Share News

Janasena: జనసేనలో చేరిన జానీ మాస్టర్

ABN , Publish Date - Jan 24 , 2024 | 05:53 PM

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లోకి చేరికలు, వలసలు కొనసాగుతున్నాయి. అధికార వైసీపీ అసంతృప్త నేతలు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నాయి. కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నవారు తమకు నచ్చిన పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ నృత్య దర్శకుడు షేక్ జానీ మాస్టర్ (Johny Master) పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.

Janasena: జనసేనలో చేరిన జానీ మాస్టర్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లోకి చేరికలు, వలసలు కొనసాగుతున్నాయి. అధికార వైసీపీ అసంతృప్త నేతలు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నాయి. కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నవారు తమకు నచ్చిన పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ నృత్య దర్శకుడు షేక్ జానీ మాస్టర్ (Johny Master) పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. బుధవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన చేరారు. పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

జనసేన చేరడంపై జానీ మాస్టర్ స్పందించారు. ‘‘ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరాను. ప్రత్యక్ష రాజకీయాల్లోకి నన్ను సాదరంగా ఆహ్వానించిన పవన్ అన్నకి నేనిచ్చిన మొదటి మాట ‘గెలుపోటములతో సంబంధం లేకుండా చచ్చేంత వరకు మీతోనే ఉంటా. మీ నమ్మకం నిలబెట్టుకుంటా’ అని మాట ఇచ్చాను’’ అని జానీ మాస్టర్ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జానీ మాస్టర్ పోటీ చేస్తారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పోటీ చేస్తే నెల్లూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగవచ్చుననే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆయన అనేక సేవా కార్యక్రమాల్లో పొల్గొంటూ వస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - Jan 24 , 2024 | 06:59 PM