Share News

Senior lawyer Siddharth Luthra : దాడి వెనుక కుట్రను తేల్చాలి!

ABN , Publish Date - Aug 09 , 2024 | 05:08 AM

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌, వైసీపీ నేత దేవినేని అవినాశ్‌ కార్యాలయం బయట కారులోనే కూర్చున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యుల వాంగ్మూలాలు ఉన్నాయని సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా హైకోర్టుకు వివరించారు.

 Senior lawyer Siddharth Luthra :   దాడి వెనుక కుట్రను తేల్చాలి!

  • టీడీపీ ఆఫీసుపై దాడి వెనుక వైసీపీ నేతలు ఉన్నారనేందుకు ఆధారాలు ఉన్నాయి

  • అప్పిరెడ్డి, అవినాష్‌, నందిగం సురేశ్‌ కార్యాలయం బయట కారులో ఉన్నారు

  • ముగ్గురు అధికారులను సస్పెండ్‌ చేశాంపోలీసుల తరఫున సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు

  • వైసీపీ నేతల ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై కొనసాగుతున్న వాదనలు

అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌, వైసీపీ నేత దేవినేని అవినాశ్‌ కార్యాలయం బయట కారులోనే కూర్చున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యుల వాంగ్మూలాలు ఉన్నాయని సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా హైకోర్టుకు వివరించారు. ఈ దాడి వెనుక ఉన్న కుట్రను తేల్చాల్సి ఉందని చెప్పారు. ఈ కేసులో వైసీపీ నేతలు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం పోలీసుల తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ్‌ లూథ్రా.. అప్పటి దర్యాప్తు అధికారి ఉద్దేశపూర్వకంగానే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని వివరించారు.

‘అప్పటి దర్యాప్తు అధికారి దుష్ప్రవర్తన కారణంగా మూడేళ్లుగా కేసు దర్యాప్తులో పురోగతి లేదు. సీసీటీవీ ఫుటేజ్‌, ఇతర సాంకేతిక ఆధారాల సేకరణను ఆయన నిర్లక్ష్యం చేశారు. ఉద్దేశపూర్వకంగా కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని తేలింది. దర్యాప్తు జాప్యానికి బాధ్యులైన ముగ్గురు అధికారులను సస్పెండ్‌ చేశాం.

నిందితుల దాడిలో టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారి మెడికల్‌ రిపోర్టులను మార్చి, గాయాలు చిన్నవిగా చూపేందుకు ప్రయత్నించారు.


మరో అధికారి కేసు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత టోల్‌ ఫ్లాజా వద్ద సీసీ కెమెరాల ఫుటేజ్‌ను, ఇతర ఆధారాలను సేకరించారు. దాడి జరిగిన రోజు గాయపడినవారి విషయంలో డాక్టర్లు ఇచ్చిన వాస్తవ మెడికల్‌ రిపోర్టులను వెలుగులోకి తీసుకొచ్చారు. కొవిడ్‌ సమయంలో ఒకేసారి అంతమంది అక్కడకు ఎలా చేరకున్నారు..? ఎవరి ప్రోద్బలంతో వచ్చారో తేలాల్సి ఉంది.

ఘటన జరిగిన రోజు నిందితులు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణించారు..? మొబైల్‌ లోకేషన్లకు సంబంధించి సర్వీసు ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించాల్సి ఉంది’ అని వాదనలు వినిపించారు.

అయితే.. గురువారం కోర్టు సమయం ముగియడంతో సీనియర్‌ న్యాయవాది వాదనలు కొనసాగించేందుకు విచారణను ఆగస్టు 14కి వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ వీఆర్‌కె కృపాసాగర్‌ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.

కాగా, టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకదాడి వ్యవహారంలో మంగళగిరి గ్రామీణ పోలీసులు నమోదుచేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రాఘురాం, వైసీపీ నేత దేవినేని అవినాశ్‌, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌, కార్యకర్తలు జి.రమేశ్‌, షేక్‌ రబ్బాని బాషా, చిన్నాబత్తిన వినోద్‌కుమార్‌ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు.

Updated Date - Aug 09 , 2024 | 05:08 AM