Share News

ఠాగూర్‌ ఫార్మాలో ప్రమాదం

ABN , Publish Date - Nov 28 , 2024 | 04:50 AM

అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని ఫార్మా సిటీలో విషవాయువు మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. ఠాగూర్‌ లేబొరేటరీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పరిశ్రమలో మంగళవారం సాయంత్రం విష వాయువులు లీకవ్వడంతో ఒడిశాకు చెందిన అమిత్‌ భాగ్‌ (23) అనే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఠాగూర్‌ ఫార్మాలో ప్రమాదం

  • విష వాయువులు లీకై ఒకరు దుర్మరణం

  • తొమ్మిది మందికి అస్వస్థత.. ఇద్దరి పరిస్థితి విషమం

పరవాడ/అనకాపల్లి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని ఫార్మా సిటీలో విషవాయువు మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. ఠాగూర్‌ లేబొరేటరీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పరిశ్రమలో మంగళవారం సాయంత్రం విష వాయువులు లీకవ్వడంతో ఒడిశాకు చెందిన అమిత్‌ భాగ్‌ (23) అనే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయితే ప్రమాద సమాచారం బుధవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. పరవాడ సీఐ మల్లికార్జునరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఠాగూర్‌ లేబొరేటరీ్‌సలోని ప్రొడక్షన్‌ బ్లాక్‌-3లో హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ (హెచ్‌సీ సెల్‌), క్లోరోఫామ్‌ కలిపి 2కే ఎల్‌ సామర్థ్యం కలిగిన రియాక్టర్‌లోకి పంపించారు. అయితే ఓవర్‌ ఫ్లో కావడంతో క్లోరోఫామ్‌ లిక్విడ్‌ అధిక మొత్తంలో రియాక్టర్‌పై ఉన్న పైపు ద్వారా బయటకు వ్యాపించింది. అక్కడే పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. యాజమాన్యంతో పాటు అస్వస్థతకు గురైన ఉద్యోగులు దీన్ని తేలిగ్గా తీసుకున్నారు. సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. రాత్రి 11 గంటల నుంచి వాంతులు మొదలయ్యాయి. యాజమాన్యం సూచన మేరకు బాధితులను వడ్లపూడిలోని పవన్‌సాయి, షీలానగర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రుల్లో చేర్చారు.

తీవ్ర అస్వస్థతకు గురైన హెల్పర్‌ అమిత్‌భాగ్‌ చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు మృతిచెందాడు. అస్వస్థతకు గురైన మరో తొమ్మిది మందిలో శిలపరశెట్టి వీరశేఖర్‌, దుంపల చిన్నికృష్ణ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. కాగా, ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఆరా తీశారు. జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అస్వస్థతకు గురైన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలందించి ప్రాణహాని లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వపరంగా బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉండాలన్నారు. కాగా, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ జిల్లా అధికారులను ఆదేశించారు.

Updated Date - Nov 28 , 2024 | 04:50 AM