Share News

YS Jagan: నిష్క్రమణకు సిద్ధమా?

ABN , Publish Date - Mar 11 , 2024 | 07:29 AM

YS Jagan Siddham Sabha: మూడు దశాబ్దాలు రాష్ట్రాన్ని ఏలుతానని ప్రకటించుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఈ ముచ్చట ఐదేళ్లకే ముగియనుందని అర్థమైపోయిందా..? పదవి పోతుందని ముందుగానే మానసికంగా సిద్ధమయ్యారా..? బాపట్ల జిల్లా మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో ఆయన ప్రసంగం జనానికి వీడ్కోలు పలుకుతున్నట్లుగా ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి...

YS Jagan: నిష్క్రమణకు సిద్ధమా?

  • జగన్‌ మాటల్లో బేలతనం!

  • బాబు గెలిచినా తన పథకాలు అమలు చేయాలట!

  • ఓటమి చింత లేదంటూనే పొత్తుపై విసుర్లు

  • సభలో తొక్కిసలాట.. ఒకరి మృతి

  • టీడీపీ–జనసేన–బీజేపీ పొత్తుపై విసుర్లు

  • మేదరమెట్లలో సీఎం ‘వీడ్కోలు’ ప్రసంగం?

  • ఎక్కడా ధీమా లేదు.. ఉత్సాహమూ కరువు

  • బాబు, పవన్‌పైనే విమర్శలు.. బీజేపీపై మాత్రం జంకు

(బాపట్ల/అమరావతి/ఒంగోలు–ఆంధ్రజ్యోతి) :

మూడు దశాబ్దాలు రాష్ట్రాన్ని ఏలుతానని ప్రకటించుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డికి (CM YS Jagan Reddy) ఈ ముచ్చట ఐదేళ్లకే ముగియనుందని అర్థమైపోయిందా..? పదవి పోతుందని ముందుగానే మానసికంగా సిద్ధమయ్యారా..? బాపట్ల జిల్లా మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో ఆయన ప్రసంగం జనానికి వీడ్కోలు పలుకుతున్నట్లుగా ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నిష్క్రమణ ఖాయమనే బహిరంగంగా వారిని బ్లాక్‌మెయిల్‌ చేయడానికి ప్రయత్నించారని.. బేలతనం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించిందని.. తనను రెండోసారి గెలిపించకపోతే సంక్షేమ కార్యక్రమాలన్నీ పోతాయని బెదిరింపులకు దిగారని అంటున్నాయి. టీడీపీ సూపర్‌సిక్స్‌ స్కీంలపై ఆయన విమర్శల్లో పదును లేదని చెబుతున్నాయి. ‘వైనాట్‌ 175’ అని ఊదరగొడుతున్న ఆయన.. అధికారం పోతుందన్న చింతలేదన్నారు. అంతేకాదు.. చంద్రబాబు విజయం గురించి ప్రస్తావించారు. రేపు చంద్రబాబు గెలిచినా.. తన పథకాలు అమలు చేయాల్సిందేనని.. టీడీపీ చెప్పిన స్కీంలు చూస్తే దీనికి రెట్టింపు బడ్జెట్‌ అవుతుందని అనడం.. ఆయనలోని ధీమా సడలుతోందనడానికి నిదర్శనంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే మీడియాపై నేరుగా ఎదురుదాడికి దిగకుండా.. దాని నుంచి ప్రజలే నన్ను కాపాడుకోవాలని ఆయన అభ్యర్థించారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో వైసీపీ నాలుగు ‘సిద్ధం సభలు ఏర్పాటు చేయగా.. మేదరమెట్ల సభ నాలుగోది. 2018లో ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్న టీడీపీ.. ఇప్పుడు మళ్లీ బీజేపీతో చెలిమికి సిద్ధం కావడం.. జనసేనతో కలిసి పొత్తు ఖరారు చేసుకోవడం జగన్‌ అండ్‌ కోకు మింగుడుపడడం లేదు. అయితే మేదరమెట్ల సభలో సీఎం కేవలం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను మాత్రమే టార్గెట్‌ చేశారు. బీజేపీ ఊసే ఎత్తలేదు. ప్రసంగంలో ఉత్సాహం, మాటల్లో ధీమా కనబడలేదు.. గంటంబావు మాట్లాడితే అందులో అధిక భాగం టీడీపీ మేనిఫెస్టోను విమర్శించడానికే కేటాయించారు. పైగా టీడీపీ సూపర్‌సిక్స్‌ గ్యారెంటీలకు పరోక్షంగా ప్రచారం చేయడంతో వైసీపీ శ్రేణులు కంగుతిన్నాయి. ఇక సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో ప్రకటిస్తామని ఆ పార్టీ పెద్దలు వారం రోజులుగా ఊదరగొడుతూ వచ్చారు. జగన్‌ మాత్రం త్వరలో ప్రకటిస్తామంటూ దాటవేశారు. ఇది ఆయనలో మొదలైన బెరుకుకు సూచికగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తన పథకాలకు ఇంత ఖర్చుచేస్తున్నానని.. టీడీపీ చెప్పే పథకాలకయ్యే ఖర్చుకు లెక్కలు వేయించానని, వాటి అమలుకు రెట్టింపు బడ్జెట్‌ కావాలని ఆయన వ్యాఖ్యానించారు.

