Share News

AP News: అయ్యో.. ఐఆర్‌!

ABN , Publish Date - Feb 24 , 2024 | 03:55 AM

ప్రతి అయిదేళ్లకొకసారి ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వడం సాధారణం. ఇది ఆలస్యమైతే మధ్యంతర భృతి(ఐఆర్‌) ఇవ్వడం సంప్రదాయమే.

AP News: అయ్యో.. ఐఆర్‌!

  • పీఆర్సీ ఇస్తుంటే ఐఆర్‌ ఎందుకంటూ సర్కారు ఝలక్‌

అటు మంత్రివర్గ ఉప సంఘం.. ఉద్యోగ సంఘాల నేతలు! మరో ‘చాయ్‌ బిస్కట్‌’ సమావేశం ముగిసింది. ‘అదిగో పీఆర్సీ’ అంటూ మబ్బుల్లో నీళ్లు చూపించి... ఇప్పుడు ఐఆర్‌ ఇచ్చేది లేదని సర్కారు తేల్చింది. ఎన్నికల తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు. కానీ... జూలైలో పీఆర్సీ ఇస్తున్నామని, ఐఆర్‌ ఎందుకని మెలిక పెట్టింది. ఇతర డిమాండ్లపైనా ఎలాంటి స్పందనా కనిపించలేదు. దీంతో.. రెండు నెలలకోసారి జరిగే ఉత్తుత్తి చర్చల్లాగే.. శుక్రవారం నాటి భేటీ కూడా విఫలమైంది. ఉద్యమం ఆగదని సంఘాలు స్పష్టంచేశాయి.

  • ఉద్యమం తప్పదు

  • జూలై నాటికి ఈ ప్రభుత్వం ఉంటుందా?

  • భృతి ఇమ్మంటే పీఆర్సీ అంటున్నారు

  • డీఏ సహా ఏదడిగినా మాట మారుస్తున్నారు

  • ఇన్నిసార్లు ఏ ప్రభుత్వంతోనూ భేటీ కాలేదు

  • ఉద్యోగ సంఘాల నేతల ఆగ్రహం

  • భృతి ఇచ్చేది లేదన్న జగన్‌ సర్కార్‌

  • ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టం చేసిన మంత్రుల కమిటీ

  • గత సంప్రదాయాలకు తూట్లు

  • ఉత్తుత్తి చర్చలు.. ఉపన్యాసాలు

  • ఉద్యోగులకు ఒరిగింది శూన్యం

  • జూలైలో పీఆర్సీ ఇస్తామని ప్రకటన

  • పీఆర్సీ ఇస్తున్నప్పుడు ఐఆర్‌ ఎందుకన్న మంత్రి బొత్స

  • వచ్చే ప్రభుత్వంలో అమలు చేసే దానిపై హామీలా?

  • ఉద్యోగ నేతల తీవ్ర ఆగ్రహం

  • చర్చలు విఫలం.. ఉద్యమం తప్పదని వెల్లడి

అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ప్రతి అయిదేళ్లకొకసారి ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వడం సాధారణం. ఇది ఆలస్యమైతే మధ్యంతర భృతి(ఐఆర్‌) ఇవ్వడం సంప్రదాయమే. ఈ సంప్రదాయానికి జగన్‌ సర్కార్‌ స్వస్తి పలికింది. వచ్చే జూలైలో పీఆర్సీ ఇస్తామని, ఇక ఐఆర్‌ ఎందుకని ప్రశ్నిస్తోంది. జూలైలోనే పీఆర్సీ పూర్తిగా చెల్లిస్తామని, ఐఆర్‌ ఇవ్వబోమని శుక్రవారం అమరావతి సచివాలయంలో జరిగిన చర్చల్లో ఉద్యోగ సంఘాలకు మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. దీంతో నివ్వెరపోయిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాలు.. ఇదేం సంప్రదాయం అంటూ మంత్రుల కమిటీని నిలదీశాయి. అయితే, ‘ఇది మా ప్రభుత్వ కొత్త సంప్రదాయం’ అంటూ మంత్రుల కమిటీ సెలవిచ్చింది. దీంతో ప్రభుత్వం-ఉద్యోగ సంఘాల నేతల మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ ప్రభుత్వ కాలం నెల, రెండునెలల్లో ముగిసిపోతుందని వచ్చే ప్రభుత్వంలో ఇచ్చే పీఆర్సీకి ఇప్పుడెలా గ్యారెంటీ ఇస్తుందని సంఘాల నేతలు మండిపడుతున్నారు. 11వ పీఆర్సీలో ఐఆర్‌ కన్నా తక్కువగా రివర్స్‌ పీఆర్సీ ఇచ్చిన జగన్‌ సర్కార్‌.. 12 పీఆర్సీ కమిషన్‌ వేసి ఐఆర్‌ ఇవ్వాల్సి ఉండగా ఆ సంప్రదాయానికి తెరదించిందని వ్యాఖ్యానిస్తున్నారు.

సుదీర్ఘ చర్చలు

శుక్రవారం అమరావతి సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ భేటీ అయింది. సుదీర్ఘంగా చర్చలు జరిపింది. కానీ, ఫలితం మాత్రం కనిపించలేదు. సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఏపీజేఏసీ చైర్మన్‌, కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, సెక్రటరీ జనరల్‌ హృదయరాజు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో ఉన్న పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. అనంతరం, మంత్రి బొత్స, ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12న జరిగిన సమావేశంలో ఏఅంశాలైతే చెప్పారో మళ్లీ వాటినే వల్లెవేశారని ఉద్యోగ సంఘాల నేతలు పెదవి విరిచారు. ఇది మరో చాయ్‌ బిస్కట్‌ సమావేశమేనని, ప్రయోజం శూన్యమని పెదవి విరిచారు. సంప్రదాయంగా వస్తున్న ఐఆర్‌ ఇవ్వడం సాధ్యంకాదని తేల్చేశారన్నారు. బకాయిల చెల్లింపులపై గత సమావేశంలో చెప్పినట్లే మార్చి, జూలైలో చెల్లిస్తామన్నారని మండిపడ్డారు. కొన్ని అంశాలపై మళ్లీ చర్చించుకుని చెబుతామని వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారని నాయకులు తెలిపారు.

