Share News

Coalition Govt : అమరావతికి యాక్షన్‌ప్లాన్‌

ABN , Publish Date - Nov 28 , 2024 | 03:41 AM

గత ప్రభుత్వం విధ్వంసం చేసిన రాజధాని అమరావతి పునర్‌నిర్మాణానికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోంది. గతంలో ఆగిన నిర్మాణాల పునఃప్రారంభం, ముందుగా చేయాల్సిన పనులపై ప్రభుత్వం వేసిన టెక్నికల్‌ కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించింది

Coalition Govt : అమరావతికి యాక్షన్‌ప్లాన్‌

  • 120 రోజుల్లో పెండింగ్‌ బిల్లుల చెల్లింపు

  • 2019 రాజధానిలో ఆగిన పనుల

  • బిల్లులకు ఇన్నాళ్లకు మోక్షం

  • పనులు చేసినంతవరకు చెల్లింపులు

  • అదనపు పనులూ ఒప్పందం పరిధిలోకే

  • బిల్లులు, అడ్వాన్సులపై వడ్డీ ఉండదు

  • టెక్నికల్‌ కమిటీ సూచనలకు ఆమోదం

అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం విధ్వంసం చేసిన రాజధాని అమరావతి పునర్‌నిర్మాణానికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోంది. గతంలో ఆగిన నిర్మాణాల పునఃప్రారంభం, ముందుగా చేయాల్సిన పనులపై ప్రభుత్వం వేసిన టెక్నికల్‌ కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించింది. బుధవారం ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2019లో రాజధానిలో ఆగిపోయిన పనులకు పెండింగ్‌ బిల్లులు చెల్లించనున్నారు. తద్వారా మధ్యలో ఆగిపోయిన పనులను మళ్లీ పట్టాలెక్కించనున్నారు. ఎంవోయూ ముగిశాక 120 రోజుల్లో పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని నిర్ణయించారు. టెక్నికల్‌ కమిటీ సిఫారసుల మేరకు సీఆర్‌డీఏ, ఏడీసీఎల్‌ కలిసి అమరావతి నిర్మాణంలో పాల్గొన్న అన్ని కాంట్రాక్టు ఏజెన్సీల ఎంవోయూల ముగింపుపై నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు. టీడీపీ హయాం 2014-19లో అమరావతిలో 350 కిలోమీటర్ల మేర రోడ్లు వేశారు. భారీ భవనాలు నిర్మించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని నిర్వీర్యం చేశారు. చాలా పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పూర్తయిన, నిర్మాణంలో ఉన్న రోడ్లు నాశనమయ్యాయి. ఈ పనులను మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. పనులు ముందుకు కదలాలంటే పెండింగ్‌ బిల్లుల చెల్లింపు తప్పనిసరని భావించింది. ఈ నేపథ్యంలో టెక్నికల్‌ కమిటీ ఇచ్చిన సూచనలను ప్రభుత్వం ఆమోదించింది.


  • టెక్నికల్‌ కమిటీ నివేదికలోని అంశాలు

  • అన్ని పెండింగ్‌ బిల్లులను ఒప్పందంలోని నిబంధనల ప్రకారం సర్దుబాటు చేసి చెల్లించాలి. 2019 మే 29వ తేదీన అప్పటి సీఎస్‌ ఇచ్చిన ఆదేశాలతో ఆగిపోయిన పనుల బిల్లులు చెల్లించాలి. ఒప్పందంలో లేకపోయినప్పటికీ జరిగిన పనులను ఒప్పందం పరిధిలోకి తీసుకురావాలి.

  • 2019 మే 29వ తేదీ వరకు చేసిన పనులు, సర్టిఫై చేసినవి, చేయాల్సినవి, రికార్డ్‌ చేసినవి, చేయాల్సిన పనులన్నింటినీ ఒప్పందంలోని నిబంధనల ప్రకారం పరిగణనలోకి తీసుకోవాలి.

  • మొబిలైజేషన్‌ అడ్వాన్సుల మీద వడ్డీ ఎత్తేయాలి. పనులు ఆగిపోవడానికి, జాప్యం జరగడానికి కారణం కాంట్రాక్టర్‌ కాదని ప్రభుత్వం తెలిపింది.

  • పెండింగ్‌ బిల్లులను వడ్డీ లేకుండా చెల్లించాలి.

