Share News

హైకోర్టులో పిటిషన్‌ ఉపసంహరించుకున్న పేర్ని నాని

ABN , Publish Date - Dec 25 , 2024 | 06:55 AM

గోడౌన్‌ నుంచి రేషన్‌ బియ్యం మాయం చేసిన వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని మచిలీపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్‌ చేస్తూ వైసీపీ నేత పేర్ని నాని,..

హైకోర్టులో పిటిషన్‌ ఉపసంహరించుకున్న పేర్ని నాని

అమరావతి/మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): గోడౌన్‌ నుంచి రేషన్‌ బియ్యం మాయం చేసిన వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని మచిలీపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్‌ చేస్తూ వైసీపీ నేత పేర్ని నాని, ఆయన కుమారుడు సాయి కృష్ణమూర్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం ఉపసంహరించుకున్నారు. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం స్పందిస్తూ... ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని, ఆ గడువు ముగిసినందున వ్యాజ్యంపై విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది జయంతి వాదనలు వినిపిస్తూ నోటీసుల గడువు ముగిసినందున పిటిషన్‌పై విచారణను కొనసాగించడానికి వీల్లేదన్నారు. పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సి.రఘు తెలిపారు. పోలీసులు తిరిగి నోటీసులు ఇస్తే కోర్టును ఆశ్రయించేందుకు వెసులుబాటు ఇవ్వాలని అభ్యర్థించారు. అందుకు అనుమతిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రేషన్‌ బియ్యం స్వాహా కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ మచిలీపట్నం తొమ్మిదో అదనపు జిల్లా కోర్టులో పేర్ని జయసుధ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను న్యాయాధికారి సుజాత ఈ నెల 27కు వాయిదా వేశారు.

Updated Date - Dec 25 , 2024 | 06:55 AM