THANDA: తండాలోనే ఉంటాం.. తండాలోనే చస్తాం..!
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:48 PM
తండాను స్వీయనిర్బంధం చేసుకున్నారు గిరిజనులు. తాము.. ఈ జనంతో కలవలేమనీ, తమ తండాలోకి ఎవరూ రావద్దంటూ మండలంలోని పత్యాపురం ఎగువ తండావాసులు శుక్రవారం ముళ్లకంప వేసుకుని, నిరసన తెలిపారు. తండాను స్వీయనిర్బంధం చేసుకున్నారు.

గిరిజనుల స్వీయనిర్బంధం
ముళ్లకంప వేసుకుని నిరసన
తండా ఏర్పాటు చేసుకుని..
యాభై ఏళ్లయింది..
వంద కుటుంబాలుంటున్నాయి..
నేటికీ దారి లేదు..
పొలాల వెంట.. గట్ల వెంట..
వెళ్లాల్సిందే..
ఎవరైనా అడ్డుకుంటే..
మరో దారి వెతుక్కోవాల్సిందే..
తిడితే పడాల్సిందే..
అన్నీ భరిస్తూ వచ్చారు..
ఆఖరుకు దారికి అడ్డంగా తవ్వేశారు..
ఇక.. గిరిజనులు
విసిగిపోయారు..
తమ సమస్య పట్టని..
ఈ సమాజం వద్దనుకున్నారు..
తండాలోనే ఉంటాం..
ఇక్కడే చస్తాం.. అంటూ..
కంచె వేసుకున్నారు..
స్వీయ నిర్బంధం చేసుకున్నారు..
ఆధునిక సమాజంలో
అడవి బిడ్డల ఆక్రందన ఇది..
అరణ్య రోదన ఇది..
బత్తలపల్లి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): తండాను స్వీయనిర్బంధం చేసుకున్నారు గిరిజనులు. తాము.. ఈ జనంతో కలవలేమనీ, తమ తండాలోకి ఎవరూ రావద్దంటూ మండలంలోని పత్యాపురం ఎగువ తండావాసులు శుక్రవారం ముళ్లకంప వేసుకుని, నిరసన తెలిపారు. తండాను స్వీయనిర్బంధం చేసుకున్నారు. పత్యాపురం గ్రామ ఎగువ తండా 50 ఏళ్ల క్రితం ఏర్పడింది. పత్యాపురం నుంచి తండాకు దారి ఉంది. ఆ దారిలో పొలం ఉన్న వ్యక్తి అడ్డుచెప్పాడు. తన పొలంలో నుంచి తండాకు ప్లానలో రస్తా లేదని అడ్డగించాడు. ఎక్స్‌కవేటర్‌తో ఏడాది క్రితం అడ్డంగా గుంత తవ్వించాడు. అప్పట్నుంచి తండాలోకి వెళ్లేందుకు దారిలేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. దీంతో వారు చేసేదిలేక ఆరు నెలల క్రితం పొలం యజమాని వద్దకెళ్లి దారి వదలాలని అడిగారు. అందుకు పొలం యజమాని రూ.6లక్షలు అడిగాడు. అందుకు ఒప్పుకున్న తండావాసులు రూ.2 లక్షలు అడ్వాన్సుగా చెల్లించారు. తండాలో చందాలు వసూలు చేసి, మిగిలిన మొత్తం ఇస్తామనీ, అందుకు సమయం ఇవ్వాలని అడిగారు. అందుకు పొలం యజమాని అంగీకరించాడు. యజమాని ఇప్పుడు మాట మార్చాడు. రూ.11 లక్షలు ఇస్తేనే దారి వదులుతాననీ, అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2 లక్షలు ఇన్ని రోజులు తిరిగినందుకు సరిపోతుందని చేప్పడంతో గిరిజనులు షాక్ తిన్నారు. శుక్రవారం తమ తండాలోకి ఎవరూ రావద్దంటూ ముళ్ల కంప అడ్డంగా వేసుకుని, స్వీయ నిర్బంధం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సోమశేఖర్.. సిబందితో తండాకు వెళ్లి గిరిజనులతో మాట్లాడారు. తండాకు కంప వేసుకుని, నిర్బంధించుకోవడం సరికాదనీ, సమస్య ఉంటే అధికారుల వద్దకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు అనేకమార్లు తిరిగామనీ, అయినా సమస్య పరిష్కరించలేదని వాపోయారు. ఇక్కడే ఉండి.. ఇలాగే చచ్చిపోతామనీ, తమను వదిలేయండని గిరిజనులు తెగేసి చెప్పారు.