YS Jagan: ‘సిద్ధం’ చివరి సభలో జగన్ ప్రసంగం.. కంగుతిన్న వైసీపీ!Jagan-Siddham.jpg

శ్రేణులు డీలా..

తమ నేతను హీరోగా ఊహించుకునే వైసీపీ ముఖ్య నేత లు.. సిద్ధం సభలో జగన్‌ ప్రసంగం తీరు చూసి డీలా పడిపోయారు. ముఖ్యంగా ఆయన ముఖంలో ఎక్కడా సభ తాలూకు ఉత్సాహమే కనిపించలేదని సొంత పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. జనాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసే విధంగా.. సంక్షేమ పథకాలు అందాలంటే తననే గెలిపించాలనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా ప్రకటించినట్లు సిద్ధం సభా వేదికపై జగన్‌ మేనిఫెస్టో ప్రకటించకపోవడం వెనక బీజేపీతో టీడీపీ పొత్తే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇన్ని రోజు లూ కేంద్రం అండదండలతో అప్పులతో రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్న జగన్‌లో ఈ పొత్తు అభద్రతను పెంచిందని అంటున్నారు.

బీజేపీని నేరుగా విమర్శించేందుకు జంకు

సిద్ధం సభావేదికపై పొత్తులపై ఘాటుగానే స్పందించిన జగన్‌.. యథాప్రకారం చంద్రబాబు, పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కానీ కూటమిలోని మూడోపార్టీ బీజేపీని గానీ, ప్రధాని మోదీని గానీ నేరుగా విమర్శించే సాహసం చేయలేదు. ఇన్ని రోజులూ ఎవరు ఎవరితో జత కట్టినా భయం లేదని.. సింహం సింగిల్‌గానే దిగుతుందని బీరాలు పలికారు. అయితే మేదరమెట్ల సభలో ఆయన ముఖంలో కనిపించిన హావభావాలను గమనిస్తే.. బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు ఖాయమవడం ఆయనకు ఆందోళన కలిగిస్తున్నట్లు తెలిసిపోతోందని వైసీపీ నేతలే అంటున్నారు.

Siddam-Jagan-Sabha.jpg

సీఎం తడబాటు..

సాధారణంగా 40 నిమిషాలలోపే ప్రసంగం ముగించే జగన్‌ ఆదివారం మేదరమెట్ల సభలో మాత్రం గంటా 15 నిమిషాలు మాట్లాడారు. ఈ సందర్భంగా.. మీ జగన్‌ను గెలిపించేందుకు పొత్తుల పార్టీని ఓడించేందుకు మీరు సిద్ధమేనా అని పలుసార్లు ప్రశ్నించినా.. ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. వేదిక ముందు భాగంలో ఉన్న కొద్దిమంది వైసీపీ కార్యకర్తలు చేతులెత్తినా.. తామూ సిద్ధమన్న స్పందన జనం నుంచి కనిపించక.. వినిపించక జగన్‌ పదేపదే మీరు సిద్ధమేనా.. మీరు సిద్ధమేనా అని అడిగారు. టీడీపీ ఎన్నికల గుర్తు సైకిల్‌ను, జనసేన ఎన్నికల గుర్తు గ్లాస్‌ను హేళన చేశారు. కానీ బీజేపీ గుర్తు కమలంపై ఎలాంటి వ్యాఖ్యా చేయకపోవడం వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఆయన ‘మోదీగారు’ అని సంబోధించి.. పవన్‌ను మాత్రం దత్తపుత్రుడిగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక వైసీపీ అభ్యర్థుల తుది జాబితా గురించి కూడా జగన్‌ మాట్లాడలేదు. తాను మాటిస్తే దానికి కట్టుబడి ఉంటానని.. ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకున్నాకే హామీ ఇస్తానని తనకు తాను గొప్పగా చెప్పుకొన్నారు. 2019 ఎన్నికలకు ముందు తానేం చెప్పానని జనాలను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. ఈ సమయంలో కొందరు సభికులు.. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్నారని అరిచారు. అదేవిధంగా సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. జగన్‌ ఆ మాటలను పట్టించుకోలేదు. తనకు అధికారమిస్తే రాష్ట్ర ప్రజల ముఖాల్లో ఆనందాన్ని చూస్తానని మాటిచ్చానని అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఉన్నా లేకున్నా చింతలేదని ప్రకటించారు. ప్రత్యేక హోదా, సంపూర్ణ మద్య నిషేధం, ఏటా జాబ్‌ కేలెండర్‌, సీపీఎస్‌ రద్దు, విద్యుత్‌ చార్జీల పెంపువంటి అంశాల ప్రస్తావనా తీసుకురాలేదు. తాను గెలిస్తేనే అవ్వాతాతలకు పింఛన్లు వస్తాయని.. విద్యాదీవెన , వసతి దీవెన వంటి పథకాలు అమలవుతాయని.. లేదంటే అవన్నీ ఉండవని బెదిరించే ప్రయత్నం చేశారు. తాను వచ్చాకే పెన్షన్లు ఇస్తున్నట్లు భ్రమింపజేయాలని చూశారు. ఎప్పటి నుంచో అమలవుతున్న ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కూడా తన ఖాతాలోనే వేసుకున్నారు.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2024 | 07:30 AM