Share News

YCP: ఏపీలో బాలినేని వర్గం దౌర్జన్యకాండ

ABN , Publish Date - Apr 12 , 2024 | 09:33 AM

ఒంగోలులో వైసీపీ (YSRCP) రౌడీ రాజకీయం శ్రుతిమించింది. బుధవారం నగరంలో టీడీపీ నాయకులతోపాటు, సామాన్యులపైనా దాడి చేసి, బీభత్సం చేసిన ఆ పార్టీ నేతలు.. తిరిగి తెలుగుదేశం వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టారు. దీనికి పోలీసులు కూడా వత్తాసు పలుకుతూ వారు ఫిర్యాదిచ్చిందే తడవుగా కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది.

YCP: ఏపీలో బాలినేని వర్గం దౌర్జన్యకాండ

● ఒంగోలులో పెచ్చుమీరిన వైసీపీ రౌడీయిజం

● రాష్ట్రమంతా చూసిన బాలినేని వర్గం దౌర్జన్యకాండ

● అధికార పార్టీ ఒత్తిళ్లలో పోలీసులు, జీజీహెచ్‌ అధికారులు

● 36 మంది కూటమి నేతలపై తప్పుడు కేసులు

● జీజీహెచ్‌ ఘటనపై వివరణ కోరిన కలెక్టర్‌

● సీసీ ఫుటేజీలు మాయం చేసేందుకు యత్నాలు

ఒంగోలు (కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 11: ఒంగోలులో వైసీపీ (YSRCP) రౌడీ రాజకీయం శ్రుతిమించింది. బుధవారం నగరంలో టీడీపీ నాయకులతోపాటు, సామాన్యులపైనా దాడి చేసి, బీభత్సం చేసిన ఆ పార్టీ నేతలు.. తిరిగి తెలుగుదేశం వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టారు. దీనికి పోలీసులు కూడా వత్తాసు పలుకుతూ వారు ఫిర్యాదిచ్చిందే తడవుగా కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. బుధవారం అర్ధరాత్రి స్థానిక సమతానగర్‌లో నిర్వహించిన వైసీపీ ప్రచార కార్యక్రమంలో వలంటీర్‌ పాల్గొనడంపై ప్రశ్నించిన పాపానికి సీహెచ్‌ ప్రభావతి కుటుంబంపైనా, పలకరించడానికి వచ్చిన టీడీపీ నేత మోహన్‌రావుపైనా దాడిచేసిన బాలినేని వర్గం ఆ తర్వాత బాధితులు చికిత్సపొందుతున్న రిమ్స్‌ దగ్గరకు వెళ్లి మరీ దౌర్జన్యానికి పాల్పడిన విషయం తెలిసిందే!.

గొడవకు కారణమైన వైసీపీ నేతల నుంచి తమకు ముప్పు ఉన్నట్లు గుర్తించిన టీడీపీ నేతలు.. వెంటనే ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అయితే ఈలోపే దాడి చేసిన వైసీపీ నేతలే నేరుగా రిమ్స్‌ వెళ్లి తమకే గాయాలైనట్లు అబద్ధాలు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడి, రక్తపు మడుగులో ఉన్న టీడీపీ నాయకుడు మేడికొండ మోహన్‌రావు, ఆయనకు అండగా నిలిచిన టీడీపీ నాయకులు 36 మందిపై కౌంటర్‌గా అట్రాసిటీ కేసులు పెట్టడం గమనార్హం.

ఏకపక్షంగా పోలీసుల తీరు

ఇదిలాఉంచితే ఒంగోలులో రణరంగాన్ని సృష్టించిన వైసీపీ నేతలకు పోలీసులు వత్తాసు పలకడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వారి కళ్లముందు జరిగిన ఘటనపై కనీసం కాలు కదపని పోలీసులు ఏకంగా టీడీపీ కూటమి నేతలపై కేసులు పెట్టారు. జీజీహెచ్‌ వద్ద ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డి తమ అనుచరులతో మూడు గంటలపాటు చేసిన దౌర్జన్యకాండ రాష్ట్రమంతా చూసింది. అయినా తాము సచ్చీలురమంటూ మాట్లాడుతున్న వైసీపీ నేతలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారనేందుకు బాధితులపైనే కేసులు పెట్టడం నిదర్శనం.

తమ పార్టీకి చెందిన వారిపై హత్యాయత్నం చేశారని ఎంపీ మాగుంట, దామచర్ల జనార్దన్‌ ఇతర నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి. ఇదేమీ లెక్కచేయని వైసీపీ శ్రేణులు మరోసారి రిమ్స్‌లో దాడులకు తెగబడటం, అద్దాలు, కారులను ధ్వంసం చేయడం ఇప్పుడు నగర ప్రజల్లో చర్చనీయాంశమైంది. అయితే అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో అటు పోలీసులు, ఇటు జీజీహెచ్‌ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. దాడులకు పాల్పడింది బాలినేని వర్గం కాగా డ్యూటీ డాక్టర్‌ తన ఫిర్యాదులో మాత్రం ఇరువర్గాలు కారణమని పేర్కొనడం గమనార్హం.

జీజీహెచ్‌లో గొడవపై కలెక్టర్‌ ఆరా

బుధవారం అర్ధరాత్రి జీజీహెచ్‌లో వైసీపీ మూకల వీరంగంతో రోగులు వణికిపోయారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ కూటమి ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్‌పైన దాడి చేసే ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మూడు గంటల పాటు బాలినేని, ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డి, ఆయన అనుచరులు జీజీహెచ్‌ క్యాజువాలిటీ అద్దాలను పగులగొట్టి, వైద్యులపై దౌర్జన్యం చేశారు.

దీనిపై అటు వైద్యులు, ఇటు రోగులు వైసీపీ చర్యలపై అసహనం వ్యక్తం చేశారు. కాగా, ఘటన జరిగిన తీరుపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ జీజీహెచ్‌ అధికారులను వివరణ కోరారు. అక్కడ జరిగిన పరిణామాలపై నివేదిక ఇవ్వాలని కోరారు. అయితే జీజీహెచ్‌ అధికారులు అధికారపార్టీ వారి ఒత్తిళ్లతో మొక్కుబడి నివేదికకు పరిమితమైనట్లు సమాచారం. దీనిపై జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భగవాన్‌నాయక్‌ను విరవణ కోరగా, జీజీహెచ్‌లో జరిగిన విషయాలు తనకేమీ తెలియదని దాటవేయడం గమనార్హం!.

సీసీ ఫుటేజ్‌లు మాయం చేయాలని చూస్తున్నారు!

జీజీహెచ్‌లో వైసీపీ మూకలు చేసిన అలజడి, దౌర్జన్యకాండ ఆసుపత్రిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. అయితే అబద్ధాలతో అందరినీ మభ్యపెట్టాలని చూసినా, సీసీఫుటేజ్‌లో వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉండటంతో ఆ పార్టీ నేతలు వాటిని కాపీ చేసుకుని, హార్డ్‌ డిస్క్‌ల నుంచి తొలగించాలని జీజీహెచ్‌ సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. ఇదే సమయంలో పోలీసులు కూడా మొక్కుబడి విచారణ చేసి మమ అనిపించడమే కాకుండా, జీజీహెచ్‌లో జరిగిన ఘటనలో టీడీపీవారిపై కేసులు నమోదు చేయాలని చూస్తున్నారు. ఇదంతా చూస్తుంటే అధికార పార్టీకి పోలీసుల అండదండలు ఏ విధంగా ఉన్నాయో స్పష్టమవుతోంది.

Updated Date - Apr 12 , 2024 | 09:40 AM