Share News

Chandrababu Naidu: సర్వనాశనమైన ఏపీని ఐదేళ్లలో ట్రాక్‌లో పెట్టే బాధ్యత నాది

ABN , Publish Date - Jan 28 , 2024 | 09:42 PM

ఆంధ్ర రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, నాశనమైన ఈ రాష్ట్రాన్ని ఐదేళ్లలో ట్రాక్‌లో పెట్టే బాధ్యత తనదేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2029 నాటికి భారతదేశంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టాలన్నదే తన సంకల్పమని చెప్పారు. పేదరికం లేని సమాజమే తన ఆశయమని.. అందుకు తనకు సహకరించాలని కోరారు.

Chandrababu Naidu: సర్వనాశనమైన ఏపీని ఐదేళ్లలో ట్రాక్‌లో పెట్టే బాధ్యత నాది

ఆంధ్ర రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, నాశనమైన ఈ రాష్ట్రాన్ని ఐదేళ్లలో ట్రాక్‌లో పెట్టే బాధ్యత తనదేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2029 నాటికి భారతదేశంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టాలన్నదే తన సంకల్పమని చెప్పారు. పేదరికం లేని సమాజమే తన ఆశయమని.. అందుకు తనకు సహకరించాలని కోరారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండలో నిర్వహించిన ‘రా కదలిరా’ కార్యక్రమం బహిరంగ సభలో భాగంగా.. ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. వర్గీకరణతో మాదిగలకు న్యాయం చేస్తానని మాటిచ్చారు.


పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కుటుంబం అనకొండలా దోచేసుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. రైల్వే కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి, యంత్రాలు ఎత్తుకెళ్లారన్నారు. గోవా, కర్ణాటక మధ్య మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని చెప్పారు. మంత్రి జయరాంకు ఆలూరు టికెట్ కట్ చేసి కర్నూలు ఎంపీ సీటు ఇచ్చారని.. దాంతో ఆయన దండం పెట్టి పారిపోయాడని ఎద్దేవా చేశారు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పోటీ చేయనని అస్త్ర సన్యాసం చేశాడన్నారు. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మట్కా, గుట్కా, క్రికెట్ బెట్టింగ్, భూ కబ్జాలలో దిట్ట అని దుయ్యబట్టారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి తుంగభద్ర నదిలో ఇసుకను దోచేస్తుంటే.. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి దేవాలయాల భూములు కొట్టేశాడని ధ్వజమెత్తారు.

కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ కేవలం పేరుకే ఎమ్మెల్యే అని.. పెత్తనమంతా కోట్ల హర్షవర్ధన్ రెడ్డిదేనని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అవినీతిలో కింగ్ డాన్ అని వ్యాఖ్యానించారు. ఆదోనిలో మిర్చి కోల్డ్ స్టోరేజ్‌ని ఏర్పాటు చేస్తానని.. ఎమ్మిగనూరులో పెండింగ్‌లో ఉన్న టెక్స్‌టైల్ పార్కును పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. మార్పుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన జనాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని.. తనకు ఎక్కడలేని శక్తి వచ్చిందని అన్నారు. ఐటీని ఏర్పాటు చేసిన ట్రాక్ తనదని.. నడుము వంచి కొబ్బరికాయ కొట్టలేని వారు తన గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓట్ల దొంగలు ఉన్నారని.. ఓటర్లందరూ జాగ్రత్తగా ఉండాలని.. ప్రతి రోజూ మీ ఓటుని చెక్ చేసుకోండని చంద్రబాబు సూచించారు.

Updated Date - Jan 28 , 2024 | 09:42 PM