ఐఆర్‌ మా విధానం కాదు: బొత్స

మధ్యంతర భృతి(ఐఆర్‌) ఇవ్వడం తమ ప్రభుత్వ విధానం కాదని మంత్రి బొత్స చెప్పారు. పూర్తి స్థాయిలో పీఆర్సీనే ప్రకటిస్తామని, ఈ అంశాన్నే ఉద్యోగులకు చెప్పామని అన్నారు. ‘‘పీఆర్సీ ఆలస్యం అయితే ఐఆర్‌ ఇస్తారు. కానీ, సరైన సమయంలో పీఆర్సీ ఇస్తామన్నప్పుడు ఐఆర్‌ ఎందుకు?’’ అని వ్యాఖ్యానించారు. గతంలో కరోనా వల్ల పీఆర్సీ ఆలస్యం అయినందున ఐఆర్‌ ఇచ్చామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామన్నారు. వైసీపీ వచ్చిన తర్వాతే 14,250 వేల మంది ఉపాధ్యాయుల నియామకం జరిగిందని, మిగిలిన 6,100 ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చామన్నారు. తాజా భేటీలో ప్రధానంగా ఐఆర్‌, అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌, బకాయిలు, 2004 ముందు ఉద్యోగులకు ఓపీఎస్‌ అమలుపై చర్చ జరిగిందన్నారు. గతంలో చెప్పిన షెడ్యూల్‌ ప్రకారం మార్చిలో ఏయే బకాయిలు చెల్లిస్తామని చెప్పామో వాటికి కట్టిబడి ఉన్నామన్నారు. ఇప్పటికే చెల్లింపులు మొదలుపెట్టామని, మార్చి 31లోపు పూర్తి చేస్తామని తెలిపారు. అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌కు సానుకూలంగా ఉన్నామన్నారు. ఏపీ జేఏసీ చేపట్టే చలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించుకోవాలని కోరినట్టు తెలిపారు. రాబోయే కాలంలో ‘నో వేకెన్సీ’ అనే విధానం తీసుకురానున్నట్టు తెలిపారు.

ఇది సరికాదు: బొప్పరాజు

దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఐఆర్‌ చెల్లించాలని కోరినట్టు ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఐఆర్‌ ఎందుకు? పీఆర్సీనే సెటిల్‌ చేద్దామనుకుంటున్నామని మంత్రి చెప్పినట్టు పేర్కొన్నారు. కానీ, ఇది సరికాదని బొప్పరాజు అన్నారు. మంత్రుల కమిటీలో చర్చించిన అంశాలు పరిష్కారం కానప్పుడు ఉద్యోగ సంఘాలు సీఎం దగ్గరకు వెళ్లే అవకాశం ఉందని, సీఎం వద్దకు తీసుకెళ్లాలని కోరగా.. సీఎం మాటే చెబుతున్నామని మంత్రుల కమిటీ చెప్పిందన్నారు. ఐఆర్‌ మాటే లేదని, కొత్త పీఆర్సీని జూలై 31 లోపే సెటిల్‌ చేసే సంప్రదాయానికి శ్రీకారం చుడతామని చెప్పారన్నారు. తాము డిమాండ్‌ చేసిన అంశాలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. పీఆర్సీ కమిషన్‌ను నియమించనప్పుడు ఐఆర్‌ ఇవ్వడం సంప్రదాయంగా వస్తోందని దానికి ఈ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందన్నారు. ‘‘కారుణ్య నియామక వివరాలు జిల్లాల వారీగా తెప్పించుకుని త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఒప్పంద ఉద్యోగులను దశల వారీగా రెగ్యులర్‌ చేస్తామని చెప్పారు’’ అని బొప్పరాజు వివరించారు.

ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది: బండి

గత సమావేశంలో చెప్పిన వాటినే ప్రభుత్వం మళ్లీ చెప్పిందని, తమ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బండి శ్రీనివాసరావు చెప్పారు. ప్రభుత్వం చెప్పిన వాటిపై జీవోలు ఇచ్చే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను, తర్వాత ఇచ్చే జీవోలను బట్టి తమ జేఏసీలో చర్చించుని తదుపరి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. జూలై నాటికి పీఆర్సీని చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. డీఏలకు సంబంధించి ఎలాంటి ప్రకటనా చేయలేదన్నారు.

చాలా నష్టపోయాం: సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం

ఇప్పటికే చాలా నష్టపోయామని సచివాలయ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాజేశ్‌ అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఉద్యోగికీ ప్రభుత్వం రూ.5 లక్షల వరకు బకాయి పడిందని తెలిపారు. సచివాలయ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నాయకులు నాపా ప్రసాద్‌ మాట్లాడుతూ.. బకాయిలు వాయిదా వేసేందుకే సమావేశాలు పెడుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు 10 జాయింట్‌ స్టాఫ్ట్‌ కౌన్సిల్‌ సమావేశాలు జరిగినా ఏ ప్రయోజనం లేదని సచివాలయ ఉద్యోగి రామారావు అన్నారు.

Updated Date - Feb 24 , 2024 | 07:39 AM