Share News

'Sankalp-2025' : ఇంటర్‌ ఉత్తీర్ణత పెంచేందుకు‘సంకల్ప్‌’

ABN , Publish Date - Dec 02 , 2024 | 03:55 AM

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు ‘సంకల్ప్‌-2025’ అనే వినూత్న కార్యక్రమాన్ని ఇంటర్‌ విద్యామండలి రూపొందించింది.

'Sankalp-2025' : ఇంటర్‌ ఉత్తీర్ణత పెంచేందుకు‘సంకల్ప్‌’

  • 3 కేటగిరీలుగా విద్యార్థుల వర్గీకరణ

  • గ్రూపుల వారీగా కేర్‌టేకర్ల నియామకం

  • ప్రత్యేకంగా స్టడీ సమయం నిర్వహణ

అమరావతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు ‘సంకల్ప్‌-2025’ అనే వినూత్న కార్యక్రమాన్ని ఇంటర్‌ విద్యామండలి రూపొందించింది. 2023-24లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో తక్కువ మంది విద్యార్థులే ఉత్తీర్ణులు కావడంతో ఈ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణతను పెంచడమే లక్ష్యంగా దీనిని అమలు చేస్తోంది. ఇప్పటి వరకు ఉన్న విధానంలో విద్యార్థులు ఎవరికివారుగా చదువుకుంటున్నారు. ఇక నుంచి వారి సామర్థ్యాలను అంచనా వేసి, దానికి అనుగుణంగా విద్యార్థులను వర్గీకరించనుంది. చదువులో వెనుకబడిన విద్యార్థులను మెరుగుపరిచేందుకు జూనియర్‌ లెక్చరర్లు, ఇతర సిబ్బందిని ‘కేర్‌ టేకర్లు’గా నియమించనుంది. ఈ మేరకు డిసెంబరు 1 నుంచి ఈ కార్యక్రమం అమలుకు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే 1న సెలవు కావడంతో సోమవారం నుంచి సంకల్ప్‌-2025 అమల్లోకి రానుంది.

  • విద్యార్థుల విభజన

ప్రతి కాలేజీలో విద్యార్థులను మూడు కేటగిరీలుగా విభజస్తారు. అక్టోబరులో జరిగిన క్వార్టర్లీ పరీక్షల ఆధారంగా ఈ వర్గీకరణ ఉంటుంది. చదువులో మెరుగ్గా ఉన్నవారిని గ్రూప్‌ ఏ, అంతంతమాత్రంగా ఉన్నవారిని గ్రూప్‌ బీ, ఫెయిల్‌ అయినవారిని గ్రూప్‌ సీగా వర్గీకరిస్తారు. హాఫ్‌యర్లీ, ప్రీ ఫైనల్‌ పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థుల కేటగిరీలు మారుతూ ఉంటాయి. సీ-గ్రూపు విద్యార్థులకు క్వశ్చన్‌ బ్యాంక్‌లు ఇస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు వారికి స్టడీ అవర్లు నిర్వహిస్తారు. అవసరమైతే 5 తర్వాత కూడా స్టడీ అవర్లు ఉంటాయి.


  • కేర్‌టేకర్లదే బాధ్యత

విద్యార్థుల అభ్యసన స్థాయిని గుర్తించేందుకు, వారు పుంజుకునేలా చేసేందుకు బోధనా సిబ్బంది, లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లను కేటాయిస్తారు. బోధనా సిబ్బంది తక్కువగా ఉంటే పీజీ అర్హత కలిగిన బోధనేతర సిబ్బందిని కూడా కేటాయిస్తారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులను సైన్స్‌, గణితం జూనియర్‌ లెక్చరర్లకు కేటాయించి వారిని గ్రూపులుగా వర్గీకరిస్తారు. బాగా వెనుకబడిన విద్యార్థులను ఐదారు మందిని ఒక గ్రూపుగా ఏర్పాటుచేసి బోధన, బోధనేతర సిబ్బందిని కేర్‌టేకర్లగా నియమిస్తారు. విద్యార్థులను మెరుగుపరిచి వారు ఉత్తీర్ణులయ్యేలా చూడటం వారి బాధ్యతగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

  • టైమ్‌టేబుల్‌ సర్దుబాటు

విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా ప్రతి కాలేజీలో ప్రిన్సిపాళ్లు టైమ్‌టేబుల్‌ను సర్దుబాటు చేస్తారు. విద్యార్థులు ఎక్కువగా వెనుకబడిన సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ భాషా సబ్జెక్టుల సిలబస్‌ పూర్తయి.. వాటిలో విద్యార్థులు మెరుగ్గా ఉంటే, ఆ సమయాన్ని ఇతర సబ్జెక్టులకు కేటాయిస్తారు. దీని ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను కేర్‌టేకర్లు ఎప్పటికప్పుడు అంచనా వేస్తారు. సోమవారం నుంచి మొదలయ్యే సంకల్ప్‌-2025 ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ముగిసే వరకు అమల్లో ఉంటుంది.

  • నమ్మకం పెంచేలా చర్యలు

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు గత కొన్నేళ్లుగా అతి తక్కువ ఉత్తీర్ణతతో నెట్టుకొస్తున్నాయి. ఇంటర్‌ విద్యలో ప్రైవేటు విద్యా సంస్థలు ఉత్తమ ఫలితాలు సాధిస్తుంటే, ప్రభుత్వ కాలేజీలు మాత్రం వెనుకబడిపోతున్నాయి. దీంతో తల్లిదండ్రులు వీలైనంతమేరకు పిల్లలను ప్రైవేటు కాలేజీలకు పంపేందుకే మొగ్గు చూపుతున్నారు. అందులోనూ గత ప్రభుత్వంలో కొత్తగా ప్రారంభించిన హైస్కూల్‌ ప్లస్‌లలో దారుణమైన ఉత్తీర్ణత నమోదైంది. ఎలాంటి సన్నద్ధత లేకుండా హైస్కూల్‌ ప్లస్‌ పేరుతో ఉన్నత పాఠశాలల్లో ఇంటర్‌ విద్యను ప్రారంభించడంతో ఈ దుస్థితి తలెత్తింది. ఈ సమస్యలను అధిగమించి ఉత్తీర్ణత పెంచేందుకు ఇంటర్‌ విద్యామండలి నడుం బిగించింది. ఈ నేపథ్యంలోనే అనేక చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌ కరిక్యులమ్‌ కూడా మార్చి, ప్రైవేటు కాలేజీల తరహాలో జేఈఈ, నీట్‌కు కోచింగ్‌ కూడా ఇవ్వనుంది.

Updated Date - Dec 02 , 2024 | 03:56 AM