ఎన్నికలకు సంసిద్ధమా?

ABN , First Publish Date - 2023-01-20T02:50:56+05:30 IST

తెలంగాణలో ఎన్నికలకు సంసిద్ధమా? అనే అంశంపై బీజేపీ అగ్రనేతలు రెండు రోజులపాటు కీలక చర్చలు జరిపారు.

ఎన్నికలకు సంసిద్ధమా?

బండి, కిషన్‌రెడ్డితో పార్టీ అగ్రనేతల చర్చలు

న్యూఢిల్లీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఎన్నికలకు సంసిద్ధమా? అనే అంశంపై బీజేపీ అగ్రనేతలు రెండు రోజులపాటు కీలక చర్చలు జరిపారు. ఈ మేరకు బుధ, గురువారాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) బీఎల్‌ సంతోష్‌, సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌, పార్టీ తెలంగాణ వ్యవహారాల సంస్థాగత ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ జరిపిన చర్చల్లో బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. బూత్‌ స్థాయిలో కమిటీల ఏర్పాటు మొదలు రాష్ట్రస్థాయి దాకా.. సంస్థాగత నిర్మాణం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలాబలాలు, వివిధ స్థాయిల్లో చేరికలు, ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తదితరులకు అప్పగించాల్సిన బాధ్యతలపైనా చర్చించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సల బలాబలాలు తదితర అంశాలపై క్షుణ్ణంగా బేరీజు వేసుకున్నారు. ఏ ప్రాతిపదికగా పార్టీ బలోపేతమైతే.. బీఆర్‌ఎ్‌సను ఓడించగలుగుతుందన్న విషయంపైనా నియోజకవర్గాల వారీగా విశ్లేషణలు చేశారు. మునుగోడులో పార్టీ ఓటమికి గల కారణాలను కూడా వారు సమీక్షించినట్లు తెలిసింది. రాష్ట్రంలో బీజేపీకి ఒక ఊపు తీసుకువచ్చేందుకు బండి సంజయ్‌ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. సంఘటిత శక్తిగా, నిర్మాణాత్మకంగా పనిచేసేందుకు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉందని పార్టీ అగ్రనేతలు చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే మూడు రాష్ట్రాల బీజేపీ మాజీ ముఖ్యమంత్రులు తెలంగాణలో తిరిగి సమర్పించిన నివేదికపైనా వారు చర్చించినట్లు సమాచారం. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత కూడా బండి సంజయ్‌ను ఢిల్లీలో ఉండమని బీజేపీ అధిష్ఠానం పెద్దలు కోరినట్లు తెలిసింది.

Updated Date - 2023-01-20T02:50:58+05:30 IST