Share News

HOUSING : ఎన్నాళ్లీ గోడు

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:24 AM

ఏదో సొంతిళ్లు వస్తుంది కదా అని పలువురు లబ్ధిదారులు డబ్బులు చెల్లిస్తే దాన్ని తీసుకుని కాంట్రాక్టర్‌ కనబడకుండా పోయాడు. ఇంటి నిర్మాణం పూర్తికాకపోవడం, డబ్బులు పోవడంతో తాము మోసపోయామని భావించిన లబ్ధిదారులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని గృహ నిర్మాణశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఏం జరిగిందంటే.....

HOUSING : ఎన్నాళ్లీ గోడు
Concerned affected beneficiaries

ఇల్లు కట్టకుండా మోసం

రూ.21 లక్షలతో కాంట్రాక్టర్‌ ఉడాయింపు?

ఐదు నెలలుగా ముందుకు సాగని నిర్మాణం

జిల్లా హౌసింగ్‌ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన

అనంతపురం సిటీ, జూన 7: ఏదో సొంతిళ్లు వస్తుంది కదా అని పలువురు లబ్ధిదారులు డబ్బులు చెల్లిస్తే దాన్ని తీసుకుని కాంట్రాక్టర్‌ కనబడకుండా పోయాడు. ఇంటి నిర్మాణం పూర్తికాకపోవడం, డబ్బులు పోవడంతో తాము మోసపోయామని భావించిన లబ్ధిదారులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని గృహ నిర్మాణశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.

ఏం జరిగిందంటే..

జిల్లాలోని యాడికి మండలంలోని పిన్నెపల్లి గ్రామంలో జగనన్న లేఅవుట్‌లో ఆప్షన-3 కింద 133మందికి ఇంటి పట్టాలను మంజూరు చేశారు. ఇంటి నిర్మాణ కాంట్రాక్టును సుదర్శన చంద్రశేఖర్‌ అనే వ్యక్తి దక్కించుకున్నాడు. తొలుత పనులు వేగంగానే సాగాయి. అయితే ప్రభుత్వం నుంచి బిల్లుల రావడం ఆలస్యం కావడంతో ఆ కాంట్రాక్టర్‌ పనులను ఇష్టారాజ్యంగా చేయసాగాడు. దీంతో ఇళ్ల


నిర్మాణాలు ముందుకు సాగలేదు. ఇదే క్రమంలో నిర్మాణ ముడిసరుకుల ధరలు ఎక్కువగా ఉన్నాయని భావించిన ప్రభుత్వం కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా ఓ జీవోను తీసుకువచ్చింది. ఒక్కో లబ్ధిదారుడు అదనంగా రూ. 35 వేలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అదనుగా 133మంది లబ్ధిదారులపై రూ. 35 వేలు చెల్లించాలని ఒత్తిడి చేశాడు. దీంతో సుమారు 60 మంది అడిగిన సొమ్ము చెల్లించారు. మొత్తం రూ.21 లక్షల సొమ్ము వసూలు కాగా ఎంపీడీఓ ద్వారా కాంట్రాక్టర్‌కు చెల్లించారు. డబ్బు తీసుకున్న కాంట్రాక్టర్‌ ఐదు నెలలుగా పత్తాలేకుండా పోయాడు. అధికారులను అడిగితే అదిగో.. ఇదిగో అంటూ వచ్చారు. చివరికి ఎన్నికల ప్రక్రియ రావడంతో అటు కాంట్రాక్టర్‌. ఇటు అధికారు లు తమ సమస్యను పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశా రు. నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాతే కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లించాలి. కానీ 133 ఇళ్లలో ఏ ఇల్లు కూడా ఇప్పటికి పూర్తి కాలేదు. కానీ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా చెల్లించడం విమర్శలకు తావిస్తోంది. అధికారులను అడిగితే అడ్వాన్సుగా తీసుకున్నారని చెప్పి తప్పించుకోవడం మొదలెట్టారు.

ఉపాధి నిధులు ఇవ్వని వైనం..

