Share News

Gudivada Fraud: గుడివాడలో ‘కిలేడీ’.. అమాయకులకు మాయమాటలు చెప్పి..

ABN , Publish Date - May 25 , 2024 | 08:27 AM

రుణాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి.. ఓ కిలేడీ భారీగా డబ్బులు కాజేసింది. తన మాటలతో అమాయకుల్ని బుట్టలో పడేసి.. ఏకంగా కోటిన్నర దోచుకుంది. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని గుడివాడలో చోటు చేసుకుంది.

Gudivada Fraud: గుడివాడలో ‘కిలేడీ’.. అమాయకులకు మాయమాటలు చెప్పి..

రుణాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి.. ఓ కిలేడీ భారీగా డబ్బులు కాజేసింది. తన మాటలతో అమాయకుల్ని బుట్టలో పడేసి.. ఏకంగా కోటిన్నర దోచుకుంది. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని గుడివాడలో (Gudivada) చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని (Hyderabad) మియాపూర్‌లో లీలావతి (Leelavathi) అనే మహిళ నివాసముంటోంది. మాయమాటలతో ప్రజలకు ఎరవేసి, అక్రమమార్గంలో డబ్బులు దండుకోవడమే ఆమె పని. ఎవరికైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, డబ్బులు అత్యవసరం అవుతాయో.. వారినే ఈ లీలావతి టార్గెట్ చేస్తుంది. ఈ క్రమంలోనే.. ఆమె రీసెంట్‌గా గుడివాడలో అడుగుపెట్టింది.


తాను ప్రైవేట్ బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తానని.. గుడివాడలో ప్రచారం చేసుకుంది. ఇందులో ఎలాంటి జిమ్మిక్కులు లేవని, ప్రతిఒక్కరూ ఆర్థిక పరంగా ఎదుగుతారంటూ ఆమె మాయమాటలు చెప్పింది. ఈ ఆఫర్ టెంప్టింగ్‌గా ఉండటం, ఆమె మాటలు ఆకర్షణీయంగా అనిపించడంతో.. ఎంతోమంది మహిళలు ముందుకొచ్చారు. ఇంకేముంది.. తాను వేసిన వలలో చేపలు చిక్కుకున్నాయని భావించి, తన ప్లాన్‌ని అమలు చేయడం మొదలుపెట్టింది. తొలుత ఆమె మహిళలతో కొన్ని గ్రూపులు క్రియేట్ చేసింది. లక్ష్మీ నగర్ కాలనీ, బాపూజీ నగర్, చౌదరి పేట, ఆర్టీసీ కాలనీ, టీడ్కో కాలనీ, జగనన్న కాలనీ.. ఇలా ప్రతి ఏరియాలోని మహిళలతో దాదాపు 60 గ్రూపులు ఏర్పాటు చేసింది.

గ్రూపుల్లోని సభ్యుల వద్ద బంగారు ఆభరణాలు తీసుకొని.. భారీగా రుణాలు ఇప్పిస్తానని నమ్మించి, వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టింది. ఆ వచ్చిన డబ్బులు తాను తీసుకొని, చాకచక్యంగా ఉడాయించింది. కనీసం.. రుణాలు వచ్చిన విషయం కూడా బాధితులకు చెప్పలేదు. ఇంతలో బ్యాంకుల ప్రతినిధులు ఇళ్ల వద్దకు వచ్చి గొడవ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో తాము మోసపోయాయని గ్రహించిన బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. రుణాల పేరుతో బంగారం తాకట్టు పెట్టించి, ఆ డబ్బులతో లీలావతి జంప్ అయ్యిందని.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మోసం చేసిన లీలావతి ఇంటి వద్ద ధర్నా కూడా చేశామని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 25 , 2024 | 08:27 AM