Share News

Manda Krishna Madiga : రిజర్వేషన్‌ ఫలాలు మాదిగలకు దక్కట్లేదు

ABN , Publish Date - Dec 31 , 2024 | 04:29 AM

స్సీ రిజర్వేషన్‌ ఫలాలు ఉమ్మడిగా దక్కడం లేదని, ఐక్యత పేరుతో మాదిగల అవకాశాలనూ మాలలు అందుకుంటున్నారని ఎమ్మార్పీఎస్‌..

Manda Krishna Madiga : రిజర్వేషన్‌ ఫలాలు మాదిగలకు దక్కట్లేదు

  • ఐక్యత పేరుతో మా అవకాశాలను దోచుకుంటున్నారు

  • ఎస్సీ వర్గీకరణతోనే అన్ని వర్గాలకూ న్యాయం: మంద కృష్ణ

గుంటూరు తూర్పు, గుంటూరు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఎస్సీ రిజర్వేషన్‌ ఫలాలు ఉమ్మడిగా దక్కడం లేదని, ఐక్యత పేరుతో మాదిగల అవకాశాలనూ మాలలు అందుకుంటున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఐక్యత అనేది ఒక బూటకమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్‌ కులాల వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా సోమవారం గుంటూరు జిల్లాకు విచ్చేశారు. గుంటూరు కలక్టరేట్‌లో ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రజలు, వివిధ కులసంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు, వినతులు స్వీకరించారు. ఎస్సీ వర్గీకరణతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందంటూ మంద కృష్ణమాదిగ తన అభిప్రాయాన్ని కమిషన్‌కు తెలిపారు. ‘ఎస్సీలంటూనే మాదిగలకు సాంఘిక సమానత్వం లేకుండా చేశారు. వారి జనాభా కంటే అధికంగా మాలలు రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నారు. ఇతరుల వాటా మాకోద్దు. అదే సమయంలో మా వాటా మాకు ఇవ్వాలి. మాల, మాదిగ పల్లెలు పక్కపక్కనే ఉన్నా ఇచ్చిపుచ్చుకోవడం లేదు. సచివాలయాల్లో మాదిగల సంఖ్య తగ్గించే విధంగా కుట్ర జరుగుతోంది. మా బంధువులను కూడా మాలలుగా మారుస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి’ అని పేర్కొన్నారు. కాగా, ఎస్సీ ఉప కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా స్థితిగతులపై శాఖల వారీగా సమగ్ర వివరాలను కచ్చితమైన అంకెలతో అందించాలని కమిషన్‌ చైర్మన్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు.

Updated Date - Dec 31 , 2024 | 04:29 AM