Share News

దేశానికే ఆదర్శంగా ‘మంగళగిరి’!

ABN , Publish Date - Apr 30 , 2024 | 05:06 AM

మంగళగిరిని దేశంలోనే నెంబర్‌ 1 మోడల్‌ నియోజకవర్గంగా నారా లోకేశ్‌ తీర్చిదిద్దుతారని ఆయన సతీమణి నారా బ్రాహ్మణి పేర్కొన్నారు

దేశానికే ఆదర్శంగా ‘మంగళగిరి’!

  • లోకేశ్‌ తీర్చిదిద్దుతారన్న నారా బ్రాహ్మణి

  • తాడేపల్లిలో మహిళలతో సమావేశం

తాడేపల్లి, ఏప్రిల్‌ 29: మంగళగిరిని దేశంలోనే నెంబర్‌ 1 మోడల్‌ నియోజకవర్గంగా నారా లోకేశ్‌ తీర్చిదిద్దుతారని ఆయన సతీమణి నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని చైతన్య తపోవన్‌లో మండల స్ర్తీ శక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో నారా బ్రాహ్మణి సోమవారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా లోకేశ్‌ ప్రజలతో మమేకమై, ప్రతిపక్షంలో ఉండికూడా 29 సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల మనసులు గెలుచుకున్నారని తెలిపారు. అధికారంలో లేకుండానే ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంటే, ఎన్నికల్లో గెలిచి మరింకెంత అభివృద్ధి చేస్తారో ఆలోచించాలని సూచించారు.

మహిళలకు పలు గ్యారెంటీ పథకాలను టీడీపీ అమలు చేస్తుందన్నారు. అత్యధిక మెజారిటీతో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

  1. వైసీపీ నేతలకు తెలిసింది రౌడీయిజమే: లోకేశ్‌

దుగ్గిరాల, ఏప్రిల్‌ 29: వైసీపీ నాయకులకు తెలిసింది రౌడీయిజం, దుష్ప్రచారమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్‌ అన్నారు. సోమవారం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని శృంగారపురం, చుక్కపల్లివారిపాలెం, తాడిబోయినవారిపాలెం, చినపాలెం గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుత రౌడీయిజం చేసేవారి మాటలు నమ్మొద్దన్నారు. 2014లో తండ్రి శవం, 2019లో బాబాయి శవాన్ని అడ్డుపెట్టుకుని జగన్‌ శవ రాజకీయాలు చేశారని ఆరోపించారు. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని, కృష్ణా జలాలను శుద్ధిచేసి పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. ‘మంగళగిరిలో గెలిచాకా నా చుట్టూ మీరు తిరగడం కాదు, అభివృద్ధి చేసేందుకు మీ చుట్టూ నేను తిరుగుతాను’ అని చెప్పారు.

2.పింఛన్ల సొమ్ము బ్యాంకుల్లో వేయడం సరికాదు

  • సీఈవోకు టీడీపీ నేతల ఫిర్యాదు

అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): మే నెల సామాజిక పింఛన్ల సొమ్మును బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని టీడీపీ నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని కోరారు.

సోమవారం అమరావతి సచివాలయంలో సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనాను టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మన్నవ సుబ్బారావు తదితరులు కలిసి, పలు అంశాలపై ఫిర్యాదులు చేశారు.

రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై, ప్రచార వాహనాలపై దాడులు జరుగుతున్నా రిటర్నింగ్‌ అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే అధికార పార్టీ నేతలకు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారన్నారు.

రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీని వీడి, వైసీపీలో చేరనన్నందుకు ఒక బీసీ, ఇద్దరు దళిత నాయకులపై వైసీపీ నేతలు దాడి చేయడం, ఎన్డీయే ప్రచార వాహనాలను ధ్వంసం చేశారని తెలిపారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

3.వైసీపీ మేనిఫెస్టో మోసాల పుట్ట: కనకమేడల

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): మేనిఫెస్టో పేరుతో ప్రజలను సీఎం జగన్‌ నయవంచనకు గురిచేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఇక్కడ తన అధికారిక నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘వైసీపీ మేనిఫెస్టో మోసపూరిత హామీల పుట్ట. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతానని జగన్‌ చెప్పారు. ఎవరు ఎవరి దగ్గర మెడలు వంచారో అందరికీ తెలుసు’ అని విమర్శించారు.

4.బరి నుంచి తప్పుకొన్న ముద్దరబోయిన

  • చంద్రబాబు నచ్చచెప్పడంతో అలకవీడిన వైనం

నూజివీడు, ఏప్రిల్‌ 29: ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన టీడీపీ రెబల్‌ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సోమవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.

ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి ఇక్కడ టికెట్‌ కేటాయించడంతో అలకబూనిన ముద్దరబోయిన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసి ప్రచారం కూడా చేశారు. టీడీపీ ముఖ్య నాయకులు ముద్దరబోయినతో పలుమార్లు చర్చలు జరిపారు.

చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడించారు. చంద్రబాబు నచ్చచెప్పడంతో అలకవీడిన ముద్దరబోయిన తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.

సోమవారం కర్నూలు ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబును కలవడానికి అనుచరులతో కలసి వెళ్లారు. దీంతో నూజివీడు నియోజకవర్గంలోని టీడీపీలో సంక్షోభం సద్దుమణిగింది. రాష్ట్ర పార్టీలో ముద్దరబోయినకు కీలకపదవి ఇచ్చి గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో ఆయన సేవలను వినియోగించుకోనున్నట్టు సమాచారం.

5. ‘నందిగం’తో ప్రాణహాని... రక్షణ కల్పించండి

  • సీఈవోకు కట్టా ఆనంద్‌బాబు ఫిర్యాదు

అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): బాపట్ల పార్లమెంట్‌ వైసీపీ అభ్యర్థి నందిగం సురేశ్‌ నుంచి తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని స్వతంత్య్ర అభ్యర్థి కట్టా ఆనంద్‌బాబు విజ్ఞప్తి చేశారు. సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనాను అమరావతి సచివాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. ‘నువ్వొక వలంటీర్‌వి.

నా మీదే తిరుగుబాటు చేసే ధైర్యం నీకెవడిచ్చాడు? నామినేషన్‌ ఉపసంహరించుకోకపోతే మే 13లోపు నిన్ను చంపేస్తా. వచ్చే ఏడాది నా పేరు మీద సినామా తీస్తా’ అని సురేశ్‌, అతని అనుచరులు బెదిరిస్తున్నారని వివరించారు.


6.చంద్రగిరి టీడీపీ అభ్యర్థికి రక్షణ కల్పించండి

  • పోలీసులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీకి తక్షణం వన్‌ ప్లస్‌ వన్‌ సెక్యూరిటీ కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి సోమవారం ఆదేశాలిచ్చారు.

తమకు సెక్యూరిటీ కల్పించేలా తిరుపతి జిల్లా ఎస్పీ, పోలీసులను ఆదేశించాలని కోరుతూ పులివర్తి వెంకట మణిప్రసాద్‌ నానీ, ఆయన సతీమణి, కుమారుడు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపించారు.

7.మద్యం అక్రమ రవాణా బాగా పెరిగింది:సెబ్‌

అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోకి పొరుగు నుంచి తీసుకొస్తున్న అక్రమ మద్యాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నట్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) కమిషనర్‌ రవిప్రకాశ్‌ తెలిపారు.

కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర సరిహద్దుల్లో రూ.119కోట్ల మద్యాన్ని సీజ్‌ చేశామన్నారు. 2019లో పట్టుబడ్డ మద్యం విలువ 13.11కోట్లు కాగా ఈ ఎన్నికల్లో ఇప్పటికే 119కోట్ల మద్యం పట్టుబడిందని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా అక్రమ మద్యం నిల్వ ఉన్నట్లు, సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే 9491030853 నంబర్‌కు సమాచారం ఇవ్వొచ్చన్నారు. సెబ్‌ కార్యాలయ కంట్రోల్‌ రూమ్‌ 9154106528 లేదా 8121909444కు గానీ సమాచారం ఇవ్వాలని కమిషనర్‌ కోరారు.

9.ల్యాండ్‌ చట్టంతో భయపెడుతున్న వైసీపీ

జనం భూములు కొట్టేయడానికి దుర్మార్గపు ఎత్తుగడ: టీడీపీ ధ్వజం

అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలను భయపెడుతోందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.

ఆ పార్టీ అధికార ప్రతినిధి జివి రెడ్డి సోమవారం ఇక్కడ తమ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘వైసీపీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ప్రజల ఆస్తులను ప్రభుత్వం చేతుల్లోకి తీసుకువెళ్తుంది.

ఈ చట్టం వచ్చిన తర్వాత భూ సమస్యలపై సివిల్‌ కోర్టుకు వెళ్లే అవకాశం లేదు. టీఆర్వో వద్దకు వెళ్లాలి. భూముల కబ్జాకు వైసీపీ నేతలే వివాదం సృష్టించి టీఆర్వో వద్ద తేల్చకుండా పెండింగ్‌లో ఉంచి సెటిల్‌మెంట్‌ పేరుతో దండుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది’ అని చెప్పారు. తమ ప్రభుత్వం వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తుందని జీవీ రెడ్డి తెలిపారు.

Updated Date - Apr 30 , 2024 | 05:06 AM