Share News

Chandrababu Naidu: జగన్‌కు సబ్జెక్టు వీక్, బిల్డప్ పీక్.. చంద్రబాబు విమర్శనాస్త్రాలు

ABN , Publish Date - Jan 28 , 2024 | 07:39 PM

కర్నూలు జిల్లాలోని పత్తికొండలో నిర్వహించిన ‘రా కదలిరా’ కార్యక్రమం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్‌కు సబ్జెక్టు ఏమీ లేదని, బిల్డప్పులు మాత్రమే ఇస్తున్నారంటూ దుయ్యబట్టారు. కర్నూలు జిల్లా అభివృద్ధి టీడీపీ, జనసేన పొత్తుతోనే సాధ్యమని ఉద్ఘాటించారు.

Chandrababu Naidu: జగన్‌కు సబ్జెక్టు వీక్, బిల్డప్ పీక్.. చంద్రబాబు విమర్శనాస్త్రాలు

కర్నూలు జిల్లాలోని పత్తికొండలో నిర్వహించిన ‘రా కదలిరా’ కార్యక్రమం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్‌కు సబ్జెక్టు ఏమీ లేదని, బిల్డప్పులు మాత్రమే ఇస్తున్నారంటూ దుయ్యబట్టారు. కర్నూలు జిల్లా అభివృద్ధి టీడీపీ, జనసేన పొత్తుతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైసీపీ గెలిచిందని.. కానీ ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని.. అలాంటప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకని నిలదీశారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఓట్లు అడిగేందుకు జగన్ మళ్లీ వస్తాడని.. అప్పుడు నువ్వు మా బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డ అని చెప్పి తరిమికొట్టండని పిలుపునిచ్చారు.

బీసీ ఓట్లతో గద్దెనెక్కిన జగన్ బీసీలకు ఏమీ చేయలేదని.. కేసీ క్రిష్ణమూర్తి లాంటి ఎందరో బీసీ నాయకులకు పదవులిచ్చి తాము బీసీలకు పెద్దపీట వేశామని చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లాలో పనులు లేక ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని.. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి వలసలను నివారిస్తామని హామీ ఇచ్చారు. ఒక బీసీని చంపిన వ్యక్తులు రోడ్లపై తిరుగుతున్నారని, బాధిత కుటుంబాన్ని జగన్ పరామర్శించలేదని, జగన్ బీసీల ద్రోహి అని ధ్వజమెత్తారు. బాబాయ్‌ని చంపిన వారు బయట తిరుగుతున్నారని ఆరోపించారు. వైసీపీని ఓడించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని, వైసీపీ పాలన పోవడానికి కేవలం 73 రోజులే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా యువత ‘రా కదలిరా’ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని.. తాము అధికారంలోకి వస్తే యువత భవిష్యత్తుకు బంగారు బాట వేస్తానని చెప్పారు.


తిరుపతిలో ఇండియా టుడేతో మీటింగ్ పెట్టి జగన్ కోట్లు ఖర్చు పెట్టి బిల్డప్ ఇచ్చారని చంద్రబాబు విమర్శించారు. బీకామ్ అంటే ఏంటో చెప్పలేని పరిస్థితిలో మొద్దబ్బాయి ఉన్నారని సెటైర్లు వేశారు. పేద ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూశారే తప్ప.. వారికి చేసిందేమీ లేదన్నారు. వైనాట్ 175 అంటున్న జగన్.. ముందు పులివెందులలో గెలిచి చూపించమని ఛాలెంజ్ చేశారు. ఎన్నికల ముందు ఏ పార్టీ అయినా యాక్టివ్‌గా ఉంటుందని.. కానీ వైసీపీ మాత్రం స్తబ్ధతగా ఉందని.. ఎమ్మెల్యేలు, మంత్రులను మార్చుతూ పబ్బం గడుపుతోందని అన్నారు. ఎన్నికల తర్వాత జగన్ జెండాను మడిచిపెట్టేందుకు.. వైసీపీ వాళ్లే సిద్ధంగా ఉన్నారని అన్నారు. రూ. 365 కోట్లతో జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు తాము చేపడితే.. వైసీపీ ప్రభుత్వం దాన్ని మూలన పడేసిందన్నారు. 95 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలిచ్చానని, మళ్లీ ఇస్తానని మాటిచ్చారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. విండ్ ఎనర్జీ, సోలార్ ప్రాజెక్టులు నిర్మించి కరెంటు చార్జీలను తాను తగ్గిస్తే.. జగన్ ఇష్టానుసారంగా కరెంటు చార్జీలు పెంచాడని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సోలార్ ఎనర్జీ పరికరాలు ఇస్తామని.. దీనివల్ల కరెంటు ఉత్పత్తి చేసి, రైతులు అవసరానికి వాడుకోగా మిగిలిన కరెంట్‌ను కొనుగోలు చేస్తానని చెప్పారు. నాసిరకం మద్యంతో జగన్ ప్రజల రక్తంను తాగుతున్నాడని తూర్పారపట్టారు. హంద్రీనీవా ద్వారా ఆయకట్టుకు నీరిచ్చే బాధ్యత తనదేనని, గోదావరి నీళ్లు రాయలసీమకు తేవాలన్నదే తన సంకల్పమని చంద్రబాబు అన్నారు. కర్నూలుకు నీళ్లు తీసుకొచ్చి కరువుకు స్వస్తి చెప్తానన్నారు. ప్రజలే జగన్ పతనానికి క్యాంపెయినర్లని అన్నారు. జగన్ కలియుగ భస్మాసురుడని.. ఓటు అనే ఆయుధంతో అతడ్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు.

Updated Date - Jan 28 , 2024 | 07:39 PM