Tummala Ramaswamy : కౌడా చైర్మన్ ప్రమాణస్వీకారోత్సవంలో అపశ్రుతి
ABN , Publish Date - Dec 16 , 2024 | 06:13 AM
కాకినాడ అర్బన్ డెవలె్‌పమెంట్ అథారిటీ(కౌడా) చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది.
ఎక్కువ మంది ఎక్కడంతో కూలిన వేదిక
ఇద్దరు ఎమ్మెల్యేలు సహా పలువురికి స్వల్ప గాయాలు
సర్పవరం జంక్షన్ (కాకినాడ), డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కాకినాడ అర్బన్ డెవలె్‌పమెంట్ అథారిటీ(కౌడా) చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. చైర్మన్‌గా జనసేన నేత తుమ్మల రామస్వామి(బాబు) ప్రమాణస్వీకారం చేయాల్సి ఉండగా.. వేదికపైకి ఎక్కువ మంది ఎక్కడంతో అకస్మాత్తుగా అది కుప్పకూలింది. దీంతో స్టేజీపై ఉన్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ హరిప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, తుమ్మల రామస్వామితో సహా పలువురు కూటమి నాయకులు కింద పడిపోయారు. ఈ పరిణామంతో సభా ప్రాంగణంలో కొంత తొక్కిసలాట జరిగింది. పోలీసులు, భద్రతా సిబ్బంది, నాయకులు తేరుకుని కిందపడిన వారికి రక్షణ వలయంగా ఉండి.. పైకి లేపి సపర్యలు చేశారు. ఎమ్మెల్యే చినరాజప్ప కాలికి స్వల్ప గాయం కాగా, ఆయన సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లిపోయారు. యనమల ప్రమాణస్వీకారం వరకు ఉండకుండా మధ్యలోనే తన క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే నానాజీకి వీపు, తలకు దెబ్బలు తగిలాయి. అనంతరం నానాజీ అధ్యక్షతన మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా కౌడా చైర్మన్‌గా తుమ్మల రామస్వామితో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో కౌడా వైస్ చైర్‌పర్సన్, కమిషనర్ భావన, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే వర్మ, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.