Share News

AP News: ప్లీజ్.. మమ్మల్ని పంపేయండి!

ABN , Publish Date - May 27 , 2024 | 04:35 AM

మాతృ సంస్థలకు పంపేయాలని కోరుతున్న వారి జాబితాలో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి మొదటి వరుసలో ఉన్నారు.

AP News: ప్లీజ్.. మమ్మల్ని పంపేయండి!
AP Ias Officers

సీఎస్‌కు ‘డిప్యుటేషన్‌’ అధికారుల మొర.. మాతృ సంస్థలకు వెళ్లేందుకు హడావుడి

ముందు వరుసలో బేవరేజెస్‌ వాసుదేవరెడ్డి

ఆరు నెలల నుంచి ప్రయత్నాలు

ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణది అదే బాట

తనను రిలీవ్‌ చేయాలని సీఎస్‌కు అభ్యర్థన

ప్రభుత్వం మారుతుందనే ఆందోళనతో..

వీరిద్దరికి సీఎంవో అధికారుల ‘కౌన్సెలింగ్‌’!

వైసీపీయే వస్తుందని భరోసా ఇచ్చే యత్నం

రాష్ట్ర క్యాడరి అధికారి ఎస్‌ఎస్‌ రావత్‌

తెలంగాణకు వెళ్లేందుకు నిరుడే దరఖాస్తు

ఏపీఎండీసీ నుంచి తప్పించాలని

అటు వీజీ వెంకటరెడ్డి వేడుకోలు

ఐదేళ్ల జగన్‌ హయాంలో చట్టాలు, నిబంధనలకు పాతరేసి వైసీపీ చట్టాలను అమలు చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంలో కీలక పాత్ర పోషించిన కొందరు ఐఏఎస్‌ అధికారులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా కేంద్రం నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారుల్లో భయం ఉంది. చేసిన తప్పులకు ప్రభుత్వం మారితే తమకు తిప్పలు తప్పవనే కలవరంతో తిరిగి మాతృసంస్థలకు వెళ్లిపోతామని, తమను రిలీవ్‌ చేయాలని సీఎస్‌కు మొరపెట్టుకుంటున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మాతృ సంస్థలకు పంపేయాలని కోరుతున్న వారి జాబితాలో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి మొదటి వరుసలో ఉన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ కూడా ఢిల్లీ పోతానంటున్నారు. వాసుదేవరెడ్డి గత 6 నెలలుగా ఈ ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక మరింత బరి తెగించి జగన్‌ సేవలో తరిస్తుండడంతో ఎన్నికల కమిషన్‌ ఆయనపై బదిలీ వేటేసి షాకిచ్చింది. ఈయన ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీసు అధికారి. జగన్‌ సీఎం కాగానే ఏరికోరి ఆయన్ను డిప్యుటేషన్‌పై తెచ్చుకున్నారు. కీలకమైన మద్యం విక్రయాల బాధ్యత ఆయన చేతుల్లో పెట్టారు. మూడేళ్లకు డిప్యుటేషన్‌ గడువు ముగిసినా పైస్థాయిలో సిఫారసు చేయించి మరో మూడేళ్లు పొడిగిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. జగన్‌ మళ్లీ గెలిచే పరిస్థితి లేదని ముందే అంచనా వేశారేమో.. తనను తిరిగి రైల్వే శాఖకు పంపాలని కోరారు. అలాంటిదేమీ జరగదని.. మళ్లీ జగనే సీఎం అవుతారని.. ఎక్కడకు కదలొద్దని ప్రభుత్వ పెద్దలు ఆయనకు హితబోధ చేసినట్లు సమాచారం. ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ గత వారంలో సీఎస్‌ను కలిసి తనను రిలీవ్‌ చేయాలని కోరారు. దీంతో సీఎంవో అధికారులు రంగంలోకి దిగి ఆయనతో మాట్లాడారు.


మళ్లీ వైసీపీయే గెలుస్తుంది.. ఇక్కడే ఉండండంటూ ఆయనకు ‘కౌన్సెలింగ్‌’ ఇచ్చినట్లు తెలిసింది. ఆర్థిక శాఖలో జరిగిన అన్ని అక్రమాలకు, అరాచకాలకు కేంద్రబిందువు సత్యనారాయణే. వైసీపీ అస్మదీయ కాంట్రాక్టర్లకు ఈ ఐదేళ్లలో ఫిఫోను ఉల్లంఘించి మరీ రూ.లక్షల కోట్ల బిల్లులు చెల్లించారు. ప్రభుత్వంలో పనులు చేసిన సాధారణ కాంట్రాక్టర్లు కోర్టుకెళ్లినా వారికి పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించలేదు. అలాగే ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి, ఖజానా ఆదాయాన్ని మళ్లిం చి రాష్ట్ర సామర్థ్యానికి మించి అప్పులు తెచ్చి రాష్ట్రా న్ని ఆర్థికంగా అతలాకుతలం చేయడంలో ఈయనదే కీలకపాత్ర. సత్యనారాయణ కార్యకలాపాలతో పాటు మొత్తం ఆర్థిక శాఖను పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ది. కానీ వీరిద్దరూ కలిసి రాష్ట్రాన్ని ఆర్థిక అంధకారంలోకి నె ట్టేశారు. రావత్‌ రాష్ట్ర కేడర్‌ అధికారి. ఆయన తెలంగాణ కేడర్‌కు వెళ్తానని గత ఏడాదే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కాగా.. ఆర్థిక శాఖలోని మరో కార్యదర్శి గుల్జార్‌కు కేంద్ర సర్వీసుల్లో పోస్టింగ్‌ వచ్చింది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఎండీ వీజీ వెంకటరెడ్డి కూడా చా లా కాలం నుంచి తనను ఆ పోస్టు నుంచి తప్పించాలని అభ్యర్థిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆయన్ను ఆ పోస్టులోనే కొనసాగిస్తోంది.


కమిషనరా.. మజాకా?

ప్రభుత్వం మారితే ఇరకాటంలో పడతామని పై అధికారులంతా భయాందోళనలకు గురవుతుంటే.. మరో అధికారి మాత్రం డిప్యుటేషన్‌ పొడిగింపు కోసం ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఆయనే సమాచార పౌరసంబంధాల కమిషనర్‌ విజయకుమార్‌రెడ్డి. ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీ్‌సకు చెందిన ఆయన.. జగన్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చా రు. ఆయనకు పొడిగింపు ఇప్పించేందుకు సీఎస్‌ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్‌కుమార్‌రెడ్డిపై అనేక ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పథకాలకు, విధానాలకు సంబంధించి ఇచ్చిన ప్రకటనలు వైసీపీకి అనుకూలంగా రాజకీయ రంగులో ఉన్నాయంటూ కోర్టులో కేసులు సైతం దాఖలయ్యాయి. ఈ ఐదేళ్లలో ఐఅండ్‌పీఆర్‌ తరఫున ప్రకటనలివ్వడానికి భారీగా కమీషన్లు పుచ్చుకున్నారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

Updated Date - May 27 , 2024 | 07:30 AM