Share News

Restoration Works : అమరావతి 2.0

ABN , Publish Date - Nov 28 , 2024 | 03:28 AM

అమరావతి రాజధాని పునరుద్ధరణ పనులు డిసెంబరు 15న ప్రారంభం కాబోతున్నాయి. 2017లో మహాయజ్ఞంలా పనులు జరుగుతూ కనిపించిన ముఖచిత్రం మరోమారు సాక్షాత్కరించనుంది. ఆయా ప్రాజెక్టులను బట్టి కనిష్ఠంగా 9 నెలల నుంచి గరిష్ఠంగా 24 నెలల్లో పూర్తయ్యేలా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది.

 Restoration Works : అమరావతి 2.0

  • రాజధాని కీలక ప్రాజెక్టుల పునరుద్ధరణకు త్వరలో శ్రీకారం

  • 15న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌ క్వార్టర్ల సహా నిర్మాణ పనులన్నీ పునఃప్రారంభం

  • 9 నుంచి 24 నెలల్లో ఆయా పనుల పూర్తికి డెడ్‌లైన్‌

(ఆంధ్రజ్యోతి-విజయవాడ)

అమరావతి రాజధాని పునరుద్ధరణ పనులు డిసెంబరు 15న ప్రారంభం కాబోతున్నాయి. 2017లో మహాయజ్ఞంలా పనులు జరుగుతూ కనిపించిన ముఖచిత్రం మరోమారు సాక్షాత్కరించనుంది. ఆయా ప్రాజెక్టులను బట్టి కనిష్ఠంగా 9 నెలల నుంచి గరిష్ఠంగా 24 నెలల్లో పూర్తయ్యేలా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. సీఆర్‌డీఏ కార్యాలయ పునరుద్ధరణ పనులను ఇటీవలే ప్రారంభించారు. ఆ తర్వాత కీలకమైన పలు భవన నిర్మాణాలు, ఎల్‌పీఎస్‌ ఇన్ర్ఫా పనులను వచ్చేనెల 15న పునఃప్రారంభిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌ అధికారుల క్వార్టర్స్‌ పనులను ఆరోజున పునఃప్రారంభిస్తారు. వీటిని మల్టీస్టోరీడ్‌ అపార్ట్‌మెంట్లుగా నిర్మించేందుకు రూ.731.30 కోట్ల వ్యయంతో గతంలో టెండర్లు పిలిచారు. ఈ భవనాల పనులు ఇప్పటికే 74 శాతం పూర్తయ్యాయి. కాంట్రాక్ట్టు సంస్థకు రూ.380.12 కోట్లు చెల్లించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చేనాటికి ఈ భవనాలకు సంబంధించి రూ.336.3 కోట్ల పనులు మిగిలి ఉన్నాయి.


అమరావతి రాజఽధాని విఽధ్వంసంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఈ పనులను నిలిపివేసింది. దీంతో ప్రస్తుత అంచనాల మేరకు సవరించి పనులు చేపట్టేందుకు సీఆర్‌డీఏ సిద్ధమైంది. ఆరు నెలల్లో పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. ఎన్‌జీవో, మంత్రులు, జడ్జీల బంగళాల పునరుద్ధరణ పనులు కూడా అదే రోజున ప్రారంభం కాబోతున్నాయి. ఎన్‌జీవో క్వార్టర్స్‌ను గత టీడీపీ ప్రభుత్వంలో మల్టీస్టోర్డ్‌ భవనాలుగా నిర్మించేందుకు రెండు దశలలో పనులను చేపట్టారు.

తొలి దశలో రూ.996.05 కోట్ల వ్యయంతో చేపట్టగా 62 శాతం మేర పనులు పురోగతిలో ఉన్నాయి. వీటికి సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.428.28 కోట్ల మేర అప్పట్లోనే చెల్లించారు. వీటిలో ఇంకా రూ.542 కోట్ల పనులు మిగిలి ఉన్నాయి. రెండో దశలో రూ.257.40 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవగా.. 3 శాతం పనులు మాత్రమే జరిగాయి. మిగిలిన రూ.213 కోట్ల పనులను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. మంత్రులు, జడ్జీల బంగళాల నిర్మాణ పనులను కూడా గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రూ.243.27 కోట్ల వ్యయంతో చేపట్టారు. వీటి పనులు 27 శాతం మేర జరిగగా, కాంట్రాక్టర్లకు దాదాపు రూ.47 కోట్ల మేర చెల్లించారు. మరో రూ.179.22 కోట్ల పనులు మిగిలి ఉన్నాయి. ఎన్‌జీవో క్వార్టర్స్‌, మంత్రులు, జడ్జీల బంగళాల పనులను 9 నెలల్లో పూర్తి చేసేలా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గవర్నమెంట్‌ టైప్‌-1, టైప్‌-2 (గ్రూప్‌ డీ), గ్రూప్‌ బీ, గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ క్వార్టర్స్‌ నిర్మాణ పనులు కూడా అదే రోజున పునఃప్రారంభించనున్నారు.


  • 2 దశల్లో ఎల్‌పీఎస్‌ ఇన్ర్ఫా పనులు..

అమరావతిలో మరో ప్రధాన ఘట్టమైన ఎల్‌పీఎస్‌ ఇన్ర్ఫా పనులనూ వచ్చేనెల 15న ప్రారంభించేందుకు సీఆర్‌డీఏ సిద్ధమైంది. జోన్‌-1, జోన్‌-2, జోన్‌-3, జోన్‌-4, జోన్‌-5, జోన్‌-6లలో ఈ పనులను చేపట్టనున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 20,482 ఎకరాల విస్తీర్ణంలో 67,912 ప్లాట్లలో రూ.12,629 కోట్ల వ్యయంతో 12జోన్లలోనూ పనులు చేపట్టారు. అప్పట్లో రూ.183 కోట్ల బిల్లులు చెల్లించారు. ప్రస్తుతం ఎల్‌పీఎస్‌ ఇన్ర్ఫా పనులను 2దశలలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో ఆరు జోన్లలో నూతన ఎస్‌ఎ్‌సఆర్‌ రేట్ల ప్రకారం పనులు చేపట్టాలన్నది అంచనా. ఈ పనులను 24 నెలల్లో పూర్తి చేసేలా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది.

Updated Date - Nov 28 , 2024 | 03:43 AM