Share News

Toxic Gas Leak : రక్షిత్‌ ఫార్మాలో విష వాయువు లీక్‌

ABN , Publish Date - Dec 24 , 2024 | 06:23 AM

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని ‘రక్షిత్‌ డ్రగ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ పరిశ్రమలో సోమవారం విష వాయువు లీక్‌ కావడంతో ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.

Toxic Gas Leak : రక్షిత్‌ ఫార్మాలో విష వాయువు లీక్‌

  • ఇద్దరు కార్మికులకు తీవ్ర అస్వస్థత

పరవాడ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని ‘రక్షిత్‌ డ్రగ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ పరిశ్రమలో సోమవారం విష వాయువు లీక్‌ కావడంతో ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పరవాడ సీఐ జి.మల్లికార్జునరావు తెలిపిన వివరాలు... పరిశ్రమలోని ప్రొడక్షన్‌ బ్లాక్‌ -1లో ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికులు ఉగ్రెసర్‌ గౌడ (26), దేవ్‌బాగ్‌ (38) సోమవారం తెల్లవారుజామున ఐదున్నర గంటలకు పడిపోయి ఉండడాన్ని కెమిస్టు నాగేశ్వరరావు గమనించారు. అప్పటికే దేవ్‌బాగ్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ఉగ్రెసర్‌ గౌడ ఫిట్స్‌ వచ్చినట్టు కాళ్లు, చేతులు కొట్టుకుంటున్నారు. వెంటనే ఇద్దరికీ పరిశ్రమలోనే ఆక్సిజన్‌ ఏర్పాటుచేసి అనంతరం గాజువాక సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వీరిలో దేవ్‌బాగ్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రొడక్షన్‌ బ్లాక్‌-1లో తొమ్మిది మంది కార్మికులు పనిచేస్తున్నారు. తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో ఏడుగురు షిఫ్ట్‌ మారేందుకు సెక్యూరిటీ వద్దకు వెళ్లారు. అదే సమయంలో బ్లాక్‌-1లో రియాక్టర్‌కు చెందిన స్క్రబ్బర్‌ నుంచి హైడ్రోజన్‌ సల్ఫేడ్‌ వాయువు లీకై ఉండవచ్చునని, దానిని పీల్చడం వల్ల అక్కడ ఉన్న ఇద్దరూ అస్వస్థతకు గురై ఉంటారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశ్రమల తనిఖీ అధికారులు జె.శివశంకర్‌రెడ్డి, జేవీఎస్‌ నారాయణరావు, తహసీల్దార్‌ ఎస్‌వీ అంబేద్కర్‌, సీఐ మల్లికార్జునరావుతో పాటు పీసీబీ, అగ్నిమాపక శాఖ అధికారులు పరిశీలించారు.

Updated Date - Dec 24 , 2024 | 06:23 AM