Share News

AP State General Secretary : ఏపీఎన్‌జీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విద్యాసాగర్‌

ABN , Publish Date - Dec 29 , 2024 | 06:03 AM

ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ అండ్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ (ఏపీఎన్‌జీజీఓ) అసోసియేషన్‌ అగ్రనేతగా విజయవాడకు చెందిన ఎ.విద్యాసాగర్‌ ఎన్నిక కాబోతున్నారు.

AP State General Secretary : ఏపీఎన్‌జీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విద్యాసాగర్‌

  • 31న ప్రస్తుత కార్యదర్శి పదవీ విరమణ.. అదే రోజు ఎన్నిక

విజయవాడ, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ అండ్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ (ఏపీఎన్‌జీజీఓ) అసోసియేషన్‌ అగ్రనేతగా విజయవాడకు చెందిన ఎ.విద్యాసాగర్‌ ఎన్నిక కాబోతున్నారు. ఈ నెల 31న విజయవాడలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీఎన్‌జీజీఓ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సాగర్‌ పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీహెచ్‌ పురుషోత్తమ నాయుడు డిసెంబరు 31న తాను పనిచేసే వాణిజ్య శాఖలో పదవీ విరమణ చేయనున్నారు. ఏపీఎన్‌జీజీఓ బైలా ప్రకారం ప్రభుత్వ శాఖలో పదవీ విరమణతోనే సంఘం నుంచి కూడా విరమణ పొందాల్సి ఉంటుంది. దీంతో ఖాళీ అయ్యే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థానానికి అదేరోజు ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉమ్మడి 13 జిల్లాల కార్యవర్గాలు ఏకగ్రీవంగా విద్యాసాగర్‌ పేరును ప్రతిపాదించాయి. విద్యాసాగర్‌ పేరును రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి ఖరారు చేశారు. 31న పురుషోత్తమనాయుడుకు వీడ్కోలుతో పాటు విద్యాసాగర్‌కు అభినందన కార్యక్రమాన్ని ఒకే వేదికపై నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విద్యాసాగర్‌ గాంధీనగర్‌లోని ఏపీఎన్‌జీజీఓ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్థానిక జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు. తిరిగి అక్కడి నుంచి భారీ ర్యాలీగా ఏపీఎన్‌జీజీఓ భవన్‌కు చేరుకుని ముఖ్యులు, జిల్లాల నాయకత్వాలతో సమావేశమవుతారు. విద్యాసాగర్‌ ప్రస్తుతం ఏపీఎన్‌జీజీఓ అసోసియేషన్‌కు పశ్చిమ కృష్ణా అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. విద్యార్థి జీవితం నుంచే ఉద్యమాలే ఊపిరిగా సాగర్‌ ప్రస్థానాన్ని సాగించారు. సమైక్యాంధ్ర పోరాటాన్ని తెర వెనుక ఉండి నడిపించారు. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య వారధిలా పనిచేసేవారు.


వైసీపీ హయాంలో సాగర్‌పై ప్రభుత్వ పెద్దలు పరోక్షంగా కుట్రలు చేసి ఆయనను రాష్ట్ర నాయకత్వంలోకి రానీయకుండా చేశారు. సకలశాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి విద్యాసాగర్‌ను రాష్ట్ర కార్యవర్గంలోకి రానీయకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వం మారడం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవీ విరమణ చేస్తుండడంతో ఆయన స్థానాన్ని సాగర్‌కు అప్పగించాలని అన్ని జిల్లాల కార్యవర్గాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. మరో నాలుగు నెలల్లో ఏపీఎన్‌జీజీఓ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కేవీ శివారెడ్డి కూడా పదవీ విరమణ చేయనున్నారు. తరువాత ఆ పదవికి విద్యాసాగర్‌ను ఎన్నుకోవటానికి ఇప్పటికే జిల్లా కార్యవర్గాలు ప్రతిపాదించాయి.

Updated Date - Dec 29 , 2024 | 06:05 AM