ప్రభుత్వం నిర్మించే ప్రతి ఇంటికి 90 రోజుల పనిదినం కింద కేంద్ర ప్రభుత్వం రూ. 24,470 చెల్లిస్తుంది. ఇదీ పక్కాగా.. ఆయా లబ్ధిదారులకు వెళ్లాల్సి ఉంది. ఆ తర్వాత కాంట్రాక్టర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ 133 ఇళ్లలో సుమారు 100 ఇళ్లకు పైగా ఒక్క పైసా కూడా సంబంధిత అధికారులు మంజూరు చేయలేదు. బిల్లులు చెల్లింపుపై ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కాంట్రాక్టర్‌ మొండికేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉపాధి బిల్లులు రాలేదు.. కట్టిన డబ్బు రాలేదు

త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇస్తామంటే.. అధికారుల మాటలు విని కాంట్రాక్టర్‌కు రూ. 35 వేలు చెల్లించాం. చెల్లించినప్పటికి నుంచి ఇప్పటికి వరకు ఒక్క పని కూడా చేయలేదు. కనీసం కాంట్రాక్టర్‌ కనిపించనే లేదు. అధికారులను అడిగితే.. అదిగో.. ఇదిగో.. అంటున్నారు. సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. పోనీ ఉపాధిహామీ కింద 90 పని దినాల కింద ఇచ్చే రూ. 24,470 బిల్లులైనా ఇస్తే కొంతైనా మాకు ఇబ్బందులు తగ్గుతాయి.

- పుష్పలత


స్లాబ్‌ కుంగిపోయింది: షేకునబీ

అన్ని సదుపాయాలతో ఇంటిని అప్పగిస్తామంటే ఆరు నెలల కిందట రూ.35 వేలు చెల్లించాం. స్లాబ్‌ వేసి ఐదు నెలలైంది. ఇప్పటి వరకు గోడలకు ప్లాస్టింగ్‌ కూడా చేయలేదు. స్లాబ్‌ కూడా కుంగిపోయింది. ఏమాత్రం నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారు. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఐదు నెలల నుంచి ఇంటి నిర్మాణం చేయలేదు. కాంట్రాక్టర్‌ను అడిగితే పట్టించుకోవడం లేదు. చెల్లించిన నగదు వెనక్కి ఇస్తే మిగిలిన నిర్మాణం మేమే చేసుకుంటాం.

రూ. 35 వేలు ఇస్తేనే స్లాబ్‌ వేస్తామన్నారు: పెద్దక్క

నేను నా భర్త కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాం. జగనన్న ఇల్లు మంజూరైంది. ఆప్షన-3 కింద ప్రభుత్వమే కట్టిస్తుంది అంటే ఏంతో సంతోషపడ్డాం. చివరికి అదనంగా రూ. 35 వేలు చెల్లించాలని అధికారులు ఒత్తిడి చేశారు. చెల్లించకపోవడంతో నిర్మాణం ఆపేశారు. స్లాబ్‌ వేయాలంటే.. రూ. 35వేలు చెల్లించాలని డిమాండ్‌ చేయడంతో అప్పు చేసి మరి చెల్లించాం. కానీ ఇప్పటి వరకు ఇంటి నిర్మాణం పూర్తి చేయలేదు. దీనిపై కాంట్రాక్టర్‌, అధికారులను అడిగితే ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

త్వరలోనే పనులు చేయించేలా చూస్తాం

యాడికిలోని పిన్నేపల్లి జగనన్న లేఅవుట్‌లోని లబ్ధిదారులకు సంబంధించిన ఇళ్ల నిర్మాణాలు త్వరలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించాం. పనులు చేయకపోతే లబ్ధిదారులు కట్టిన డబ్బులు వెనక్కి ఇప్పించేలా చర్యలు తీసుకుంటాం. ఉపాధి పథకం నుంచి వచ్చే బిల్లులు కూడా త్వరగా చెల్లిస్తాం. లబ్ధిదారులు ఎవరూ అందోళన చెందాల్సిన పని లేదు.

- నరసింహారెడ్డి, ఇనచార్జి పీడీ


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 08 , 2024 | 12:24 AM