Share News

రహదారి సమస్యలపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

ABN , Publish Date - Oct 25 , 2024 | 05:06 AM

రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లు, భూసేకరణ, న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

రహదారి సమస్యలపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

  • ఎన్‌హెచ్‌ ప్రాజెక్టుల పనులకు ఉచితంగా ఇసుక

  • గ్రావెల్‌ అనుమతులు సులభతరం: సీఎం చంద్రబాబు

అమరావతి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లు, భూసేకరణ, న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 129 ప్రాజెక్టులతో పాటు భవిష్యత్తులో చేపట్టనున్న రూ.30వేల కోట్ల రహదారి ప్రాజెక్టులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పూర్తయ్యేందుకు ఈ టాస్క్‌ఫోర్స్‌ కీలక అధికారులతో సమన్వయం చేసుకొనేలా ప్రభుత్వం సత్వర కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తుందని చెప్పారు. జాతీయ రహదారుల నిర్మాణంపై ఆయన గురువారం సమీక్షించారు. భూ సేకరణ, ఇతర సమస్యలతో 260కి.మీ. పరిధిలో రూ.4,766 కోట్ల విలువైన 11ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నట్లు సీఎంకు అధికారులు నివేదించారు.

ఆయా శాఖల మధ్య సమన్వయం, సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామని సమీక్ష సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు. భూ సేకరణ సమస్యలు 3నెలల్లో పరిష్కరింపజేస్తామని హామీ ఇచ్చారు. ఈ టాస్క్‌ఫోర్స్‌లో నేషనల్‌ హైవే, అటవీ, రైల్వే, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులు ఉంటారని తెలిపారు. దీనితో పాటు అన్ని సమస్యలను ఒకే వేదికపై తెలిపేందుకు, వెంటనే పరిష్కారం చూపేందుకు ప్రత్యేకంగా ఒక వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులకు అవసరమైన ఇసుకను కాంట్రాక్టు ఏజెన్సీలు ఉచితంగా తీసుకెళ్లవచ్చని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అలాగే గ్రావెల్‌ అనుమతులను మరింత సులభతరం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. రహదారి ప్రాజెక్టుల్లో భారీ వంతెనల నిర్మాణాల వద్ద వాటర్‌షెడ్‌ తరహాలో నీటిని నిల్వ చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. దానివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 05:06 AM