Share News

YSRCP : వైసీపీకి వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరబోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే!

ABN , Publish Date - Jan 03 , 2024 | 07:41 PM

విజయవాడ సెంట్రల్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీ హైకమాండ్‌కు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లాది విష్ణు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

YSRCP : వైసీపీకి వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరబోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే!

అవును.. వైసీపీ అధిష్టానం రిలీజ్ చేసిన నియోజకవర్గాల ఇంచార్జీల జాబితాతో పార్టీకి ఎక్కడలేని తలనొప్పి వచ్చి పడింది. సిట్టింగులను లెక్కలోకి తీసుకోకుండా అటు ఇటు మార్పులు చేయడం.. మరికొందరు సిట్టింగులను పూర్తిగా పక్కనెట్టేయడంతో వారంతా తమను ఆదరించే పార్టీలో చేరిపోవాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి ముఖ్యనేతలు పార్టీకి గుడ్ బై చెప్పేసి వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వెంట నడవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. గురువారం నాడు ఢిల్లీ వేదికగా వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో షర్మిల విలీనం చేయబోతున్నారు. అంతేకాదు.. ఈ ప్రక్రియ అనంతరం షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవీ బాధ్యతలను ఢిల్లీ పెద్దలు కట్టబెట్టబోతున్నారని టాక్. దీంతో వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలంతా కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి రెడీ అయిపోయారు. అంటే అన్న వైఎస్ జగన్‌కు నో చెప్పి.. చెల్లి షర్మిలకు నేతలు జై కొడుతున్నారన్న మాట.

ఇదీ అసలు కథ

విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీకి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లాది విష్ణు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిన్నటి నియోజకవర్గాల ఇంచార్జుల జాబితాలో మల్లాది విష్ణుకు వైసీపీ హైకమాండ్ హ్యాండ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ అనుచరులు, కార్పొరేటర్లతో మల్లాది విష్ణు పలు దఫాలుగా భేటీ అయ్యారు. తాను వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తానని విష్ణు తేల్చి చెప్పారు. వైసీపీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లాది విష్ణు సిద్ధమయ్యారు.

వస్తున్నా చెల్లెమ్మా!

ఇప్పటికే షర్మిలతో మల్లాది విష్ణు టచ్ లోకి వెళ్లారనే టాక్ నడుస్తోంది. తనకు అన్యాయం జరిగిందని విష్ణు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తనను కలిసేందుకు వచ్చిన వెల్లంపల్లికి కూడా ముక్త సరిగా సమాధానం చెప్పినట్లు విష్ణు తెలిపారు. దీంతో కేవలం 15 నిమిషాల్లోనే వెల్లంపల్లి విష్ణు ఇంటి నుంచి వెళ్లిపోయారు. విష్ణును కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే అందుబాటులోకి రాకపోవడంతో పార్టీ మారిపోతున్నారని.. ఇక ఏం చేసినా ఫలితం లేదని వైసీపీకి స్పష్టమైన సంకేతాలిచ్చేశారని అర్థమవుతోంది.

Updated Date - Jan 03 , 2024 | 08:06 PM