ఓటింగ్‌కు వేళాయె..
ABN, Publish Date - May 13 , 2024 | 01:09 AM
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనున్నది. జిల్లాలో 15,96,916 మంది ఓటర్ల కోసం 1,828 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనకాపల్లిలో 12 మంది, నర్సీపట్నంలో 8, చోడవరంలో 6, ఎలమంచిలిలో 10, పెందుర్తిలో 10, పాయకరావుపేటలో 9, మాడుగులలో 9 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి భవితవ్యాన్ని ఓటరు సోమవారం నిర్ణయించనున్నాడు.
- ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నేడు
- ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు..
- జిల్లాలో మొత్తం ఓటర్లు 15,96,916 మంది
- పురుషులు 7,79,913, మహిళలు 8,16,970, ఇతరులు 33 మంది
- 1,828 పోలింగ్ కేంద్రాలు
- 340 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు
- జిల్లా అంతటా 144 సెక్షన్
- ఎన్నికల విధులకు 13 వేల మంది సిబ్బంది
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనున్నది. జిల్లాలో 15,96,916 మంది ఓటర్ల కోసం 1,828 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనకాపల్లిలో 12 మంది, నర్సీపట్నంలో 8, చోడవరంలో 6, ఎలమంచిలిలో 10, పెందుర్తిలో 10, పాయకరావుపేటలో 9, మాడుగులలో 9 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి భవితవ్యాన్ని ఓటరు సోమవారం నిర్ణయించనున్నాడు.
జిల్లాలో ప్రతి పోలింగ్ కేంద్రానికి 8 మంది చొప్పున సిబ్బందిని నియమించారు. ఆదివారం ఉదయం వీరంతా ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల వద్ద రిపోర్టు చేశారు. అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, ఎలమంచిలి, పాయకరావుపేట, పెందుర్తి నియోజకవర్గ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను, వీవీ ప్యాట్, ఓటరు స్లిప్, ఇంకు బాటిల్ తదితర ఎన్నికల సామగ్రిని ప్రత్యేక వాహనాల్లో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తీసుకు వెళ్లారు.
పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,828 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 15,96,916 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 7,79,913 మంది పురుషులు, 8,16,970 మంది మహిళలు, 33 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 340 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. 380 సూక్ష్మ పరిశీలకులను నియమించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ జరిగేలా ఏర్పాట్లు చేసి, జిల్లా కేంద్రం నుంచి కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ కేవీ మురళీకృష్ణ నేతృత్వంలో ఎన్నికల బందోబస్తు చర్యలు చేపట్టారు. పోలింగ్ విధుల్లో 3 వేలమంది పైచిలుకు పోలీసులు పాల్గొంటున్నారు. ఇప్పటికే కేంద్ర పోలీసు బలగాలు కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించారు.
జిల్లా అంతటా 144 సెక్షన్
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లపై నిఘా పెట్టారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 48 గంటల పాటు 144 సెక్షన్, 30 పోలీస్ యాక్టు అమలు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి నలువైపులా 100 మీటర్ల దూరం వరకు ఎలాంటి ప్రచారాలు చేయవద్దని హెచ్చరించారు. కాగా జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ బూత్‌ల వద్ద వివిధ హోదాలకు చెందిన 13 వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.
ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నంబరు
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు చేయాల్సి వస్తే అనకాపల్లి కమాండ్ కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నంబరు 1960 కు ఫోన్ చేయాలని కమాండ్ కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి పి.ప్రసాద్ తెలిపారు. ల్యాండ్‌లైన్ నంబరు 0892 4226599కు కూడా సమాచారం ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
Updated at - May 13 , 2024 | 01:09 AM