Share News

లోకేశ్‌ ఫోన్‌ ట్యాపింగ్‌!

ABN , Publish Date - Apr 13 , 2024 | 03:51 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మొబైల్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు గురవుతోంది. ఐ-ఫోన్‌ సాంకేతిక వ్యవస్థ ఈ మేరకు ఆయనకు వర్తమానం పంపింది....

లోకేశ్‌ ఫోన్‌ ట్యాపింగ్‌!

ఐ-ఫోన్‌ వ్యవస్థ హెచ్చరిక

ఇంకొందరు టీడీపీ నేతల ఫోన్లపైనా నిఘా

దీనివల్లే హైదరాబాద్‌ నుంచి కార్యకలాపాలు

కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడా ట్యాపింగ్‌కు పాల్పడిన జగన్‌ సర్కారు!

టీడీపీ నేతల ఆగ్రహం

అమరావతి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మొబైల్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు గురవుతోంది. ఐ-ఫోన్‌ సాంకేతిక వ్యవస్థ ఈ మేరకు ఆయనకు వర్తమానం పంపింది. ఆయన చాలాకాలంగా ఐ-ఫోన్‌ వాడుతున్నారు. మిగిలిన ఫోన్లతో పోలిస్తే ఆపిల్‌ కంపెనీ తయారు చేస్తున్న ఐ-ఫోన్లు భద్రతాపరంగా మెరుగ్గా ఉంటాయన్న అభిప్రాయంతో ఇటీవలి కాలంలో ప్రతిపక్ష నేతలు వాటినే వాడుతున్నారు. ఫోన్ల భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు సంబంధిత ఫోన్‌ వినియోగదారుకు ఆ సమాచారాన్ని పంపే సాంకేతిక వ్యవస్థను ఆపిల్‌ కంపెనీ వాడుతోంది. దాని నుంచే లోకేశ్‌కు గురువారం రాత్రి అత్యవసర హెచ్చరిక పంపింది. అదే హెచ్చరికను ఈ-మెయిల్‌ ద్వారా కూడా పంపింది. ‘గుర్తు తెలియని సాఫ్ట్‌వేర్లతో మీ ఫోన్‌ను హాకింగ్‌, ట్యాపింగ్‌ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. అప్రమత్తంగా ఉండండి. ట్యాపింగ్‌, హాకింగ్‌కు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి’ అని అందులో పేర్కొంది. ఈ సందేశం వచ్చిన వెంటనే లోకేశ్‌ సంబంధిత సాంకేతిక నిపుణులను సంప్రదించి వారి సూచనలను పాటిస్తున్నారు. గత నెలలో కూడా ఆయనకు ఇదే మాదిరి హెచ్చరిక సందేశం వచ్చింది. ఒక నెలలోనే రెండోసారి మళ్లీ అదే ప్రయత్నం జరగడం విశేషం. జగన్‌ ప్రభుత్వమే ఆయన ఫోన్‌ను ట్యాప్‌ చేస్తోందని టీడీపీ వర్గాలు ఆరోపించాయి. ‘ఆపిల్‌ కంపెనీ తయారు చేసే ఐ-ఫోన్లను సాధారణ సాఫ్ట్‌వేర్లతో ట్యాపింగ్‌ చేయడం సాధ్యం కాదు. ఇజ్రాయెల్‌కు చెందిన కంపెనీలు తయారు చేస్తున్న పెగాసెస్‌ వంటి అత్యున్నత స్థాయి సాఫ్ట్‌వేర్లతో మాత్రమే వాటి ట్యాపింగ్‌ సాధ్యపడుతుంది. పెగాసెస్‌ సాఫ్ట్‌వేర్‌ను వైసీపీ ప్రభుత్వం ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసి వాడుతోందని మేం అనుమానిస్తున్నాం’ అని టీడీపీ ముఖ్యుడొకరు తెలిపారు. ఒక్క లోకేశ్‌ ఫోనే కాకుండా మరికొందరు టీడీపీ నేతల ఫోన్లను కూడా దొంగచాటుగా వినే ప్రయత్నం జరుగుతోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ సందేహం చాలా కాలం నుంచి ఉండడంతో కొంతకాలంగా టీడీపీ తన కార్యకలాపాలన్నీ హైదరాబాద్‌ కేంద్రంగా నిర్వహిస్తోంది. అక్కడ కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్న సమయంలో జగన్‌ సర్కారు అక్కడ కూడా ట్యాపింగ్‌ చేయగలిగిందని.. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం మారాక ఆ అవకాశం పోయిందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే ముఖ్యమైన రాజకీయ కార్యకలాపాలన్నీ ఆ పార్టీ హైదరాబాద్‌ కేంద్రంగానే నిర్వహిస్తోంది. కాగా, గుర్తు తెలియని ఏజెన్సీల ద్వారా పెగాసెస్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో లోకేశ్‌ ఫోన్‌ను ట్యాప్‌ చేసినట్లు ఐ- ఫోన్‌ సందేశాలు వచ్చాయని మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు లేఖ రాశారు. ‘రాష్ట్ర డీజీపీ రాజేంధ్రనాథ్‌రెడ్డి, నిఘా చీఫ్‌ పీఎస్సార్‌ ఆంజనేయులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఈసీ దృష్టికి అనేక మార్లు తెచ్చాం. వారి స్థానాల్లో తటస్థంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించి, స్వేచ్ఛాయుత ఎన్నికలకు అవకాశం కల్పించాలి’ అని కోరారు.

Updated Date - Apr 13 , 2024 | 03:51 AM