  • 2014-19 సమయంలో ఒప్పందాలు జరిగినప్పుడు ఉన్న జీఎస్టీ రేటుకు, ప్రస్తుతం జీఎస్టీ రేటుకు ఉన్న వ్యత్యాసాన్ని కూడా పూరించాలన్న డిమాండ్లు వచ్చాయి. జీఎస్టీ అమల్లోకి రాకముందు ఆర్థిక శాఖ ఇచ్చిన జీవోల ప్రకారం ఈ జీఎస్టీ వ్యత్యాసాన్ని తేల్చవచ్చు. ఈ విషయంలో వాణిజ్య పన్నుల శాఖ అభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలి.

  • సీఆర్‌డీఏ, ఏడీసీఎల్‌ దగ్గర బ్యాంకు గ్యారెంటీలు, నగదు రూపంలో ఉన్న ఈఎండీ, ఎఫ్‌ఎ్‌సడీ లాంటి సెక్యూరిటీ డిపాజిట్లను పెండింగ్‌ బిల్లుల చెల్లింపులకు ఉపయోగించాలి. ఇలాంటి డిపాజిట్లు లేని వారికి నేరుగా బిల్లులు చెల్లించాలి. మొబిలైజేషన్‌ అడ్వాన్సులు లేని ఏజెన్సీలకు పెండింగ్‌ బిల్లులు చెల్లించడం కోసం ఈఎండీ, ఎఫ్‌ఎ్‌సడీలను బ్యాంకు గ్యారెంటీలు, నగదు రూపంలో విడుదల చేయాలి.

  • ప్రభుత్వ ఆమోదం పొందిన అమరావతి నిర్మాణాల డిజైన్లకు, బిల్ట్‌ డ్రాయింగ్‌ కాంపోనెంట్స్‌కు మాత్రమే చెల్లింపులు చేయాలి. ఇందుకు ఆ ఏజెన్సీ డిజైన్ల ప్రతులను సమర్పించాలి.


  • కొంతమేర పనులు చేసినా షెడ్యూల్‌-హెచ్‌లో పేర్కొన్న స్థాయిలో పూర్తికాకపోవడంతో నిలిచిపోయిన చెల్లింపుల విషయంలో దశలవారీగా చెల్లించాలి. ఎంత మేర పనులు పూర్తయితే అంతవరకు చెల్లింపులు చేయాలని భావిస్తున్నారు.

  • ప్రీకాస్ట్‌ వర్క్‌లు క్షేత్రస్థాయిలో మొదలు కానందున చెల్లింపులు చేయకూడదు. అలాగే సైట్‌ ఇన్‌ఫ్రా డెవల్‌పమెంట్‌ ఖర్చులు చెల్లించకూడదు.

  • అమరావతి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన పైపులకు బిల్లులు చెల్లించాలి.

  • నిర్మాణ పనుల కోసం తెచ్చిన పరికరాలను వాడకుండా పక్కన పెట్టినప్పటికీ వాటికి చెల్లింపులు చేయాలంటే సంబంధిత బిల్లులో ప్రస్తావించడంతో పాటు సరైన సాక్ష్యం కూడా చూపాలి.

  • గత ప్రభుత్వం వెనక్కి తీసుకున్న ఇసుక నిర్మాణ సామగ్రిని రీయింబర్స్‌ చేయాలి.

  • అమరావతి నిర్మాణం పనులు ఆగినప్పుడు చోరీకి గురైన నిర్మాణ సామగ్రి కోసం చెల్లింపులు చేయకూడదు.

  • నిర్మాణ పనుల కోసం కొనుగోలు చేసిన స్పేసర్లు, బేరింగుల లాంటి సామగ్రి కోసం ప్రభుత్వం చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు.

  • ఇప్పటి వరకు అమరావతిలో నిర్మాణ పనులు ఎంతవరకు జరిగాయనేది ఏపీసీఆర్‌డీఏ, ఏడీసీఎల్‌లోని క్వాలిటీ కంట్రోల్‌ విభాగంతో నిర్ధారణ చేయించుకోవాలి.

  • ప్రభుత్వం డబ్బులు చెల్లించినప్పటికీ కొన్ని ఏజెన్సీలు పైపులు, ఇతర సామగ్రిని వెనక్కి తీసుకెళ్లిపోయాయి. ఇలాంటి కేసుల్లో ప్రభుత్వం చెల్లించిన డబ్బును ఈ ఏజెన్సీలు తిరిగి ప్రభుత్వానికి జమ చేయాలి. వీటిని బిల్లుల చెల్లింపు కోసం ఉపయోగించాలి.

Updated Date - Nov 28 , 2024 | 03:41 AM