Share News

సీమ సాగునీటికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి

ABN , Publish Date - Aug 31 , 2024 | 11:19 PM

రాయలసీమ సాగు నీటి రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్‌ చేశారు.

సీమ సాగునీటికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి
బొజ్జా దశరథరామిరెడ్డి

సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి

సీఎం చంద్రబాబుకు లేఖ

నంద్యాల టౌన్‌, ఆగస్టు 31 : రాయలసీమ సాగు నీటి రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన ఈ మేరకు సీఎంకు ఒక లేఖను ఈ మెయిల్‌ ద్వారా పంపిచారు. దీన్ని పత్రికా సమావే శంలో విడుదల చేస్తూ ఏపీ ఖజానాపై ఆర్థిక భారం పడకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించి కేంద్రం నుంచి నిధులు విడుదల చేయించారని అన్నారు. తద్వారా అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నిధుల కేటాయించినట్లే రాయలసీమ సమగ్ర సాగునీటి అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు. అమరావతికి, పోలవరానికి కేంద్రం నుంచి నిధులు సాధించిన తరహాలోనే రాయలసీమ ప్రాజెక్టులకు కూడా నిధులు సాధించి గాడిన పెడతారని సీమ ప్రజలు ఆశతో ఉన్నారని అన్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూమిలో 42 శాతం రాయలసీమ జిల్లాల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర సాగునీటి బడ్జెట్‌లో కేవలం 15 శాతం నిధులే గత 10 సంవత్సరాలుగా ఖర్చు చేస్తున్నారని అన్నారు. దీని వల్ల ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల పురోగతికి ఆటంకం కలిగిందని అన్నారు. నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణకు కూడా నోచుకోక పోవడంతో సాగునీటి ఆధారంగా రాయలసీమలో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు.సాగునీటి బడ్జెట్‌లో 42 శాతం నిధులు రాయలసీమకు కేటాయించాలని సీఎంను కోరారు. విభజన చట్టంలో పొందుపరిచిన వెనుకబడిన జిల్లాల బుందేల్‌ఖండ్‌ తరహా ప్రత్యేక ప్యాకేజీ నిధులను కేంద్రం నుంచి తక్షణమే సాధించాలన్నారు. రాయలసీమలోని చెరువుల పరిరక్షణ, నిర్మాణం, వాగులు, వంకలు, నదులు, కాల్వలతో అనుసంధానం, పెన్నా నది పునరుజ్జీవం, సామాజిక అటవీ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మొదలైనవి ఒక నిర్దిష్ట ప్రణాళికతో చేపట్టాలని కోరారు.

Updated Date - Aug 31 , 2024 | 11:19 PM