పశు బీమా.. రైతుకు ధీమా ..
ABN , Publish Date - Aug 31 , 2024 | 11:29 PM
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, పాడి పరిశ్రమకు ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తోంది.
మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
గత వైసీపీ పాలనలో అటకెక్కిన పథకం
టీడీపీ రాకతో జిల్లాలో మళ్లీ ప్రారంభం
కొలిమిగుండ్ల, ఆగస్టు 31 : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, పాడి పరిశ్రమకు ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తోంది. ఇందులోభాగంగానే పశు బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. పాడి పశువు మరణించిన రోజుల వ్యవధిలోనే సంబంధిత రైతులకు సాయం అందుతుంది. దీంతో ఆ రైతు తిరిగి కొత్త పశువులను కొనుగోలు చేయడానికి ఇది ఉపకరిస్తుంది. పాడి పశువులకు చెల్లించే బీమా సొమ్ములో ప్రస్తుత ప్రభుత్వం రాయితీ కల్పించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకైతే 80 శాతం, మిగిలిన రైతులకు 50 శాతం రాయితీ కల్పిస్తూ ప్రోత్సాహం అందిస్తోంది. ఇందులో మామూలు పశువులకు రూ.15 వేలు, మేలు జాతి పశువులకు రూ.30 వేల బీమా సదుపాయం కల్పించారు. అయితే రైతులు ఇంతకంటే ఎక్కువ సొమ్ముకు బీమా చేసుకోవాలని భావిస్తే అదనంగా అయ్యే మొత్తాన్ని రైతులే భరించాల్సి ఉంటుంది. ఒక్కో పశువుకు గరిష్టంగా రూ.1.10 లక్షల వరకు బీమా చేసుకునే అవకాశం ఉంది. ఈ బీమా సొమ్ముకు మూడేళ్ల కాల పరిమితి ఉంటుంది. పాడి పశువులతోపాటు గొర్రెలు, మేకలు, పందులకు సైతం రాయితీపై బీమా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఒక కుటుంబం నుంచి ఐదు పశువులకు బీమా చేసుకోవచ్చు. జీవాలకు సంబంధించి ఒక కుటుంబానికి 50 గొర్రెలు లేదా మేకలకు అవకాశం ఉంది. దీనికి సంబంధించి, నంద్యాల జిల్లాకు రూ.12 లక్షల బీమా రాయితీ సొమ్మును ప్రభుత్వం కేటాయించింది.
మార్గదర్శకాలు ఇలా..
పశువులకు బీమా చేసుకునే రైతు బ్యాంకు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులైతే తెల్ల రేషన్‌కార్డు అందించాల్సి ఉంటుంది. స్థానిక పశు వైద్య కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బందిని సంప్రదించి బీమా చేసుకోవాలి. పాడి పశువులకు బీమా చేసే సమయంలో పశువుకు చెవి పోగు(ట్యాగ్) వేస్తారు. ఏదైనా అనుకోని కారణాల వల్ల చెవి పోగు పడిపోతే వెంటనే అందుబాటులో ఉన్న పశువైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చి, తిరిగి చెవిపోగు వేయించుకోవాలి. పశువుకు చెవి పోగు ఉంటేనే బీమా పరిహారం అందుతుంది. బీమా చేయించిన పశువును విక్రయిస్తే వారం రోజుల్లో అధికారులకు తెలియజేయడం వల్ల యజమాని పేరు మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఏదైనా సంఘటనతో పశువు మరణిస్తేవెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రంలో ఉన్న పశువైద్య సిబ్బందికి సమాచారం అందించాలి. బీమా సర్వేయర్ వచ్చే వరకు చెవి పోగును తీయరాదు. పశు పోషకులు ఈ నిబంధనలు తప్పక పాటించాల్సి ఉంటుంది.
వైసీపీ పాలనలో నష్టపోయిన రైతులు
పరిశ్రమను పూర్తిగా నీరు గార్చారు. పశువుల బీమాకు మొదటి నాలుగేళ్లలో ఒక్క రూపాయి విడుదల చేయలేదు. పశువు మరణిస్తే నష్ట పరిహారం చెల్లిస్తామని, బీమా అవసరం లేదని చెప్పిన వైసీపీ ప్రభుత్వం పాడి రైతులను నిలువునా ముంచింది. నష్ట పరిహారం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పాడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చివరి సంవత్సరం ఎన్నికల ముందు పశు బీమా పథకం అంటూ హడా వుడి చేశారు. విడుదల చేసిన మార్గ దర్శకా లు లోప భూయిష్టంగా ఉండడంతో రైతులు బీమా చేయడానికి సైతం మొగ్గు చూపలేదు. కూటమి అధికారంలోకి రావడం తో పాడి రైతులకు మళ్లీ పూర్వ వైభవం వచ్చింది.
పాడి పశువుల బీమా సొమ్ము,
రైతు చెల్లించాల్సిన వాటా వివరాలు
లబ్దిదారులు అందించే ప్ర. రాయితీ లబ్దిదారుని
భీమా వాటా
ఎస్సీ, ఎస్టీ రైతులు రూ.15,000 రూ.768 రూ.192
రూ.30,000 రూ.1536 రూ.384
సాధారణ రైతులు రూ.15,000 రూ.480 రూ.480
రూ.30,000 రూ.960 రూ.960
గొర్రె లు, మేకలు రూ.6000 రూ.135 రూ.54
అవగాహన కల్పిస్తున్నాం
పశు బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మండలాల వారిగా అధికారులకు దిశా నిర్దేశం చేశాం. నంద్యాల జిల్లాకు రూ.12లక్షల బీమా సొమ్మును ప్రభుత్వం కేటాయించింది. రైతులకు అవసరమైతే మరింత కేటాయింపులు జరుగుతాయి. పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి. - డాక్టర్ గోవింద్ నాయక్, నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి