Share News

TTD Chairman BR Naidu : ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం

ABN , Publish Date - Dec 25 , 2024 | 05:34 AM

టీటీడీ కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని, అందులో భాగంగా టీటీడీ ఆలయాలు, ఆస్తుల గ్లోబల్‌ విస్తరణకు అవసరమైన సూచనల కోసం నిపుణులతో కూడిన

TTD Chairman BR Naidu : ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం

  • స్విమ్స్‌ ఆస్పత్రికి జాతీయహోదాకు ప్రయత్నం

  • టీటీడీలో ఆహార భద్రతా విభాగం ఏర్పాటు

  • పాలకమండలి తీర్మానాలు వెల్లడించిన టీటీడీ చైర్మన్‌, ఈవో

తిరుమల, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): టీటీడీ కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని, అందులో భాగంగా టీటీడీ ఆలయాలు, ఆస్తుల గ్లోబల్‌ విస్తరణకు అవసరమైన సూచనల కోసం నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావు తెలిపారు. ఈమేరకు మంగళవారం టీటీడీ ధర్మకర్తలమండలి తీర్మానం చేసిందన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశ వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు తీర్మానం చేసినట్టు తెలిపారు. తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో రోగులకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇందువల్ల కేంద్రం నుంచి అదనపు నిధులు కూడా వచ్చే అవకాశముందన్నారు. ఇక ఏఐ ద్వారా గంటలోపు దర్శనంపై అఽధ్యయనం చేస్తున్నామన్నారు. తిరుమలలోని హోటళ్ల ద్వారా నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సుల జారీలో నూతన విధానం అమలుకు ఆమోదం తెలిపామన్నారు. అక్రమణల అంశంలో తిరుమలలో ఓ మఠానికి ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని, వారి బదులుతో పాటు కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. చెన్నైలో లడ్డూల అక్రమ తరలింపపై దర్యాప్తు చేస్తామన్నారు.


  • మరికొన్ని టీటీడీ నిర్ణయాలు..

  1. నడక మార్గంలో గుండెపోటు మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో తిరుమల అశ్విని ఆస్పత్రిలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది నియామకాలకు, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు ఆమోదం

  2. ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ సహకారంతో భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం ఫీడ్‌బ్యాక్‌ మేనేజ్మెంట్‌ సిస్టం ఏర్పాటు

  3. ఆహారపదార్థాల తనిఖీ కోసం టీటీడీలో ప్రత్యేకంగా ఫుడ్‌సేఫ్టీ విభాగం ఏర్పాటు

  4. అన్నప్రసాద కేంద్రంలో నాణ్యమైన అన్నప్రసాదాలు అందించేందుకు కార్పొరేషన్‌ ద్వారా వివిధ విభాగాల్లో 258 మంది సిబ్బందిని తీసుకునేందుకు నిర్ణయం

Updated Date - Dec 25 , 2024 | 05:34 AM