COLLECTOR: ప్రశాంత ఎన్నికలకు సహకరించండి: కలెక్టర్
ABN , Publish Date - May 12 , 2024 | 11:46 PM
ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ అమితబర్దర్ కోరారు. పట్టణంలోని జిల్లా పరిషత బాలికల ఉన్నత పాఠశాల, తొండపాడు గ్రామంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలను ఆదివారం సాయంత్రం వారు పరిశీలించారు.

గుత్తి, మే 12: ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ అమితబర్దర్ కోరారు. పట్టణంలోని జిల్లా పరిషత బాలికల ఉన్నత పాఠశాల, తొండపాడు గ్రామంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలను ఆదివారం సాయంత్రం వారు పరిశీలించారు. జిల్లా పరిషత బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 173, 174, 175 పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ ఉదయం 7 నుంచి సాయంత్రం 6గంటల వరకు ఓటింగ్ పక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ కేంద్రాలలో 118 సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, ఇతర సామగ్రితో పాటు పోలింగ్ అధికారులు అయా కేంద్రాలకు చేరుకున్నారన్నారు. ఈవీఎంలు సాంకేతిక సమస్యలు ఎదురైనా 20 నిమిషాల్లో మరో ఈవీఎం ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 వేల మందికిపైగా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. వీరి వెంట సీఐ వెంకటరామిరెడ్డి, తహసీల్దారు భారతి, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
గుత్తిరూరల్: మండలంలోని తొండపాడు గ్రామ పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ అమిత బర్దర్ పరిశీలించారు. పోలీంగ్ కేంద్రాలలో వసతులను పరిశీలించారు. తహసీల్దార్ కార్యలయానికి వచ్చి ఇక్కడ సమస్యలను డీప్యూటీ తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన సౌకర్యలు కల్పించామని వారు తెలిపారు.