Handriniva canal : ఎత్తిపోతలకు అనుకూలం..!
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:49 AM
శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. హంద్రీనీవా ఎత్తిపోతలకు అవసరమైన స్థాయికి నీటిమట్టం చేరింది. ఈ నెల రెండో వారం వరకూ వర్షాలు తక్కువగా ఉండటంతో డ్యాంలో నీటి నిల్వలు ఆలస్యంగా పెరిగాయి. గడిచిన పది రోజులుగా కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో డ్యాంలోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరుతోంది. దీంతో హంద్రీనీవా ఎత్తిపోతలకు మార్గం సుగమమైంది. పంపింగ్ ప్రారంభం కావాలంటే డ్యాంలో కనీస నీటి మట్టం 835 అడుగులను దాటాల్సి ఉంటుంది. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 867.7 అడుగులకు చేరింది. వరద జలాలు మల్యాల పంపు..

శ్రీశైలం జలాశయంలో నీరు పుష్కలం
ప్రభుత్వ అనుమతి రాగానే హంద్రీనీవాకు నీరు
గుంతకల్లు, జూలై 27: శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. హంద్రీనీవా ఎత్తిపోతలకు అవసరమైన స్థాయికి నీటిమట్టం చేరింది. ఈ నెల రెండో వారం వరకూ వర్షాలు తక్కువగా ఉండటంతో డ్యాంలో నీటి నిల్వలు ఆలస్యంగా పెరిగాయి. గడిచిన పది రోజులుగా కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో డ్యాంలోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరుతోంది. దీంతో హంద్రీనీవా ఎత్తిపోతలకు మార్గం సుగమమైంది. పంపింగ్ ప్రారంభం కావాలంటే డ్యాంలో కనీస నీటి మట్టం 835 అడుగులను దాటాల్సి ఉంటుంది. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 867.7 అడుగులకు చేరింది. వరద జలాలు మల్యాల పంపు స్టేషనను తాకాయి. ఏ నిమిషంలోనైనా నీటిని తోడేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. జల వనరుల శాఖాధికారులు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు.
భారీగా వరద..
శ్రీశైలం డ్యాం నీటి మట్టం శుక్రవారం మధ్యాహ్నానికి 867.7 అడుగులకు చేరింది. మల్యాల పంప్ స్టేషన వద్ద ఎత్తిపోతలు ప్రారంభం కావాలంటే డ్యాంలో నీటి మట్టం 835 అడుగుల కంటే ఎక్కువ ఉండాలి. గత నెలాఖరున 815 అడుగుల వరకు మాత్రమే నీరు ఉన్నింది. ఈ నెల మొదటి వారం ఔట్ ఫ్లో కంటే ఇనఫ్లో తక్కువగా ఉండటంతో డ్యాంలో నీరు 809 అడుగులకు తగ్గిపోయింది. దీంతో ఎత్తిపోతలకు ఆగస్టు నెల రెండో వారం వరకూ ఆగాల్సి వస్తుందోమోనని భావించారు. కానీ పది రోజుల నుంచి కృష్ణా నది ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద మొదలు కావడంతో వారం కిందట డ్యాం నీటి మట్టం 835 అడుగులను దాటింది. ప్రస్తుతం 868 అడుగులను దాటి.. 126 టీఎంసీల నీరు శ్రీశైలం డ్యాంలోకి చేరింది. జలాశయంలోకి 2.68 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఔట్ ఫ్లో 62.40 వేల క్యూసెక్కులుగా నమోదైంది.
వచ్చేవారం?
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు హంద్రీనీవా కాలువలోని కొన్ని పంప్ హౌస్‌ల వద్ద వరద నీటి తాకిడి ఏర్పడింది. వర్షపు నీటి సమస్య ఉన్న పంప్ హౌస్‌ల వద్ద ఒక పంపును ఆన చేసి నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. హంద్రీనీవాలో పంపింగ్‌ను ప్రారంభించేందుకు 4 నుంచి 8 రోజుల సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. డ్యాంలో నీటి చేరికను అంచనాకట్టి.. ప్రభుత్వం త్వరలో హంద్రీనీవాలో ఎత్తిపోతలకు గ్రీన సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే హంద్రీనీవా అధికారులు పంపింగ్‌ను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. గత సంవత్సరం ఆగస్టు 16వ తేదీన ఎత్తిపోతలు ప్రారంభంకాగా, 2022లో జూలై 13వ తేదీన, 2021లో జూలై 26వ తేదీన హంద్రీనీవాలో ఎత్తిపోతలు చేపట్టారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....