఘటనలో కారుకు చిన్నగా గీతలు పడ్డాయి. ఆ సమయంలో కారులో మంత్రి కుటుంబసభ్యులు ఉన్నారు. వెంటనే కారు డ్రైవర్‌ చంద్రశేఖర్‌ బాలుడి నుంచి స్కూటీ తాళాలు లాక్కున్నాడు. ఫోన్‌ చేసి మహేశ్‌ అనే మరో డ్రైవర్‌ను అక్కడికి పిలిపించుకున్నాడు. ఇద్దరు కలిసి బాలుడిని బెదిరించారు. కారు రిపేరుకు అయ్యే డబ్బు ఇస్తేనే బైక్‌ ఇస్తామని, లేదంటే కేసు పెడతామని హెచ్చరించారు. తర్వాత స్కూటీతో పాటు బాలుడిని మంత్రి ఇంటి వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి బాలుడి తండ్రి వెంకటరమణకు ఫోన్‌ చేశారు. ఆయన ఫోన్‌ తీయకపోవడంతో, ఓ కాగితంపై డ్రైవర్‌ మహేశ్‌ ఓ ఫోన్‌ నంబర్‌ రాసి, బాలుడి చేతిలో పెట్టి.. ‘ఇంటికి వెళ్లి మీ నాన్నతో ఫోన్‌ చేయించు’ అని గద్దించాడు. బాలుడు తండ్రి వద్దకు వెళ్లి డ్రైవర్‌ మహేశ్‌కు ఫోన్‌ చేయించాడు. వెంకటరమణతో ఫోన్‌లో మాట్లాడిన మహేశ్‌.. ‘మీ అబ్బాయి బైక్‌తో కారును గుద్దాడు. రిపేరుకు రూ.20వేలు అవుతాయి. సాయంత్రం 4గంటల్లోగా ఇవ్వాలి. లేదంటే కేసు పెడతాం’ అని హెచ్చరించారు. ఇదే విషయాన్ని వెంకటరమణ తన భార్య సూర్యకుమారికి ఫోన్‌ చేసి చెప్పాడు. తర్వాత.. వెంకటరమణ, వాయిదాల్లో చెల్లిస్తామని బైక్‌ ఇవ్వాలంటూ కోరినా మంత్రి సిబ్బంది అంగీకరించలేదు. పైగా.. ‘టైమ్‌లోపు డబ్బులివ్వండి.. లేదంటే నీ కొడుకు సంగతి చూస్తాం. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా లేని నీ మైనర్‌ కొడుకు జైలుకు పోతే బయటకు రాడు’ అని డ్రైవర్లు బెదిరింపులకు దిగారు. దీంతో కంగారుపడిపోయిన బాలుడి తల్లిదండ్రులు.. రూ.20వేలు ఎలా సర్దాలి? అనే విషయంలో తీవ్రంగా మథనపడ్డారు. కొద్దిసేపటికి వెంకటరమణకు ఓ ఇంటి సామన్లు మార్చే పని రావడంతో సాయంగా ఉండేందుకు వెంట కుమారుడిని తీసుకెళ్లాడు. డ్యూటీ నుంచి ఇంటికొచ్చినసూర్యకుమారి భర్తకు ఫోన్‌ చేసి, కొడుక్కి స్కూటీ ఎందుకిచ్చావు? రూ.20వేలు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచొస్తాయి? అని రోదిస్తూ ప్రశ్నించింది. గడువులోపు డబ్బులు చెల్లించకపోతే ఒక్కగానొక్క కుమారుడికి ఎలాంటి ఆపద వస్తుందోనని మనస్తాపానికి గురైంది. అదే రోజు ఇంట్లోనే చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

కారు వివరాలు గోప్యం

ఈ ఘటనకు సంబంధించి ఫిల్మ్‌నగర్‌ పోలీసులు ఏపీ మంత్రి డ్రైవర్లు చంద్రశేఖర్‌, మహేశ్‌ను అదుపులోకి తీసుకొని ఐపీసీ 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. బాలుడు నడిపిన స్కూటీని స్టేషన్‌లో ఉంచారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు గోప్యత పాటిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కారును స్కూటీ ఢీకొన్న ఘటనకు సంబంధించి నిబంధనల ప్రకారం రెండు వాహనాలకు సంబంధించి వివరాలను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరాల్చి. అయితే పోలీసులు కేవలం స్కూటీ నంబరునే ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. కారు నంబరు, ఆ వాహనం ఎవరి పేరు మీద ఉంది? అనే వివరాలను పేర్కొనలేదు. ఆ కారు.. ఏపీలోని కీలక మంత్రిది కావడంతోనే పోలీసులు గోప్యత పాటిస్తున్నారే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Apr 20 , 2024 | 09:39 AM